mt_logo

కాంగ్రెస్ ఫేక్ వార్తలు, లీక్ వార్తలను నమ్ముకుని రాజ్యం నడుపుతోంది: హరీష్ రావు

దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్‌లో జరిగిన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఎంతో పోరాడి, ఎన్నో త్యాగాల మీద కేసీఆర్ తెలంగాణను సాధించాడు.. పదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించాడు.. కాంగ్రెస్ నాలుగు నెలల్లో వెనక్కి తీసుకెళ్లింది అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఫేక్ వార్తలు, లీక్ వార్తలను నమ్ముకుని రాజ్యం నడుపుతోంది. వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత యువతపై ఉంది. కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలనే నమ్ముకున్నాయి.. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదు ఆని తెలిపారు.

నల్లచట్టాలు తెచ్చి 700 మంది రైతులను ప్రాణాలు తీసింది.. నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగింది. 20 కోట్లు ఉద్యోగాలు ఇవ్వలేదు, నల్లధనం వెనక్కి తీసుకురాలేదు అని విమర్శించారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో అబద్ధాలాడి గెలిచిన రఘునందన్ రావుకు మొన్నటి ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం నేర్పారు.. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని బాండు రాసిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతోంది. కాంగ్రెస్ ఉద్దరించకుండా ఉద్దెర మాటలు మాట్లాడుతోంది అని అన్నారు.

ఎన్నికల హామీలు అమలు కావాలంటే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలి. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయాలంటే మాకు బలం ఇవ్వాలి. ప్రజల మనిషి, కలెక్టర్‌గా పనిచేసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న వెంకట్రామిరెడ్డిని గెలిపించుకోవాలి అని పిలుపునిచ్చారు.

రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దు.. రూ. 500 బోనస్ వచ్చేదాకా కొట్లాడదాం.. రేవంత్ రైతులకు ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయలేదు. రైతుబంధు రూ. 15 వేలు, ఆసరా పింఛన్ రూ. 4 వేలు, నిరుద్యోగ భృతి రూ. 4 వేలు, ఉచిత కరెంట్, ఆడపిల్లలకు తులం బంగారం, స్కూటీ.. ఈ హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు.. అమలైనవాళ్లు కాంగ్రెస్ పార్టీకి, కానివాళ్లు బీఆర్ఎస్‌కు ఓటేయండి అని హరీష్ కోరారు.

నాలుగు నెలల్లోనే ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. సాగు నీళ్లు రాలేదు . మంచి నీళ్లు రాలేదు. 24 గంటల కరెంట్ బంద్ అయింది.. కేసీఆర్ హయాంలో అమలైన కేసీఆర్ కిట్ బంద్ చేశారు.. అభివృద్ధి కొనసాగించకుండా అడ్డుకుంటున్నారు అని దుయ్యబట్టారు.