కాంగ్రెస్ పాలన అంటేనే ఠక్కున గుర్తొచ్చేది కరెంటు గోసలు.. అన్నదాతల పాలిట యమపాశాల్లా మారిన కరెంట్ వైర్లు.. సరిపడా కరెంట్, సాగునీళ్లు లేక ఎండిన పంటలు చూసి ఆగిన రైతన్న గుండెలు. ఎప్పుడొస్తుందో తెలియదు.. ఎన్ని గంటలు వస్తుందో తెలియదు.. అసలు వస్తుందా? రాదా? అనే నిత్య ఆందోళనతో అన్నదాతలు కన్నీటి సేద్యం చేసేవారు. రాత్రిపూట దొంగలు తిరిగే రాత్రి వచ్చే కరెంట్ కోసం టార్చిలైట్లు.. చేతిలో చద్దర్లు పట్టుకొని పొలంగట్ల వెంట నడుచుకొంటూ వెళ్లి బాయికాడ కావాలి పండేవారు. కరెంట్ వచ్చినప్పుడు మోటర్లు వేసి పొలం పారిచ్చుకొనేవారు. ఈ క్రమంలో విషపురుగులు కుట్టి ఎంతోమంది కాలంజేశారు. మరికొందరు కరెంటు లేక అసహనం చెంది కరెంటు తీగలు పట్టుకొని ఆత్మహత్యలు చేసుకొన్నారు. లోవోల్టేజీ సమస్యతో కాలిపోయిన మోటర్లు.. పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను రిపేర్ చేస్తూ మరికొంతమంది అన్నదాతలు మృత్యువాతపడ్డారు. కరెంట్, సాగునీళ్లు లేక.. పంటలు పండక..అప్పులు తీర్చే మార్గం తెలియక అనేమంది రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడ్డారు.. ఇలా కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు దుక్కుల దుఃఖం అనుభవించారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో కేవలం మూడేండ్లలోనే అన్నదాతకు కరెంట్ కష్టాలు దూరమయ్యాయి. 24 గంటల కరెంట్, జలవనరుల నిండా నీళ్లతో సాగు సంబురమైంది. రైతు ఇంట ఆనందం వెల్లివిరిసింది. ఈ తరుణంలో మళ్లీ కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ అంటూ అన్నదాతల గుండెల్లో గుబులు రేపుతున్నది. ఆ పాత విషాద రోజులను మళ్లీ తేవాలని ఉవ్విళ్లూరుతున్నది.
కాంగ్రెస్, టీడీపీ రెండూ దొందూ దొందే..
సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ పాలనలో తెలంగాణ రైతాంగం నరకం చూసింది. ఓ వైపు వ్యవసాయానికి కనీసం మూడు గంటల కరెంట్ కూడా చక్కగా ఇవ్వని టీడీపీ సీఎం చంద్రబాబునాయుడు విద్యత్తు చార్జీలను పెంచి, రైతుల నెత్తిన పిడుగు వేశారు. 2000 సంవత్సరం ఆగస్టులో దీనికి నిరసనగా ఉద్యమించిన అన్నదాతలపై చంద్రబాబునాయుడు బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపిస్తే ముగ్గురు అన్నదాతలు తూటాలకు బలయ్యారు. ఆనాడు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్ రైతుల పక్షాన చంద్రబాబుకు లేఖ రాసినా.. అన్నదాతల ఆత్మహత్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినా కనీసం స్పందించలేదు. దీంతో ఆరునెలలకే కేసీఆర్ టీడీపీ నుంచి బయటకొచ్చి టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఇక వ్యవసాయానికి 7 గంటల కరెంట్ అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా రైతులను కరెంట్ కష్టాల్లోకి నెట్టింది. పేరుకే ఏడు గంటలు..కానీ మూడు, నాలుగు గంటల కరెంటు కూడా ఇచ్చేది కాదు. అదికూడా రాత్రిపూట ఇవ్వడంతో అన్నదాతలు నిత్యం జాగారం చేసేవాళ్లు. అప్రకటిత కరెంటుతోనే రోజుకు ఇద్దరు రైతులు.. ఏడాదికి 600 మంది రాత్రిపూట కరెంటుకు బలైపోయారని అధికారిక గణాంకాలే చెప్తున్నాయి. వ్యవసాయంలో క్రాప్ హాలిడేలు.. పరిశ్రమలకు పవర్‌హాలిడేలు ప్రకటించిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇక లోవోల్టేజీ సమస్య, రాత్రిపూట ఒకేసారి అందరూ మోటర్లు నడిపించడంతో ట్రాన్స్‌ఫార్మర్లపై భారంపడి అవి కాలిపోయేవి. వాటిని మరమ్మతు చేసేందుకు అధికారులు కన్నెత్తి చూసేవారు కాదు.. దీంతో రైతులే తలా ఇంత వేసుకొని ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులు చేయించుకొన్న రోజులు కూడా ఉన్నాయి. నెలకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకూ ఖర్చుపెట్టుకొని ట్రాన్స్‌ఫార్మర్ బాగుచేసుకొంటే మళ్లీ నెలకే పేలిపోయేది.. ఇలా కాంగ్రెస్ పాలనలోనూ అన్నదాతలు కరెంట్‌కు కనాకష్టాలు పడ్డారు.
ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ గప్పాలు..
ఇప్పుడు సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుండగా.. ఉచిత కరెంట్ పేటెంట్ తమదేనంటూ కాంగ్రెస్ నాయకులు గప్పాలు కొడుతున్నారు. కానీ.. నాడు రైతన్నలకు ఉచిత కరెంట్ పేరిట నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీనే. పేరుకే ఉచిత కరెంట్‌గానీ ఏనాడూ సక్కగ ఇచ్చింది లేదు. ఏడు గంటల ఉచిత కరెంట్ అని చెప్పి.. ఆ తర్వాత 9 గంటలు పెంచుతున్నట్టు ఊదరగొట్టి.. వ్యవసాయానికి కనీసం 4 గంటలుకూడా ఇచ్చిన దాఖలాలు లేవు. వ్యవసాయానికి కరెంట్ కోతలపై ఆనాడు పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు. ఏ రోజు పేపర్ చూసినా.. కరెంట్ లేక పంటల మలమల.. కరెంట్‌కాటుకు రైతు బలి..ఎండిని పంటచూసి ఆగిన రైతన్న గుండె..అంధకారంలో వ్యవసాయం.. ఇలాంటి హెడ్డింగ్‌లే కనిపించేవి. ఇక రైతు ఆత్మహత్యల వార్త లేనిదే ఆ రోజు న్యూస్ పేపర్ బయలకు వచ్చేది కాదు. అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు సీఎం కేసీఆర్ నిరంతరాయంగా ఇస్తున్న నాణ్యమైన కరెంట్‌పై అవాకులు చవాకులు పేలుతున్నది. తెలంగాణ రైతాంగాన్నిమళ్లీ ఆగంజేయాలని చూస్తున్నది.