mt_logo

అబద్ధాలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కింది: బీఆర్ఎస్ పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రామగుండంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్  సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. గడిచిన ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులను నిరాశ, నిస్పృహకు గురిచేశాయి.. కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన ప్రసక్తి లేదు.. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఇలాంటి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ తెచ్చిన పార్టీ. ఎన్నికల ఫలితాలను మనం స్వాగతించాలి అని పేర్కొన్నారు.

తెలంగాణ రాకముందు ఎలాంటి పరిస్థితి ఉన్నది.. కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో చేసిన సంక్షేమం, అభివృద్ధి దేశంలో ప్రజలకు తెలుసు. తెలంగాణ రాకముందు 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్, టీడీపీ పాలకుల పాలనలో ప్రజల ఇబ్బందులు పడ్డారు అందరికి తెలుసు.. సాగునీళ్లు, ఉచిత కరెంటు ఆనాటి ముఖ్యమంత్రులు తలుచుకుంటే ఇవ్వలేరా.. కానీ ఎందుకు ఇవ్వలేదు.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు సాధ్యమైంది అని అన్నారు.

గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్న చూస్తూ ఉన్నారు తప్ప.. వాటిని ఒడిసిపట్టి వ్యవసాయానికి సాగు నీళ్లు ఇచ్చి సస్యశ్యామలం చేయాలని ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సోయి ఎందుకు లేదు.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి, నీళ్ళను ఒడిసిపట్టి రైతులకు అందించింది నిజం కాదా అని ఈశ్వర్ ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రే స్వయంగా రైతుబంధు అడిగితే చెప్పు తీసి కొడతా అంటున్నారు.. అభివృద్ధి, సంక్షేమం గురించి కాంగ్రెస్ మాట్లాడకుండా కాళేశ్వరం, కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు అందిన నీళ్లు.. కాంగ్రెస్ పార్టీ పాలన నీళ్లు ఎందుకు రావడం లేదు అని అడిగారు.

కాంగ్రెస్ ఇచ్చిన ఆచరణ యోగ్యం కానీ హామీలను నమ్మి ప్రజలు ఓటు వేసి, మోసపోయి గోసపడుతున్నారు.. పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఓటు వేస్తే మేము ఏం చేసినా నడుస్తుంది, మాకే ప్రజలు ఓటేశారు.. రేపు ఆరు హామీల విషయంలో ఎన్నికల తర్వాత అమలు చేసనా చేయకున్న మా ప్రభుత్వం నడుస్తుంది అని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ పాలనలో మళ్ళీ రాష్ట్రం 10 సంవత్సరాల వెనక్కి వెళ్లింది అని దుయ్యబట్టారు.

కాళేశ్వరం ప్రాజెక్టు భారీ వర్షాలకు వరదా ద్వారా ఒక పిల్లర్ కుంగిపోయింది.. దానికి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని, అసత్య ప్రచారం.  కేసీఆర్ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్.. కాళేశ్వరం అంటే కేసీఆర్.. రానున్న ఎన్నికల్లో వరి కోతలు వస్తాయి.. రైతుబంధు ఇవ్వలేదు.. రూ. 500 రూపాయల బోనస్ ఎలా ఇస్తరో చూడాలి అని అన్నారు.

రైతుబీమా కోసం కేసీఆర్ ఎల్ఐసీ కంపెనీకి రూ. 18 వేల కోట్లు రూపాయలు చెల్లించారు.. 2 కోట్ల 50 లక్షల మందికి రంజాన్, దసరా, క్రిస్మస్ పండుగలకు చీరలు అందించి సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధిని కల్పించింది కేసీఆర్ కాదా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సుతో ఆటో డ్రైవర్ల నడ్డి విరిచి 38 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణం అయింది అని ఈశ్వర్ విమర్శించారు.

30 సంవత్సరాలు ఎలాంటి మచ్చలేకుండా ప్రజల మధ్య ఉన్న నాయకున్ని… సాధారణమైన మనిషిగా జీవితం ప్రారంభించి, ఈ స్థాయికి వచ్చాను.. నా కుటుంబమే సింగరేణి కుటుంబం. అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కావచ్చు.. కాని గెలిచేది మాత్రం పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలే.. ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ తామే అభ్యర్ధిగా పనిచేయాలి అని కోరారు.

కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ పాలన కుటుంబ పాలన అన్నారు.. కానీ పెద్దపల్లి పార్లమెంట్లో చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వారే, ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా కొడుక్కే మరి ఇది కుటుంబ పాలన కాదా. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. రూ. 50 వేల కోట్లకు అధిపతులు, టూరిస్ట్ నాయకులు, ఇలాంటి వారు ఎన్నికలు రాగానే కనిపిస్తారు.. వాళ్ళు గెలిస్తే హైదరాబాద్‌లో ఉంటూ వారి వ్యాపారాలు చూసుకుంటారు. ఈ మట్టికి వారికి ఏమైనా సంబంధం ఉందా.. వలస పక్షులు వస్తారు, పోతారు అని పేర్కొన్నారు.