కలహాలకు, అంతర్గత రాజకీయాలకు కాంగ్రెస్ పెట్టింది పేరు. ఆ పార్టీ నాయకులు సీట్లకోసమే కాదు.. సొంత పార్టీ నాయకులనే ఓడించి పార్టీలో తమ ఆధిపత్యాన్ని చలాయించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. తమ పేరు కోసం ఎంతకైనా తెగిస్తారు. ఓ వర్గం హస్తం నేతలు.. మరో వర్గాన్ని కిందికితోస్తూ రాజకీయ జూదం ఆడుతారు. ఖమ్మంలో తమ సత్తాచాటుతామని బయటకు ధీమాగా బొంకుతున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయం అక్కడ రంజుగా మారింది. ఖమ్మం రాజకీయంలో చక్రంతిప్పుతానని ఇటీవల హస్తంగూటికి చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి దెబ్బమీద దెబ్బ తగులుతున్నది.
కాంగ్రెస్‌లోకి తుమ్మల.. రేవంత్ వ్యూహమేనా?
ఖమ్మం కాంగ్రెస్‌లో సీట్ల కోసం, తమ పట్టుకోసం అటు పొంగులేటి.. ఇటు ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌదరి తహతహలాడుతున్నారు. అయితే, వీరికి టీపీసీసీ చీఫ్ రేవంత్ గట్టి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి తుమ్మల నాగేశ్వర్‌రావును రేవంత్ ఆహ్వానించి.. సరికొత్త ఎత్తుగడ వేశారు. తన డబ్బు బలంతో ఖమ్మం కాంగ్రెస్‌లో కింగ్‌మేకర్ అవుదామనుకొన్న పొంగులేటికి చెక్ చెప్పేందుకే రేవంత్ వర్గం ఈ కొత్త కుట్రకు తెరలేపిందనే వాదనలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో తుమ్మలను ఓడించేందుకు పొంగులేటి అంతర్గత కుట్ర చేసిన విషయం బహిరంగమే. ఇప్పుడు పొంగులేటిపై తుమ్మల అనే అస్త్రాన్ని ప్రయోగించేందుకు రేవంత్‌వర్గం చూస్తుండటం ఖమ్మం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న పొంగులేటి.. తుమ్మల రాకతో అయోమయంలో పడిపోయాడు. మరోవైపు ఇటీవల కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేస్తానని ప్రకటించిన షర్మిల కూడా ఖమ్మంపైనే గురిపెట్టారు. దీంతో ఆదినుంచీ ఖమ్మంలో కొలువుదీరిన ఖమ్మం ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌదరి తన పట్టునిలుపుకొనేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. పొంగులేటి, తుమ్మల, షర్మిల, రేణుకాచౌదరి.. ఇలా ఎవరికివారే ఖమ్మంలో తమ ఆధిపత్యం కోసం రసరంజు రాజకీయం నడుపుతున్నారు.