రాష్ట్రంలోని నిరుపేదల ఆరోగ్యం కోసం ఇప్పటికే పల్లె, బస్తీ దవాఖానలు, జిల్లా ప్రధాన దవాఖానల్లో ప్రసూతిసహా అన్నిరకాల వైద్యసదుపాయలను మెరుగుపరిచిన తెలంగాణ సర్కారు తాజాగా మరో మంచి నిర్ణయం తీసుకొన్నది. మేజర్ చికిత్సలను ఉచితంగా అందించి నిరుపేదలకు ఆర్థికభారం తప్పించేందుకు ఆరోగ్య శ్రీ వైద్యసేవల పరిమితిని పెంచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచి, కొత్త కార్డులు కూడా ఇవ్వాలని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సమావేశం నిర్ణయించింది. దీంతో నిరుపేదలకు ఖరీదైన మెరుగైన చికిత్సలు కూడా ఉచితంగా అందనున్నాయి. అలాగే, నిరుపేద కుటుంబాల ఆరోగ్యానికి భరోసా లభించనున్నది.
ఆరోగ్య శ్రీ.. ఇప్పుడు సరికొత్తగా..
– తెలంగాణ సర్కారు కొత్తగా ఆరోగ్య శ్రీ కార్డును జారీ చేయనున్నది.
– ఈ కార్డు ముందుభాగంలో లబ్ధిదారు పేరు, పుట్టిన తేదీ, జెండర్, కార్డు నంబర్ ఉంటాయి.
– తెలంగాణ సర్కారు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లోగో, ముఖ్యమంత్రి ఫొటో ముద్రిస్తారు.
-కార్డు వెనుక ఆరోగ్య శ్రీ సేవలకు సంబంధించిన పూర్తి వివరాలు అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటాయి.
-ఈ కార్డుపై క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తారు. దీన్ని స్కాన్‌చేస్తే కార్డుదారు పూర్తి వివరాలు తెలిసిపోతాయి.
-ఆరోగ్య శ్రీ కార్డుల జారీ కోసం ఈ-కేవైసీ ప్రక్రియను వేగంగా పూర్తిచేయనున్నారు.
-బయోమెట్రిక్ కాకుండా ఫేజ్ రికగ్నైజేషన్‌ను అందుబాటులోకి తెస్తున్నారు.
-రూ.5లక్షల వైద్య పరిమితితో కూడిన పకడ్బందీ కార్డును అందజేయనున్నారు.