mt_logo

దివ్యాంగులకు రూ.4016, బీడీ టేకేదారులకు రూ.2,016 పింఛన్‌ పంపిణీ కార్యక్రమాన్ని మెదక్‌లో ప్రారంభించిన సీఎం కేసీఆర్

బుధవారం మెదక్ జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయం వేదికగా దివ్యాంగులకు పెంచిన పింఛన్లను, కొత్తగా బీడీ టేకే దార్లకు ఆసరా పింఛన్ల పంపిణీని సీఎం కేసీఆర్ గారు ప్రారంభించారు. పలువురు లబ్దిదారులకు ఈ ప్రయోజనాలను అందించారు. అనంతరం సీఎం కేసీఆర్ గారు ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.

కొన్ని రాష్ట్రాల సెక్రటెరియట్‌లు కూడా ఇంత గొప్పగా లేవు 

తెలంగాణ రాకముందు మీకు పరిపాలన చేతకాదన్నారు. తెలంగాణ బిడ్డలకు పరిపాలన ఎంత చేతనైతదో చూపించేందుకు నేడు ప్రారంభించుకున్న జిల్లా ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయాలే నిదర్శనం. వీటి ఆర్కిటెక్ట్ మన తెలంగాణ బిడ్డ ఉషారెడ్డి గారికి అభినందనలు. ఉషారెడ్డిగారికి ప్రజల పక్షాన అభినందనలు. ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి గారి సారథ్యంలో ఈ నిర్మాణాలు జరిగాయి. నాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. 33 జిల్లాలు ఏర్పాటు చేసుకోవడమే కాదు, ఈ రోజుకి 24వ కలెక్టరేట్ బిల్డింగ్ ను ప్రారంభించుకున్నామని గుర్తు చేసారు. కొన్ని రాష్ట్రాల సెక్రటెరియట్‌లు కూడా ఇంత గొప్పగా లేవని చాలామంది చెప్తున్నారు.  దేశం, రాష్ట్రం, పట్టణం, జిల్లా ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి కొన్ని గీటురాళ్ళు ఉంటాయి.  అనతి కాలంలోనే తెలంగాణ గొప్ప ప్రగతిని సాధించింది. 

తలసరి ఆదాయం & తలసరి విద్యుత్  నెంబర్ వన్ స్థానం

ఎప్పటి నుంచో స్థిరంగా కొనసాగుతున్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలను కూడా అధిగమించి తెలంగాణ రాష్ట్రం తొమ్మిది సంవత్సరాల అనతి కాలంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. తలసరి విద్యుత్ వినియోగంలో కూడా దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉంది. ప్రజలకు స్వచ్ఛమైన, శుద్ధమైన మంచినీళ్ళు అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ప్రతి రంగానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 

ఆర్థిక ప్రగతి సాధించి మరికొంత పెన్షన్ ను పెంచుకుందాం

దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దివ్యాంగులకు పెన్షన్ ను 3016 రూపాయల నుంచి 4016 రూపాయాలకు పెంచుకున్నాం. రాబోయే రోజుల్లో ఇదే ఆర్థిక ప్రగతి సాధించి మరికొంత పెంచుకుందాం.  గతంలో తెలంగాణ రాక ముందు ఈ ప్రాంతంలో పెన్షన్ లబ్ధిదారులు  23-24 లక్షల మంది మాత్రమే. నేడు మన రాష్ట్రంలో దాదాపు 50 లక్షలమంది పెన్షన్ లబ్దిదారులున్నారు. తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతి ఫలితమే ఈ పరిణామం.  ఘనపురం ఆనకట్ట, కెన్సాల్స్ ఏ విధంగా బ్రహ్మాండంగా రూపుదిద్దుకున్నయో మీ కళ్ళ ముందు కనిపిస్తున్నది. 

ద ఎక్స్ లెన్స్ ఆల్వేస్ రిమేన్స్ అండ్ ద క్వెస్ట్ నెవర్ ఎండ్స్

 ప్రజాప్రతినిధులు, అధికారులు సాధించిన సమిష్టి కృషి ఫలితమే తెలంగాణ సాధించిన ప్రగతి ఫలాలు. తెలంగాణ కోసం ఏ రకమైన పోరాటం చేసామో అదే స్ఫూర్తితో ముందుకు సాగడం వల్లనే నేడు తెలంగాణ ప్రగతి ఫలాలు అన్నార్తులకు, దీనార్తులకు అందుతున్నాయి.  రాబోయే రోజుల్లో మరింత మనం ముందుకు పోవాలి. కారణం ఏందంటే ‘క్వెస్ట్ ఫర్ ఎక్స్ లెన్స్ )శ్రేష్టమైన ఫలితం కోసం తపన)’ అనేది ఎప్పుడూ కూడా ముగిసిపోయేది కాదు. ఒక గమ్యాన్ని నిర్దేశించుకొని మనం అక్కడికి చేరుకున్న తర్వాత మళ్ళీ ఇంకో మెట్టుకు పోవాల్సి ఉంటుంది.  ద ఎక్స్ లెన్స్ ఆల్వేస్ రిమేన్స్ అండ్ ద క్వెస్ట్ నెవర్ ఎండ్స్. అదే పద్ధతిలో మనం రిలాక్స్ కాకుండా చాలా చక్కగా ముందుకు పోతున్న ఈ రాష్ట్రాన్ని మరింతగా తీర్చిదిద్ది, గొప్పగా తయారుచేయడంలో మీరందరూ భాగస్వాములు కావాలని, ఇంత చక్కగా నిర్మించబడిన ఈ పరిపాలనా భవనాలు గొప్పగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. 

రిలాక్స్ కాకుండా ఇదే పట్టుదలతో ముందుకు పోవాలి 

మెదక్ జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టులు పూర్తయితే సస్యశ్యామలమైన జిల్లాగా పాత మెదక్ జిల్లా అవతరించే అవకాశం ఉంటుంది.  నేను ఒక్కటే మాట మనవి చేస్తున్నాను. నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ముల్కీ సర్టిఫికెట్ కోసం సంగారెడ్డికి వెళుతుంటే మంజీరా గలగలలు చూసి ఏడుపాయల అమ్మవారి దగ్గర కాసేపు ఆగి చూసి పోయేవాళ్లం. సమైక్య పాలనలో మంజీరా ఎలా మట్టి కొట్టుకుపోయిందో అందరికీ తెలుసు. నేడు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి గొప్ప కృషితో హల్దీ వాగు,  మంజీరా వాగులో 365 రోజులు జీవధారలు గా ఉండేలా చెక్ డ్యాములు కట్టుకున్నాం.

ఎటు చూసినా పచ్చని పొలాలతో మెదక్ జిల్లా నేడు అలరారుతున్నది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుంది. మన బాధ్యత కూడా పెరుగుతుంది. మనం రిలాక్స్ కాకుండా ఇదే పట్టుదలతో ముందుకుపోవాలని, అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కోరుతున్నాను. ఇప్పటిదాకా మీరందించిన సహకారానికి ధన్యవాదాలని పేర్కొన్నారు.