mt_logo

రైతులను కాంగ్రెస్ దెబ్బ మీద దెబ్బ కొడుతుంది: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల సమస్యలపై తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిర్వహించారు.

ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులను కాంగ్రెస్ దెబ్బ మీద దెబ్బ కొడుతుంది.. రేవంత్ సర్కార్‌ది అన్ని రంగాల్లో మెగా మోసం, వంచన. రైతులకు ఎకరాకు రూ.10 వేలు పంట నష్టపరిహారం ఇవ్వాలి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తమంటే రాజకీయ గేట్లు ఎత్తాం అంటున్నారు.. రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వచ్చింది అని తెలిపారు.

వడగండ్లవాన, అకాల వర్షాలతో పంటలు పోయి రైతులు బాధలో ఉంటే ఒక్క మంత్రి వారికి భరోసా ఇవ్వడం లేదు. గత ఏడాది అకాల వర్షాల నేపథ్యంలో పంటలు దెబ్బతింటే వికారాబాద్, వరంగల్ జిల్లాలో పంటలు దెబ్బతింటే స్వయంగా నేను, కేసీఆర్ గారు పర్యటించి ధైర్యం కల్పించాం.. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రకారం రూ. 2,000-2,500 అంచనా వేసినా కూడా రైతుకన్నా మించిన వాడు లేడని ఎకరాకు రూ.10 వేల పంట సాయం అందించాం.. ఒకే రోజు రూ. 1,300 కోట్లు విడుదల చేశాం.. తర్వాత మిగతా వాటికి అందించాం అని గుర్తు చేశారు.

అప్పుడు ఎకరాకు రూ.10 వేలు బిచ్చం వేస్తున్నారా ? అని ఇదే రేవంత్, కాంగ్రెస్ నేతలు అన్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో పంటలు ఎండిన రైతులు, అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.. వెంటనే జీఓను విడుదల చేయాలి. మీకు రైతుల మీద అంతలా ప్రేమ ఉంటే మాకన్నా ఎక్కువ ఇచ్చి చూపండి అని నిరంజన్ రెడ్డి అన్నారు.

అదిలాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలలో వేలాది ఎకరాల్లో పంటలు అకాల వర్షాలకు దెబ్బతిన్నాయి.. 3.5 ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు.. 80 శాతం అంటూ అబద్ధాలు.. అడిగితే చెప్పుతో కొడతాం అంటున్నారు.. వంద రోజుల్లో వ్యవసాయాన్ని అతలాకుతలం చేస్తున్నారు అని వాపోయారు.

గ్రామాలకు తిరిగివచ్చి వ్యవసాయం చేసే పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం కల్పిస్తే.. వద్దు ఈ వ్యవసాయం అనే పరిస్థితులు కాంగ్రెస్ వాళ్ళు కల్పించారు. జలాశయాల్లో ఉన్న నీళ్లను అంచనా వేసి రైతుల పంటల సాగుకు సూచన చేయమంటే ఒక్కనాడు ప్రభుత్వం సమీక్ష చేయలేదు.. రైతులకు నీళ్లు ఇచ్చి గతంలో ఏమన్నా తప్పులు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోండి.. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే దురుద్దేశంతో రైతులను ఇబ్బంది పెట్టవద్దు అని సూచించారు.

కాంగ్రెస్ చర్యలను రైతులు గమనించాలి.. కాంగ్రెస్ పార్టీని నమ్మితే వచ్చిన మార్పును గమనించాలి. అప్పట్లో రైతులకు చిన్న ఇబ్బంది కలిగినా వారి దగ్గర వాలిపోయి భరోసానిచ్చాం.. అన్ని మీడియాల్లో జిల్లాలల్లో గంగమ్మ కోసం రైతుల గోస, పంట కాపాడుకునేందుకు రైతుల గోస, పంటను పశువులకు వదిలేసిన రైతులు అన్న వార్తలు వస్తున్నాయి.. రాష్ట్రంలో దాదాపు 2.5 కోట్ల మంది ప్రజలు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.. వారికి భరోసా కల్పించాలి.. కానీ రాష్ట్రంలో ఒక్క మంత్రి, ఒక్క ఎమ్మెల్యే రైతుల వైపు కన్నెత్తి చూడలేదు అని పేర్కొన్నారు.

కేసీఆర్ అప్పులు చేశాడని అభాండాలు వేశారు.. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 100 రోజులకే రూ.16,400 కోట్లు అప్పు చేశారు. అప్పులు చేశారు మరి రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వలేదు? గుత్తేదారులకు మాత్రం బిల్లులు ఇస్తారా? చేసిన అప్పులతో ఏం చేస్తున్నారు?.అమెరికా సహా అన్ని దేశాల్లో అప్పులు అనేవి ఆర్థిక వ్యవస్థలో భాగం.. వాటితో వనరులు సమకూర్చుకుని సంపద సృష్టిస్తారు అని నిరంజన్ రెడ్డి అన్నారు.

నిరుద్యోగులకు అరచేతిలో స్వర్గం చూపి ఇప్పుడు మొండి చేయి చూయిస్తున్నారు.. కేసీఆర్ సర్కారు ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను ఒక్క నోటిఫికేషన్ వేయకుండా మేము ఇచ్చాం అని చెప్పుకోవడం సిగ్గుచేటు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎఓ, ఎస్ డబ్లూఓ, డీఎస్సీలో 5 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు గత ప్రభుత్వంలో శ్రీకారం చుట్టినవే.. కానిస్టేబుల్, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు గత ప్రభుత్వానివే.. వీళ్లు వచ్చి నియామక పత్రాలు ఇచ్చారు.. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అని యువతకు మొండి చేయి చూపారు. గత ఏడాది 5 వేల టీచర్ పోస్టులు ప్రకటిస్తే.. 21 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ అన్నారు.. మరి 11 వేల ఉద్యోగాలనే ఎందుకు ప్రకటించారు అని ప్రశ్నించారు.

విద్యార్థినులకు ఎలక్ట్రిక్ బైక్‌లు.. యువతకు నిరుద్యోగ భృతి అని అడ్డగోలుగా అధికారం కోసం హామీలు ఇచ్చారు. యువతకు కాంగ్రెస్ చేసింది మేలు కాదు మోసం.. యువత దీనిని అర్దం చేసుకోవాలి. కానిస్టేబుళ్ల 46 జీఓను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తాం అన్నారు.. ఇప్పుడు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు.. గ్రామాల్లో యువత దీనిని గమనించాలి అని కోరారు

అబద్ధాలతో యువతను మోసం చేశారు.. నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో యువతను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండు లక్షల ఉద్యోగాలలో కేసీఆర్ ప్రభుత్వం లక్ష 60 వేల ఉద్యోగాలు ఇచ్చింది.. మిగిలిన 40 వేలు వివిధ దశల్లో ఉన్నాయి. అందులో ఉన్న 30 వేల ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నియమక పత్రాలు ఇచ్చింది.. యువత దీనిని గుర్తించాలి అని నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.