mt_logo

వన జీవి రామయ్య!

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో] 

ఈయన పేరు రామయ్య!అడ్డాలనాడే ‘వృక్షోరక్షతి రక్షితః’ అన్న సూక్తిని ఒంటబట్టించుకున్నాడు ‘సొంత లాభం కొంతమానుకొని పొరుగువారికి తోడుపడవోయ్’ అన్న గురజాడ మాటలను ఆటలాడుకునే వయసులోనే అర్థం చేసుకున్నాడు యుక్తవయస్సు వచ్చేనాటికి.. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుని కనిపించిన ఖాళీ చోటల్లా మొక్కలు నాటుకుంటూ పోయాడు! అలా ఇప్పటిదాకా కోటికి పైగా మొక్కలు నాటాడు.. ప్రతిఫలం ఆయన ఆశించలేదు, ఎవరూ ఇవ్వనూ లేదు! కానీ ఈ రామయ్య ముందు వనజీవి అనే ఆప్యాయమైన పిలుపు మాత్రం ఇంటిపేరుగా నిలిచింది! ఆ వనజీవి రామయ్య ములాఖాత్ ఇది…

‘మాది ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామం. భార్య జానమ్మ. నాకు ముగ్గురు కొడుకులు, ఓ బిడ్డ. మొక్కలు నాటాలనే నా చిన్నప్పటి జిజ్ఞాసే ఊపిరిగా ఇంకా మొక్కలు నాటుతూనే ఉన్నా. మొక్కల పెంపకమే నా జీవిత లక్ష్యం అయింది. నా గురించి రాయని పత్రికా లేదు.. ప్రసారం చేయని టీవీ ఛానలూ లేదు. సహజంగా అందరూ వేసవిలో ఇంట్లో నుంచి బయటికే వెళ్లరు. కానీ నేను మాత్రం వేసవి వచ్చిందంటే చాలు అసలు ఇంట్లోనే కనిపించను. అడవులను చుడుతూ రకరకాల చెట్ల గింజలను సేకరించే పనిలో బిజీగా ఉంటా. వాటన్నింటినీ బస్తాల్లో నింపుకొని ఇంటి దగ్గర నిల్వ చేస్తా. జూన్‌లో తొలకరి చినుకులు పడ్డాయంటే చాలు.. ఆ గింజలను నాటే కార్యక్రమంలో మునిగిపోతా. రోడ్ల వెంట, చౌరస్తాల్లో, జాతరలు జరిగే ప్రదేశాల్లో చెట్లు పెరిగితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ ప్రదేశాలన్నిట్లో వివిధ రకాల చెట్లకు చెందిన విత్తనాలను చల్లుతూనే ఉంటా. అలా నేను నాటిన మొక్కలు పెరిగి పెద్దవై ఎందరికో నీడనిస్తున్నాయి. నా ధ్యాస, శ్వాస అంతా మొక్కలే. అందుకే దరిపెల్లి రామయ్యను కాస్తా వనజీవి రామయ్యగా పేరు తెచ్చుకున్న. గతంలో రాష్ట్రముఖ్యమంత్రులుగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిల నుంచి ప్రశంసలూ అందుకున్న సందర్భాలున్నాయి. అయినా నాకు ప్రోత్సాహం మాత్రం కరువైంది. వేనోళ్ల నన్ను మెచ్చుకున్నా నా లక్ష్యానికి చేయూత కల్పించే వారు మాత్రం కనిపించకపోవడం బాధే! శరీరం సహకరించని వయసులో బొటాబొటీ జీవితాన్ని అనుభవిస్తున్న నాకు పొగడ్తలే తప్ప ఏ ఒక్కరూ పట్టెడన్నం పెట్టే భృతిని మాత్రం కల్పించడం లేదు. చాలీచాలని ఇంట్లో బతకడానికే కాస్తంత తింటూ జీవనం వెళ్లబుచ్చుతున్న నాకు.. లక్ష్య సాధనలో నా భార్యే చేయూతనిస్తోంది.

ఈ ఆలోచనెలా వచ్చింది?

1960వ సంవత్సరం.. నేను 5వ తరగతి చదువుతున్న రోజులు.. తోటి స్నేహితులందరూ అగ్గిపెట్టెలతో రైళ్లు తయారు చేసుకుని ఆడుకుంటూ మురిసిపోయేవారు. నేను మాత్రం మా అమ్మ (పుల్లమ్మ) పెరట్లో బీరకాయలు ఎండబెట్టి గింజలు నాటే దృశ్యాలను ఎంతో ఆసక్తిగా గమనించేవాడిని. మనకు ఏదైనా అవసరమైతే వాటిని నేలలో నాటేయడం ద్వారా కొత్తవి పొందొచ్చనే ఆలోచన కలిగింది అప్పుడు. దీంతో వంటింట్లో అగ్గిపెట్టెను తెచ్చి పుల్లలను నేలలో నాటి కొత్త అగ్గి పుల్లల కోసం ఎదురు చూసేవాణ్ణి. అయితే వంటింట్లో అగ్గిపెట్టె కనిపించకపోయేసరికి అమ్మ ‘అగ్గిపెట్టె ఏదిరా?’ అంటూ బిగ్గరగా అడిగేది. పెరట్లోకొచ్చి చూసి ‘అణ ఖర్చు పెట్టి కొన్న అగ్గిపెట్టె ఆగం చేశావు కదరా.. !’అంటూ కోపగించుకుంది. అప్పుడు వస్తువులు కాదు. విత్తనాలు నాటితేనే మొక్కలొస్తాయనే విషయాన్ని గ్రహించా. అప్పట్నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకున్న. మొక్కలు నాటడమే పనిగా పెట్టుకున్న. లక్షల మొక్కలు నాటాను. ‘సొంత లాభం కొంత మానుకుని పొరుగు వాడికి సాయపడవోయ్’ అన్న గురజాడ అప్పారావు సూక్తిని మనసులో నిలుపుకుని నాకు తెలిసి విషయాన్ని సమాజానికి తెలియజెప్పాలనుకున్నా. పదిమందికి మేలు జరిగే పనిని తలపెట్టాలని ఆనాడే నిర్ణయించుకున్నా. తిన్న మామిడి టెంకెను కూడా వృథాగా పడేయడం నాకు ఇష్టం ఉండదు. స్నేహితులతో మామిడి తోటకు వెళితే వాళ్లు చెట్లకు రాళ్లేస్తుంటే నేను మాత్రం వాటి జోలికి వెళ్లేవాణ్ణి కాదు. బడిలో కూడా ఆట పాటలకు అంత ప్రాధాన్యం ఇవ్వకుండా స్కూల్ పెరట్లో తోటకు నీళ్లు పోసేవాడిని ఇష్టంగా. సెలవులన్నీ తోటలోని చెట్ల ఆలనాపాలనాతో గడిచిపోయేవి.

వ్యర్థ పదార్థాలే ప్రచార సాధనాలు..

ఆరోగ్యం సహకరించకపోయినా కాస్తంత సమయం దొరికిందంటే చాలు. ‘వృక్షోరక్షతి.. రక్షితః’ అని రాసి ఉండే అట్ట ముక్కలను తలకు తగిలించుకుని ప్రచార పర్వంలో మునిగిపోతా. లారీలు, బస్సుల నుంచి ఊడిపడిన రేకులు, వాడి పడేసిన టైర్లను ప్రచార సాధనాలుగా ఉపయోగించుకుంటా. కాగితపు అట్టలు, డబ్బాలు, మట్టి కుండలపై సూక్తులు రాసి ప్రచారం సాగిస్తుంటాను. ఎండ తగలకుండా తలకు టోపీ ఎలానో, ఈ నేలతల్లికి చెట్లు కూడా అలాగేనని నమ్మే నా ఇంటి నిండా సూక్తులతో కూడిన రాతలే కనిపిస్తాయి. చెట్టూ, పుట్టా తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ ఆ రాతలే దర్శనమిస్తాయి. భూమి పది కాలాల పాటు సుభిక్షంగా ఉండాలంటే చెట్లే మూలాధారం అని విశదీకరించే సూక్తులు ఇప్పటికి నాలుగువేలకుపైగానే రాశాను. అంతేకాదు.. సినిమా పాటలను, విప్లవ గీతాలను సైతం మొక్కల ప్రాధాన్యాన్ని చాటిచెప్పేలా అన్వయించి పాడుతుంటా. అంతేకాదు వ్యర్థంగా పడేసిన గ్రానైట్ రాళ్లను తీసుకొచ్చి వాటిపై కూడా చెట్ల విశిష్టతను తెలియజేస్తూ బొమ్మలను చెక్కడం నాకు దేవుడిచ్చిన వరం. సకల జీవరాశులను మోస్తున్న ఈ భూమిని చెట్లు గొడుగులా కాపాడుతున్నాయని తెలియజెబుతూ రాళ్లపై చెక్కిన బొమ్మలు నాకు ఎంతో పేరు తెచ్చాయి. అంతెందుకు… మనుమళ్లు, మనుమరాళ్లకు సైతం చెట్ల పేర్లే పెట్టి వాటిపై నాకున్న ప్రేమను చాటుకున్న. చందనపుష్ప, హరిత లావణ్య, కబంధపుష్ప, వనశ్రీ వంటి పేర్లతో వాళ్లకు నామకరణం చేశా. అంతేకాదు నా కూతురు సైదమ్మ పెళ్లి ఆహ్వాన పత్రికలో పర్యావరణ సూక్తులు ముద్రించి చెట్ల ఆవశ్యకతను తెలిపా. అలాగే అనారోగ్యంతో చనిపోయిన మా బావ మాధవరావు సమాధి దగ్గర కూడా మొక్కను నాటా.

కౌరవులు… పాండవులు

‘తమ్ముడా శత్రువు ఎంత బలంగా ఉంటాడో మనకు ముందుగా తెలియదు. అందుకే మన దగ్గర అపారమైన ఆయుధ సామగ్రి ఉండాలి..’ ఈ మాటలు శ్రీరామ చంద్రుడు తన తమ్ముడు భరతునితో అన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే వాతావరణాన్ని నలుదిక్కులా విచ్ఛిన్నం చేస్తూ మానవ మనుగడపై కత్తులు దూస్తున్న కాలుష్యాన్ని మట్టు పెట్టాలంటే కూడా మన దగ్గర అపారమైన వన సంపద ఉండాలి. ఇప్పుడు మన ప్రధాన శత్రువు కాలుష్యమే. కాలుష్యమే దుష్ట కౌరవులు, ఫలాల్నిచ్చే చెట్లే పంచ పాండవులు!అనేదే నా సూక్తి. ప్రతి మనిషీ తన జీవిత కాలంలో ఒక మొక్క నాటి దాన్ని సాకగలిగినా కాలుష్యంపై యుద్ధం ప్రకటించొచ్చు. ప్రతి మండలానికి 2 లక్షల 50 వేల మొక్కలు నాటాలి. ఈ ధ్యాస అందరిలో కలిగేందుకు ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహించాలి. మొక్కలు నాటాలనే చైతన్యం అందరిలో వచ్చేందుకు పనిగట్టుకుని, కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేయాల్సిన పనిలేదు. కూలీ నుంచి కుబేరుడి వరకూ ప్రతి రోజూ కళ్లజూసే కరెన్సీ నోట్లపై మొక్కలు నాటుతున్నట్లు కనిపించే ఫొటోలను ముద్రించాలి. ఇలా విస్తృత ప్రచారాన్ని కల్పించవచ్చు. ప్రస్తుతం కరెన్సీపై కనిపించే మహాత్మాగాంధీ, ఇంకా అలాంటి ప్రముఖులు మొక్కలు నాటుతున్నట్లుండే ఫొటోలను నోట్లపై ముద్రించడం ద్వారా ఇండియన్ కరెన్సీకి ఇతర దేశాల్లో కూడా ప్రాధాన్యం పెరుగుతుంది కదా. ఈ విధానాన్ని అమలు చేస్తే ప్రపంచ దేశాల్లో మన కరెన్సీ ‘గ్రీన్’ కరెన్సీగా మారుతుందనడంలో సందేహం లేదు. ఇలా చేస్తే ప్రభుత్వంపై ఎలాంటి భారం పడకపోగా అత్యుత్తమ నోబెల్ పురస్కారం భారతదేశానికి తప్పకుండా దక్కుతుందని నా నమ్మకం.

అరణ్య సంజీవని..

‘మా కొట్టులో బాల కార్మికులు లేరు..’ అనే బోర్డులు దుకాణాల ముందు ఎలా కనిపిస్తున్నాయో అదే మాదిరిగా ప్రతి షాపుపై మొక్కలు నాటితే కలిగే ప్రయోజనం గురించి మాతృభాషలో విరివిగా రాసి, బొమ్మలు వేయాలి. సామాన్య ప్రజలు రవాణా కోసం నిత్యం ఉపయోగించుకునే బస్సులు, ఆటోల మీద యుద్ధప్రాతిపదికన వీటిని ముద్రించేందుకు ప్రణాళిక రూపొందిస్తే కనీసం జనాభాలో సగం మందినైనా ప్రభావితం చేయొచ్చు. వారి ధ్యాసను మొక్కలవైపు మళ్లించొచ్చు. ఒక్కసారి రైళ్ల పేర్లను గమనిస్తే సూపర్ ఫాస్ట్.. ఇంటర్‌సిటీ.. కోణార్క్.. ఇలాంటి పేర్లే వినిపిస్తాయి. పర్యావరణ భావాన్ని ప్రజల్లో తట్టిలేపే ఒక్కపేరు కూడా ఏ ఒక్క రైలుకీ లేకపోవడం విచారకరం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టిసారించి పర్యావరణ కోణంలో ఆలోచించాలి. రైళ్లకు వనరక్ష, అరణ్య, సంజీవని వంటి పేర్లను పెట్టాలి. అప్పుడే జనంలో చైతన్యం కలిగి మొక్కలను పెంచాలనే భావన ఏర్పడుతుంది. మనిషికి జీవిత కాలంలో ఎన్నో లక్ష్యాలు ఉండొచ్చు. కానీ సాధ్యమైనన్ని మొక్కలు నాటాలనేదాన్ని ప్రధాన లక్ష్యంగా కలిగి ఉండాలి. ప్రపంచంలో కొందరు తిండి కోసం బతికేవాళ్లుంటారు. కానీ నేను బతకడం కోసమే తింటాను. జేబులో ఇరవై రూపాయలుంటే అందులో ఐదు రూపాయలు టిఫిన్ చేసి పదిహేను రూపాయలను ‘అందరూ మొక్కలు పెంచాల’నే ప్రచారం కోసం వినియోగిస్తారు.

ఆ జాడేదీ?

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనుల కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. అందులో పావు వంతు ధనాన్ని మొక్కల పెంపకానికి ఖర్చు చేసినా మన వాకిళ్లు ఎప్పుడో పచ్చదనంతో నిండిపోయి ఉండేవి. 1990లో పర్యావరణ వాహిని పేరుతో జిల్లా అధికారులు సమావేశాన్ని నిర్వహించేవారు. అందులో సభ్యునిగా ఉండటంతో నన్ను కూడా మీటింగ్‌కు పిలిచేవారు. ఇప్పుడు దాని జాడే లేకుండా పోయింది. పర్యావరణాన్ని పరిరక్షించాలని, మొక్కలు విరివిగా నాటాలని ప్రభుత్వం నుంచి కనీస ప్రచారం జరగకపోవడం విచారకరం. ఒక్కో మండలంలో కనీసం 2 వేల హెక్టార్లలో మొక్కలు నాటాలనే నిబంధనను ప్రభుత్వం అమల్లోకి తేవాలి. ఎంతో విలువైన ఎర్రచందనం మొక్కలను విరివిగా నాటాలి. ప్రభుత్వం కాస్త చొరవ తీసుకుని నాకు అవకాశం కల్పిస్తే బడ్జెట్ వనాలను పెంచుతా. ప్రతిఫలంగా ఏమీ ఆశించను. నిర్ణీత భూ భాగాన్ని అప్పగించి నా కుటుంబం పొట్టపోసుకోవడానికి సరిపడా ఖర్చులు ఇస్తేచాలు. ఆకాశానికి ఎగురుతున్న మనిషి తన ఒంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నాడు. కొత్త కొత్త రోగాలు పుట్టుకొచ్చి మటు మాయమైపోతున్నాడు. ఇందుకు పర్యావరణ అసమతుల్యమే కారణం. బడ్జెట్ వనాన్ని సృష్టించే బాధ్యతను నాకు అప్పగిస్తే ఎంతో విలువైన ఔషధ మొక్కలను పెంచుతా. ఆ వనంలో అంతర్జాతీయ స్థాయి మొక్కలను నాటి దేశానికే ఖ్యాతిని తీసుకొస్తా. తైవాన్‌లో పాల చెట్టు ఉంటుందట.. ఆ చెట్టుకు పాలు వస్తాయట. ‘బావో బావో’ అనే చెట్టుకు నీళ్లు వస్తాయట. ఈ రెండు అవసరాలు తీరితే ఇక మనిషికి కావాల్సింది ఏముంటుంది? వాటిని సైతం తీసుకొచ్చి నా బడ్జెట్ వనంలో వేసి బడ్జెట్‌ను సృష్టిస్తా.

పురస్కారాలెన్నో..

నాకు పదుల సంఖ్యలో పురస్కారాలు వచ్చినా కడుపు నింపని ధైన్యం అనుక్షణం వెనక్కులాగుతోంది. నాటి ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు చేతుల మీదుగా జ్ఞాపికను అందుకున్నా! ఆ జ్ఞాపిక ఓ జ్ఞాపకంగానే మిగిలింది తప్ప పట్టెడన్నమైనా పెట్టలేకపోయింది. 1995లో కేంద్ర మంత్రి సేవా అవార్డు సైతం నాకు దక్కింది. సెంటర్ ఫర్ మీడియా సర్వీస్ సంస్థ(ఢిల్లీ) నాకు నవమిత్ర అవార్డును బహూకరించింది. ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలు ప్రశంసా పత్రాలను అందించారు. గవర్నర్ సుశీల్ కుమార్ షిండే కూడా జ్ఞాపికను అందజేశారు. అలాగే జిల్లా అటవీ శాఖ పర్యావరణ పరిరక్షణ అవార్డును అందించింది. జిల్లాలో పని చేసిన కలెక్టర్లు లక్ష్మీ పార్థసారధి భాస్కర్, అజయ్‌వూపకాష్ సాహ్ని, నాళం నర్సింహారావు, గిరిధర్, రాజేంద్ర నరేంద్ర నిమ్జే, శశిభూషణ్ కుమార్ తదితర కలెక్టర్ల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నా. ఖమ్మం కళాపరిషత్ వారు ‘భారతీయుడు’ పురస్కారాన్ని అందించారు. 2005 సంవత్సరానికే కోటి మొక్కలు నాటినందుకు రాజధాని ఢిల్లీలో జయ్‌పాల్ రెడ్డి చేతుల మీదుగా సన్మానం జరిపారు. ఇలా నన్ను ప్రపంచానికి పరిచయం చేసే ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కినా నా లక్ష్యానికి మాత్రం తగిన ప్రోత్సాహం లభించకపోవడమే విచారకరం.

డాక్టర్ రామయ్య..

మొక్కలు నాటడంలో 50 ఏళ్ల ఆయన శ్రమను గుర్తిస్తూ ‘యూనివర్సల్ గ్లోబల్ పీస్’ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ మొన్న సోమవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో వనజీవి రామయ్యకు డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. మానవ జీవితంలో చెట్ల ప్రాముఖ్యతను వివరిస్తూ వృద్ధాప్యంలో సైతం అలుపెరగకుండా పోరాడుతున్న రామయ్య నిజంగా ధన్యజీవని ఆ సంస్థ ప్రతినిధులు డాక్టర్ మధు కృష్ణన్, ఏలూరి శ్రీనివాసరావు, ఏఓ శ్యాంసన్ ఆయనను అభివర్ణించారు.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *