mt_logo

కాంగ్రెస్ కరోనా కన్నా డేంజర్: మంత్రి సింగిరెడ్డి

రైతుబంధు పంపిణీ చేయొద్దని ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే లేఖ రాయడంపై ఒక ప్రకటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు.  రైతన్నలు కాంగ్రెస్ కుట్రలను గమనించాలని మంత్రి సూచించారు.  కాంగ్రెస్‌ను నమ్మితే నట్టేట మునగడం ఖాయమని స్పష్టం చేసారు. అంత పెద్ద కరోనా విపత్తులోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఉన్నతంగా ఆలోచించి రైతుబంధు ఆగనివ్వలేదని గుర్తు చేశారు.

కరోనా దెబ్బకు ప్రపంచం విలవిల్లాడుతున్నా తెలంగాణలో ఏడు వేల పైచిలుకు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల కోసం ఆన్ గోయింగ్ పథకాన్ని ఆపాలంటూ ఏఐసీసీ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ రాసి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుందన్నారు. అధికారం మీద తప్ప కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద గానీ, వ్యవసాయం మీద గానీ ప్రేమ లేదని తేల్చి చెప్పారు.  నాడు కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం లాఠీ దెబ్బలు తిన్నాం .. కరువుతో అల్లాడి అంబలి కేంద్రాల కోసం ఎదురుచూశామన్నారు. 

పచ్చగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ఆకలిచావులు, ఆత్మహత్యలు,  కరెంటు కోతలు, వలసలకు నిలయమైందన్నారు. అధికారం కోసం కర్ణాటకలో అడ్డగోలు హామీలు ఇచ్చి ఆరు నెలలు కాకముందే చేతులు ఎత్తేసిందని తేల్చిచెప్పారు.  ఇప్పుడు రైతుబంధు వద్దని లేఖ రాయడం కాంగ్రెస్ అనైతికతకు నిదర్శనం అని పేర్కొన్నారు.