తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్న పట్టనట్లు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు, నల్లగొండ, ఖమ్మం రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. తొమ్మిదిన్నరేళ్లు తెలంగాణకు రక్షణ కవచంగా కేసీఆర్ పాలన కొనసాగింది. ఎన్ని వత్తిళ్లు ఎదురైనా రాష్ట్ర ప్రయోజనాల కోసమే నిలబడ్డాం అని అన్నారు.
సీలేరు, ఏడు మండలాలు ఆంధ్రాలో కలపడం మీద ఆ రోజు కాంగ్రెస్ నోరు మెదపలేదు. ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ ఎందుకు స్పందించలేదు. నీటి వాటాలో తెలంగాణ నష్టపోయినందుకే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలుయింది. తొమ్మిదిన్నరేళ్లలో నదుల్లో నీటి వాటా కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ మాట్లాడలేదు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటా తేలే దాకా ఏ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ఒప్పుకోమని కేసీఆర్ ప్రభుత్వం తేల్చిచెప్పింది. దాని మీద స్టేటస్ కో కొనసాగిస్తూ వస్తున్నది అని పేర్కొన్నారు.
ఈ నెల జనవరి 17 నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ సమావేశానికి హాజరైన తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు అక్కడి మినిట్స్ చూసి అభ్యంతరం చెప్పకుండా అంగీకరించి వచ్చారు కేఆర్ఎంబీ పరిధిలోకి సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు వస్తాయన్న నిర్ణయానికి అంగీకరించి వచ్చారు. 15 ఔట్ లెట్లు అప్పనంగా అప్పజెప్పి వచ్చారు. మీ అనుమతి లేకుండా అక్కడ మినిట్స్ రాసినట్లయితే వెంటనే ఆ విషయం స్పష్టం చేయాలి. ఇప్పుడు కేఆర్ఎంబీ అనుమతి లేనిది ఆ డ్యాంల మీదికి అడుగు పెట్టే పరిస్థితి ఉండదు. తెలంగాణకు సాగునీళ్లు, తాగునీళ్లు ప్రశ్నార్థకం చేసి వచ్చారు. బయటకు వచ్చాక కుంటిసాకులు చెబుతున్నారు అని దుయ్యబట్టారు.
రాష్ట్ర ప్రభుత్వ చర్యల మూలంగా పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల, సాగర్, శ్రీశైలంతో పాటు కొత్త ప్రాజెక్టులకు గండి పడుతుందని.. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓట్లేసిన పాలమూరు, నల్లగొండ, ఖమ్మం ప్రజల గొంతుకోసి… ఆంధ్రా ప్రయోజనాల కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు తెలంగాణ ప్రభుత్వం వంత పాడుతున్నది అని నిరంజన్ రెడ్డి విమర్శించారు.
థర్మల్ విద్యుత్ మీదనే ఆధారపడే దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్నది. తక్కువ ధరకు వచ్చే కరంటు స్థానంలో ఎక్కువ ధరకు వచ్చే కరంటు వైపు మొగ్గు చూపారు. ఇది వ్యక్తుల పంచాయతి కాదు .. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినది. మీ తప్పు లేకుంటే వెంటనే కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి. కేఆర్ఎంబీ పేరుతో ఆంధ్రాకు లాభం చేకూరుస్తున్నారు .. చంద్రబాబు అయినా, జగన్ అయినా దానికి అదే ఆశిస్తున్నారు అని అన్నారు.
తెలంగాణలో తన శిష్యుడు రాజ్యం ఏలుతున్నాడని చంద్రబాబు సంతోష పడుతున్నాడు. చంద్రబాబు శిష్యుడు విదేశాల్లో తిరుగుతూ కేసీఆర్ గారిని బొందపెడతానని అంటున్నాడు. బొంద పెడతాను అన్న వాళ్లు అందరూ బొందలో కలిసిపోయారు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
గోదావరి బేసిన్ లో రైతులకు సాగునీళ్లు ఇవ్వకుండా కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. గోదావరి, కృష్ణా నదుల మీద ప్రాజెక్టుల విషయంలో మిగిలిపోయిన పనులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులకు అదనంగా ఏం చేయగలరో చేసి చూయించండి అని సవాల్ విసిరారు.
కర్ణాటకలో అప్పర్ భద్రాకు జాతీయహోదా ఇచ్చిన కేంద్రం తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వం అని చెప్తే చేతులు ముడుచుకుని ఎందుకు వచ్చారు ? మేనిఫెస్టోలో జాతీయహోదా తెస్తామని చెప్పిన కాంగ్రెస్ ఎందుకు మాట్లాడదు.. తెలంగాణకు కావలి కుక్కలం అని చెప్పే మేధావులు ఎందుకు నోరు మెదపడం లేదు? అని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కటే స్థానానికి జరగాల్సిన ఎన్నికలు రెండు సార్లు చేసి రెండుస్థానాలు తెచ్చుకుని కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనన్న విషయం స్పష్టం చేశారు. కేసీఆర్ కేంద్రంతో సన్నిహితంగా లేకుండా నష్టం చేశారన్న రేవంత్ రెడ్డి.. ఈ విషయంలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి. వెంటనే ఈ దిశగా చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు.
మీడియా సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పాల్గొన్న అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, మాజీ కార్పోరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.