mt_logo

రాజకీయం కోసం రైతుల పొలాలను ఎండబెట్టొద్దు: మేడిగడ్డలో మాజీ మంత్రి సింగిరెడ్డి

రాజకీయాన్ని, వ్యవసాయన్ని ఒకే గాటన కట్టొద్దు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి హితవు పలికారు. మేడిగడ్డ పర్యటనలో సింగిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

మేడిగడ్డలో కుంగింది మూడు పిల్లర్లే. తప్పులు జరిగి ఉంటే ఉన్నతస్థాయి విచారణ జరిపి శిక్షలు పడేలా చూడండి. అంతేగాని రైతుల పొలాలను ఎండబెట్టొద్దు.. రైతాంగం ఉసురు పోసుకోవద్దు అని మనవి చేశారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ ఒక బరాజ్ మాత్రమే. ఇది కాకుండా సుందిళ్ల, అన్నారం బరాజ్‌లు, పంప్ హౌస్‌లు, అండర్ గ్రౌండ్ టన్నెళ్లు, రిజర్వాయర్లు, ఓపెన్ కెనాళ్లతో 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సిస్టమ్ అభివృద్ది చేసి ఉన్నది. వీటన్నింటినీ పక్కకు పెట్టి కుంగిన మూడు పిల్లర్లను చూపి ఇదే మొత్తం ప్రాజెక్ట్ అని దుర్భుద్దితో దుష్ప్రచారం చేస్తున్నారు అని అన్నారు.

ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మేడిగడ్డను సరిచేయాలి. లేకుంటే గడపగడపకూ వెళ్లి రైతులను చైతన్యం చేస్తాం.. ఇంటికో వంద జమచేసి ఇంజనీర్ల సహకారంతో రైతులతోనే దీనిని రిపేర్ చేయించుకుంటాం అని తెలిపారు.

రాజకీయాన్ని, వ్యవసాయాన్ని కాంగ్రెస్ కలిపి చూడొద్దు.. ఏ ప్రభుత్వమైనా రైతుల కడగండ్లు తీర్చాలి. రైతుబంధు ఇవ్వకున్నా అప్పుచేసి సాగుచేసిన పంటలు ఎండి రైతులు అవస్థపడుతున్నారు. నీటిలభ్యత కోసమే మేడిగడ్డ బరాజ్.. తుమ్మిడిహెట్టిని వదిలిపెట్టింది అందుకే.. ప్రాజెక్టు అంతిమలక్ష్యం రైతులకు సాగునీరు అందించడమే అని సింగిరెడ్డి పేర్కొన్నారు.

2007లో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్లకు సంకల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో, పక్కన మహారాష్ట్రలో అధికారంలో కాంగ్రెస్.. 2007 నుండి 2014 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క అనుమతి తీసుకోలేదు. ఉమ్మడి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదనలను మహారాష్ట్ర కాంగ్రెస్ సర్కారు తిరస్కరించింది అని గుర్తు చేశారు.

అప్పుడు మంత్రిగా ఉన్న ఉత్తమ్ ఇప్పుడు కేసీఆర్ తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సి ఉండె అని మాట్లాడడం అత్యంత చెత్తగా, జుగుప్సాకరంగా ఉంది.. మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం, CWC నీటి లభ్యత పై ఎగువ రాష్ట్రం వాటా వంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రయోజనం మరియు రైతుల ప్రయోజనం కొరకు నిపుణులు ఇతర ప్రభుత్వ ఏజెన్సీల సూచనలను పరిగణలోకి తీసుకొని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం మల్టీ ఫేస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు, మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని రికార్డ్ సమయంలో నిర్మించారు అని తెలియచేశారు.

కాంగ్రెస్ మాదిరిగా ప్రాజెక్టుల నిర్మాణం దశాబ్దాల పాటు సాగతీయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని జీర్ణించుకోలేక లేని అభాండాలని వేసి రాజకీయ లబ్ది కొరకు సత్య దూరం మాటలు మాట్లాడటం సిగ్గు చేటు.. అనవసర పంతాలు, ప్రతిష్టకు పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రయత్నం చేస్తుంది అని విమర్శించారు.

తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్ నీళ్లు, కరెంటు, పెట్టుబడి గాని ఇబ్బంది లేకుండా చేసి, పండిన పంటలు కొనుగోలు చేసి రైతులను సంతోష పెట్టారు. కాంగ్రెస్ వచ్చాక మళ్లీ రైతులకు కరంటు కట కట, నీటికి కట కట, రైతుబంధుకు కట కట ఏర్పడింది.. మూడెకరాల రైతుబంధుకు మూడు నెలల సమయం తీసుకున్నారు అని అన్నారు.

కాంగ్రెస్ వచ్చాక ఏర్పడిన దుర్భర పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. రాష్ట్రంలో వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి.. బర్లు, ఆవులు, గొర్రెల మేతకు రైతులు పంటలను వదిలేశారు. కాళేశ్వరంలో పొరపాటు జరిగితే ఆ తప్పును తేల్చేందుకు ఒక కమిటీ వేయండి .. అది సాంకేతిక తప్పిదమా? మానవ తప్పిదమా? అనేది నిర్ధారణ చేయండి అని సింగిరెడ్డి సూచించారు.

ఉద్దేశపూర్వక తప్పిదం అని తేలితే దానికి శిక్షలు వేయండి.. అంతేగాని రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు శిక్ష వేస్తారా? ఇదేం పరిపాలన?గతంలో కడెం ప్రాజెక్టు కొట్టుకు పోలేదా? శ్రీశైలం పంప్ హౌస్ నీట మునగలేదా? కల్వకుర్తి ఎత్తిపోతల రెండు సార్లు నీట మునగలేదా? సాగర్‌కు ముప్పు ఏర్పడలేదా? మూసీ, ప్రకాశం బరాజ్ గేట్లు కొట్టుకుపోలేదా? అని దుయ్యబట్టారు.

అనుకోకుండా జరిగేటివే ప్రమాదాలు.. అటువంటి ప్రమాదాలను నివారించేందుకు ఏం చేయాలో చర్యలు తీసుకోవాలి. ప్రపంచంలో ఇదే మొదటిసారి జరిగినట్లు చిత్రీకరించడం తగదు.. కాంగ్రెస్ వెకిలితనం, లేకి తనం, చిన్న బుద్దిని, కురచబుద్దిని, రైతాంగం మీద ఉండే కుట్ర ధోరణిని, కేసీఆర్ మీద ఉన్న అక్కసును కక్కేందుకే ఇలా చేస్తున్నారు అని అన్నారు.

రైతుల దుఖం చూస్తే బాధనిపిస్తుంది.. నీళ్లిచ్చి రైతుల పంటలు కాపాడమంటే కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్ వాగ్దానాలు అమలు చేయలేక.. గత ప్రభుత్వ విజయాలను చిన్నగ చేసి చూయించి ప్రజలను మభ్యపెట్టడం లక్ష్యంగా కాంగ్రెస్ చర్యలు ఉన్నాయి.. ప్రపంచంలోనే నది నీళ్లను రివర్స్ పంపింగ్‌తో వెనక్కి పంపే అరుదైన ప్రాజెక్టు కాళేశ్వరం సింగిరెడ్డి గుర్తు చేశారు.