mt_logo

తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలను అక్రమ కేసులతో వేధిస్తున్న కాంగ్రెస్!

పొద్దున లేస్తే తమది ప్రజాపాలన అని ఊదరగొట్టే కాంగ్రెస్ పార్టీ.. వాస్తవానికి మాత్రం తెలంగాణలో ప్రతీకార పాలన సాగిస్తుంది అని.. నియంతృత్వ పోకడలతో, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని ప్రజాస్వామికవాదులు మండిపడుతున్నారు.

సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు చేసే వాళ్లపై కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఇప్పటివరకు జరిగిన పలు ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను రేవంత్ సర్కార్ టార్గెట్ చేస్తుంది.. కేసులు, నోటీసుల పేరుతో వేధిస్తుంది అని బీఆర్ఎస్ నాయకులు దుయ్యబడుతున్నారు.

కేవలం సోషల్ మీడియాలోనే కాదు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్ స్టేటస్ పెట్టినా.. గ్రామాల్లోని వాట్సాప్ గ్రూపుల్లో ప్రజా సమస్యల గురించి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఏదైనా మెసేజ్ పెట్టినా కూడా రేవంత్ ప్రభుత్వం భరించలేకపోతుంది అని గత 9 నెలల్లో జరిగిన సంఘటనలు మనకు చెప్పకనే చెబుతున్నాయి.

ఉస్మానియా యూనివర్సిటీ సెలవులకు సంబంధించి ఫేక్ సర్క్యూలర్ పోస్ట్ చేశాడని ఆరోపిస్తూ.. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ మీద ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ ఫిర్యాదు చేశారు. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన సర్క్యూలర్ ఫేక్ అని క్రిశాంక్ ఎత్తిచూపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురదచల్లాలనే నెపంతో రేవంత్ ఫేక్ సర్క్యూలర్ పోస్ట్ చేశారని స్పష్టంగా అర్ధమైనప్పటికి.. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్‌తో క్రిశాంక్ పై అక్రమ కేసు బనాయించారు.. రిమాండ్ కూడా చేసి సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు జైలుకు కూడా పంపించారు.

ఇదొక్కటే కాదు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం కూడా గడవలేదు.. కానీ క్రిశాంక్‌పై ఇప్పటికే సుమారు 10 కేసులు నమోదయ్యాయి. వారు చేసే విమర్శల్లో ఎటువంటి అసభ్యకరమైన పదజాలం, మార్ఫింగ్‌లు లేకపోయినప్పటికీ.. కేవలం కాంగ్రెస్ చేస్తున్న తప్పులు ఎత్తిచూపుతున్నారనే అక్కసుతో పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు.

కాంగ్రెస్ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్న తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరక్టర్ దిలీప్ కొణతం మీద కూడా రేవంత్ సర్కార్ కక్ష కట్టింది.. అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తుంది.

ఆర్టీసీ లోగో విషయంలో తప్పుడు ప్రచారం చేశాడని ఆరోపిస్తూ దిలీప్‌పై ఆర్టీసీ తరపున ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. వాస్తవానికి ఆర్టీసీ లోగో మారింది అని పలు మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలు, సదరు న్యూస్ ఛానెళ్ల సోషల్ మీడియా ఖాతాల్లో వేసిన కొత్త లోగోని దిలీప్ కేవలం తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. కొన్ని మీడియా సంస్థలు పోస్ట్ చేసిన లోగోని షేర్ చేసినందుకు.. ఆర్టీసిని వాడుకొని దిలీప్‌పై అక్రమ కేసు బనాయించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు.

తాజాగా.. తనకు ఎటువంటి సంబంధం లేని ఒక సోషల్ మీడియా పోస్టు విషయంలో దిలీప్‌ని పోలీసులు ఇంటి నుండి తీసుకెళ్ళి.. విచారణ పేరుతో గంటల పాటు సీసీఎస్ కార్యాలయంలో నిర్బంధించారు. చివరకి కోర్టులో ఈ కేసు నిలవదు అని తేలడంతో నోటీస్ ఇచ్చి ఇంటి దగ్గర దింపేశారు.

నిజానికి.. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న తప్పిదాలను, అవకతవకలను బీఆర్ఎస్ నాయకులు, పార్టీ సోషల్ మీడియా విభాగం, మద్దతుదారులు విజయవంతంగా సోషల్ మీడియాలో ఎండగడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ దాడిని ఎదుర్కోలేకే కేసుల పేరుతో ప్రశ్నించే గొంతుకలు అణిచివేయాలని ప్రయత్నిస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేవలం సోషల్ మీడియానే కాదు.. ప్రజా సమస్యలను కవర్ చేసే జర్నలిస్టులను కూడా కాంగ్రెస్ సర్కార్ వేధిస్తుంది.. కాంగ్రెస్ కార్యకర్తలైతే ఏకంగా సీఎం సొంతూరిలోనే మహిళా జర్నలిస్టులపై దాడి చేశారు.

రేవంత్ ప్రభుత్వం బనాయిస్తున్న ఈ కేసులన్ని రాజకీయ ప్రేరేపితమైనవే అని స్పష్టంగా అర్థమవుతుంది.