mt_logo

ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఆగమాగం కావొద్దు: మెదక్‌లో సీఎం కేసీఆర్

బుధవారం మెదక్‌లో నిర్వహించిన ప్రగతి శంఖారావం సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. సిఎస్ఐ (ది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా) చర్చ్ గ్రౌండ్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.

ప్రజలు ఆగమాగం కావద్దు
ఎలక్షన్లు వచ్చినప్పుడు కల్లాల దగ్గర అడుక్కుతిన్నట్టు పార్టీలు బయలుదేరుతాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజలు ఆగమాగం కావద్దు. ఎలక్షన్లు వచ్చినప్పుడే ప్రజలు తమ ధీరత్వాన్ని ప్రదర్శించాలి. ఎవరు నిజమైన ప్రజాసేవకులో గుర్తించనట్టైతే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అభివృద్ధి కూడా జరిగే అవకాశముంటుందని సూచించారు.

30 నుంచి 40 వేల ఎకరాలకు నీళ్లు
ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నది. 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీయే పాలించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, టీడీపీ అధికారంలో ఉన్నా ఘనపురం కు నీళ్ళు కావాలంటే మెదక్ ఆర్డీవో దగ్గర ధర్నా చేసే పరిస్థితి ఉండేది. ప్రతి సంవత్సరం అదే పరిస్థితి. ఘనపురం కాల్వల్లో తుమ్మ చెట్ల మొలిచేవి. నేడు బ్రహ్మాండంగా ఘనపురం హైట్ పెంచుకొని, కాల్వలు బాగు చేసుకున్నాం. ఈ రోజు 30 నుంచి 40 వేల ఎకరాలకు నీళ్లు బ్రహ్మాండంగా అందించుకుంటున్నామని తెలిపారు.
గత కాంగ్రెస్ నాయకులు సింగూరు ప్రాజెక్టును మొత్తాన్ని హైదరాబాదుకు దత్తతకు ఇక్కడి పొలాలు, నిజామాబాద్ పొలాలు ఎండబెట్టారు. ఈ రోజు సింగూరును మెదక్ కే కేటాయించుకోవడం వల్ల జోగిపేట ప్రాంతంలో బ్రహ్మాండంగా నీళ్లు పారుతున్నాయి. ఘనపురం ఆయకట్టు కింద బ్రహ్మాండంగా పంటలు పండించుకోగలుగుతున్నాం.

రైతుబంధు, రైతు బీమా పథకాలు రైతుల జీవితాలను మార్చేసాయి
వ్యవసాయం విషయంలో మీకో రెండు మాటలు మనవి చేస్తున్నాను. తెలంగాణ రాకముందుకు మనందరం కూడా చెట్టుకొకరు, పుట్టకొకరు అయినాం. భూములున్న వాళ్ళు కూడా హైదరాబాద్ కు ఆటో రిక్షా నడిపించే పరిస్థితికి దిగజారిపోయాం. రైతును ఏ విధంగానైనా సరే బాగుచేయాలని ధృడమైన సంకల్పంతో కార్యక్రమాలను మొదలుపెట్టాం.

కాళేశ్వరం నీళ్ళు తెచ్చుకున్నాం. రైతుబంధు, రైతు బీమా పథకాలు రైతుల జీవితాలను మార్చివేశాయి. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ను రైతులకిస్తున్నాం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ కరెంటు మోటార్లకు మీటర్లు పెడతామంటున్నది. మీటర్లు పెట్టాలా ? మీటర్లు పెట్టకపోవడంతో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 25 వేల కోట్ల నష్టాన్ని కలిగించింది. ఐనా ఓర్చుకొని బాధను అనుభవిస్తూ, ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టేది లేదని తేల్చి చెప్పినం. కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్ధానాలను అమలు చేయకుండా రైతులకు ఉదయం 3 గంటలు, రాత్రి 4 గంటల చొప్పున కేవలం 7 గంటల కరెంటునిస్తున్నది.

30-40 చెక్ డ్యాములు – 365 రోజులు నీళ్ళు
ఇవాళ తెలంగాణలో రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తునందిస్తున్నాం. రైతులకు అనవసర నిబంధనలు విధించకుండా బ్రహ్మాండంగా పంటలు పండించుకునే వెసులుబాటు కల్పించినం. హల్దీ వాగు, మంజీర వాగు మీద 30-40 చెక్ డ్యాములు కట్టుకొని 365 రోజులు నీళ్ళు అందుబాటులో ఉండేలా చేసుకున్నాం అని అన్నారు. కాళేశ్వరం లో భాగంగా కట్టుకున్న మల్లన్న సాగర్ నుంచి అవసరమైనప్పుడు నీళ్ళు కాల్వలలోకి విడుదల చేసుకుంటున్నాం.

1000 పై చిలుకు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు
నేను సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక జూనియర్ కాలేజ్ కోసం 15 సంవత్సరాలు తిరిగాను. ఇవాళ సబ్బండ వర్గాల పిల్లల కోసం 1000 పై చిలుకు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు పెట్టుకున్నాం. ఈ విద్యాసంస్థల్లో చదివే పిల్లలు మాట్లాడే ఇంగ్లీషు, నీట్ వంటి ఎంట్రెన్సుల్లో వాళ్లు తెచ్చే ర్యాంకులు మన రాష్ట్రానికే తలమానికంగా ఉన్నాయి.

50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజల మంచినీళ్ళ కష్టాల గురించి ఆలోచించిందా?… ఇదే మెదక్ పట్టణంలో మూడు నాలుగు రోజులకొకసారి మంచినీళ్లు వచ్చేది. ఆనాడు నేను మంత్రిగా ఉండి సహాయం చేస్తే కూడా డబ్బులు సరిపోక పోయేవి.

1 కోటి 3 లక్షల కుటుంబాలకు నల్లా కనెక్షన్లు
మిషన్ భగీరథ వల్ల గ్రామాలు, పట్టణాల్లో నేడు ప్రతిరోజు నల్లాల ద్వారా మంచినీళ్ళు అందుతున్నాయి. ఒక్క రూపాయికే మంచినీళ్ళ కనెక్షన్ లు అందించాం.భారతదేశం మొత్తంలో 1 కోటి 3 లక్షల కుటుంబాలకు నల్లా కనెక్షన్లతో వాళ్ళ ఇండ్లల్లకే నీళ్ళిచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. అందరికీ 24 గంటలు కరెంటు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. దుర్మార్గులకు, చేతకాని వాళ్ళకు అప్పజెప్పి ఈ సదుపాయాలను పోగొట్టుకోవాలా..? అని ప్రశ్నించారు.