mt_logo

ఆరు గ్యారెంటీలు వర్సెస్ కేసీఆర్ గ్యారెంటీలు

  • విశ్వనీయతే ప్రధానంగా.. బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించిన బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు సీఎం కేసీఆర్
  • తెలంగాణ ప్రజల గుణాత్మక జీవనాన్ని మరింతగా పెంచే ‘కేసీఆర్ గ్యారంటీలు’ 
  • మరిన్ని మెరుగైన పథకాలతో ఎన్నికలకు సిద్ధం
  • ప్రజా వైద్యం సంక్షేమం బలోపేతం..
  • రౌతు ఏదో రత్నమేదో తెలుసుకోవాలె – హుస్నాబాద్ సభలో అధినేత

మేనిఫెస్టోలో ప్రకటించకుండానే అమలు చేస్తున్న పలు పథకాలను మరింతగా మెరుగులు దిద్ది, తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను మరింతగా పెంచే గుణాత్మక పరిణామానికి దోహదం చేసే దిశగా బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో – 2023ని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఒక వైపు ఎన్నికల గండాన్ని గట్టెక్కడానికి ఆపదమొక్కులు మొక్కుతూ…గ్యారెంటీలు ప్రకటించిన పార్టీలకు భిన్నంగా ఆచి తూచి సాధ్యాసాధ్యాలను పరిశీలించి చిత్తశుద్దితో చేసిన ప్రకటనగా బీఆర్ఎస్ మేనిఫెస్టో – 2023 ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్నది.

బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలక అడుగులు వేసిన అధినేత సీఎం కేసీఆర్ మిగతా పార్టీలకు అందనంత వేగంతో ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పటికే అభ్యర్థుల పేర్లను ప్రకటించిన నేపథ్యంలో… ఆదివారం నాడు 51 మంది అభ్యర్థులకు  బీ-ఫారాలు అందజేశారు. మిగిలిన వారికి రేపు అందచేయనున్నారు.

 అత్యంత కీలకమైన మేనిఫెస్టోను ప్రకటించి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఎవరూ అంచనా వేయని విధంగా మేనిఫెస్టోలో అనేక అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. ఎన్నికలకు 45 రోజుల ముందు మేనిఫెస్టోను ప్రకటించి నివ్వెరపరిచారు. బీఆర్ఎస్ అధినేతగా సీఎం కేసీఆర్ మేనిఫెస్టో- 2023లో ప్రకటించిన గ్యారంటీలు తెలంగాణ ప్రజల్లో అత్యంత విశ్వాసం పెంపొందించాయి.

తెలంగాణ భవన్‌లో కేసీఆర్ :

తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం అభ్యర్థులతో అధినేత సమావేశమయ్యారు. ఎన్నికల నియమ నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించే పద్ధతుల గురించి వివరించారు.   ప్రజలతో మమేకం కావాల్సిన తీరు, ఇప్పటి దాకా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి,  తదితర అంశాలను ప్రస్తావిస్తూ.. దిశా నిర్దేశం చేశారు. ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తగా నామినేషన్ వేయాలని సూచించారు. నామినేషన్ల విషయంలో సందేహాలుంటే న్యాయ బృందాన్ని సంప్రదించాలని సూచించారు. అభ్యర్థులకు ఓపిక, సంయమనం అవసరమని అన్నారు.

రాజకీయాలన్న తర్వాత మంచి, చెడు ఉంటాయి.. అలకలూ ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అభ్యర్థులకు సంస్కారం ఉండాలని, మంచిగా మాట్లాడ‌టం నేర్చుకోవాలని చెప్పారు. అందరి కంటే ఎక్కువగా అభ్యర్థులు ప్రజల్లో ఉండాలని సూచించారు. చిన్న కార్యక‌ర్తతో కూడా మాట్లాడే ప్రయ‌త్నం చేయాలన్నారు.మంచిగా మాట్లాడ‌టం నేర్చుకోవాలి. కార్యక‌ర్తల‌కు మ‌న‌ల్ని అడిగే అధికారం ఉంటుంది. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ముందుకు పోవాలని కేసీఆర్ సూచించారు.అనంతరం 51 మంది అభ్యర్థులకు కేసీఆర్ గారు బీ-ఫారాలు అందచేశారు.

మనది పేదల ఎజెండా, రైతుల ఎజెండా

హుస్నాబాద్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. మనది పేదల ఎజెండా, రైతుల ఎజెండా రౌతేందో రత్నమేందో ఆలోచించాలే అన్నారు. ‘‘ 2018 లో శాసన సభ ఎన్నికల మొదటి సభలో   నేను ఇక్కడికే వచ్చి ప్రసంగించడం జరిగింది. హుస్నాబాద్ గడ్డ  ప్రజల ఆశీర్వాదంతో ఆనాడు మూడొంతుల  మెజారిటీ తో 88 సీట్లతో అఖండ విజయాన్ని సాధించినం. ఈ సారి కూడా పెద్దలందరూ చెప్పినారు. మళ్లీ మీరు హుస్నాబాద్ నుంచి జైత్రయాత్ర ప్రారంభించాలనే అన్నారు. ఈ రోజు అభ్యర్థులందరికీ బీ-ఫారాలు అందచేసి మన మేనిఫెస్టో ప్రకటించి నేను ఇక్కడికి మీ దర్శనానికి రావడం జరిగిందన్నారు. 

రౌతేందో రత్నమేందో ఆలోచించాలే

నేను మీ అందరిని ఒక్కటే మాట కోరుతున్నా. నేను చెప్పే నాలుగు మాటలు వినాలని విజ్ఞప్తి చేశారు. నేను చెప్పే మాటలు విని విడిచిపెట్టి పోవద్దు. మీ బస్తీకో, మీ గ్రామానికో, తండాకో పోయిన తర్వాత  కేసీఆర్ నాలుగు మాటలు చెప్పిండు ఇందులో నిజమేంది? అవునిజమేందని ఆలోచించాలే.ఎన్నికలు చాలా వస్తయి. చాలా పోతయి. ఎవరో ఒకరు గెలుస్తా ఉంటరు. ఎలక్షను రాంగనే మనం ఆగమాగం కావద్దు. రౌతేందో రత్నమేందో ఆలోచించాలే. మనకు పనికెచ్చేదేదో గుర్తుపట్టాలే.  ఎవరో చెప్పిండ్రని అలవోకగా ఓటువేయవద్దు.

ఓటు తాలుకా రాతను మార్చుతది

ఓటు అనేది మన తలరాతను మార్చుతది, తాలుకా రాతను మార్చుతది, జిల్లా రాతను మార్చుతది. మన భవిష్యత్తును మార్చుతది. చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన బావమరిది చెప్పిండో చుట్టం చెప్పిండో, మన మేనమామ చెప్పిండో అనే పద్ధతిలో ఓట్లు వేయకూడదు. కచ్చితంగా ఆలోచించి  స్ఫస్టమైన విధానంతోటి, స్పష్టమైన  అవగాహనతోని ఓటింగ్ జరిగినప్పుడు తప్పకుండా ప్రజలు గెలుస్తారు. ప్రజల కోరికలు నెరవేరుతయి. ఒక విషయం మీరు ఆలోచన చేయాలే. తొమ్మిదిన్నర సంవత్సరాల కింద మన తెలంగాణ పరిస్థితి ఏంటి? ఏ విధంగా ఉండే? ఎక్కడ చూసినా వలసలు, కరువు, సాగునీళ్లు లేవు,  మంచినీళ్లు లేవు, కరెంటు లేదు, ఆర్థిక పరిస్థితి ఎట్ల ఉంటదో తెలువదు. కొత్త కుండల ఈగ చొచ్చినట్లు,  కొత్త సంసారం. ఎక్కడ మొదలు పెట్టాలే. ఎక్కడికి తీసుకుపోవాలే.  ఏ విధంగా పైకి పోవాలే. రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజానీకాన్ని ఏ విధంగా ఆదుకోవాలనే పెద్ద  జఠిలమైన సమస్య నా ముందు ఉండేదని గుర్తు చేశారు. 

మనకు ఎవరు పోటీ లేరు సాటి లేరు

తెలంగాణ వచ్చిన తర్వాత బాధ్యత  బీఆర్ఎస్ మీదనే  ప్రజలు పెట్టినారు కాబట్టి బాధ్యతగా పెద్ద ఆర్థిక నిపుణులను మన రాష్ట్రానికి చెందిన వారితోపాటు బయట రాష్ట్రాలకు చెందిన వాళ్లను అందరినీ రప్పించి రెండు మూడు నెలలపాటు మేధోమధనం చేసినం మెదడు కరుగతీసినం. ఎక్కడ ఏమిచేయాలే. ఎక్కడికి పోవాలే. ఎటు చూసినా కటిక చీకటి.కరెంటు లేవు. నీళ్లు లేవు. పంటలు పండవు. బతుకలేక వలుస పోయిన వాళ్లు కొందరు. చావలేక బతుకుతున్న వాళ్లు కొందరు. చాలా ఘోరమైన దారుణమైన పరిస్థితులు ఉండేవి. 14, 15 సంవత్సరాలు మనందరం కలిసి ఏకబిగిన పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణను  అనేక రంగాలలో మీ  అందరి సహకారంతో నెంబర్ వన్ స్థానానికి తీసుకుని పోయినం. ఈ రోజు తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్, మంచినీళ్ల రంగంలో తెలంగాణ నంబర్ వన్ , పల్లెల్లో చెట్లు పెంచి, పచ్చదనం పెంచి , పారిశుధ్యాన్ని పెంచి, చక్కటి పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో తెలంగాణ నెంబర్ వన్. ఇలా అనేక రంగాల్లో పారిశ్రామిక విధానంలో మనకు ఎవరూ పోటీలేరు సాటీ కూడా లేరని ధీమా వ్యక్తం చేశారు. 

తీర్థం పోదాం పద తిమ్మక్క అంటే నువ్వు గుళ్లే, నేను చల్లే.. 

పెట్టుబడులు సాధించడంలో 20 నుంచి 25 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించడంలో పారిశ్రామిక విధానం కావోచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చో వాటన్నిట్లో నెంబర్ వన్‌గా ఉన్నామని తెలిపారు. కేంద్ర సహకారం లేకపోయినా ప్రతిపక్షాలు గౌరవెల్లి లాంటి ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఎన్నో కేసులు వేసినా, ఎన్నో కుట్రలు చేసినా అన్నింటిని అధిగమించుకుంటూ .ఒకటీ, ఒకటీ, ఒకటీ మనం చేసుకుంటూ వచ్చినామని స్పష్టం చేశారు. అద్భుతమైన విషయాలు కొన్ని సాధించినాం. ఆ క్రమంలోనే ఇంకా కొనసాగాలి. ఎలక్షన్ రాగానే ఎవ్వరూ వస్తరు. ఏదో చెప్తరు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు. అలవీకాని సామెతలు చెపుతరు. ఆపద ముక్కులు కూడా మొక్కుతరు. తీర్థం పోదాం పద తిమ్మక్క అంటే నువ్వు గుళ్లె, నేను చల్లే .. ఏడికి పోతరో తెలియదన్నారు. ఇయ్యాల కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. ఒక్కటే మాట మీరు గమనించాలే. గంభీరంగా ఆలోచన చేయాలే అని సూచించారు. 

గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ఇదే హోదాలో మళ్లీ వస్తా 

గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంది. నేను బాధ్యత తీసుకుంటా ఉన్నా. ఎన్నికల అయ్యాక ఐదారు నెలల్లో దానిని కంప్లీట్ చేసి నీళ్లు వదిలి పెట్టేందుకు మళ్లీ  నేనే వస్తా. ఇదే హోదాలో వస్తా. మీ ఆశీర్వాదంతో అని చెబుతున్నా అని పేర్కొన్నారు. అనేక బాధలు చూశా.  శనిగరం ప్రాజెక్టు ప్రధాన కాలువ పూర్తిచేయాలని మీకు ఉంది. దీని కట్ట కూడా లీకేజీలు ఉన్నాయి. శనిగరం ప్రాజెక్టు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో కలుపుకున్నాం కాబట్టి లోకల్ గా వానలు పడకున్నా గోదావరి నీళ్లతోనే పంటలు పండుతాయి కాబట్టి త్వరలోనే పూర్తిచేసుకుంటాం. కొత్తకొండ జాతర తెలుసు. వీరభద్ర స్వామి ఆలయం అద్భుతంగా ఉంది. నేను కూడా వచ్చి చిన్నప్పుడు మిఠాయి తిన్నా. జానపదులు, ప్రజలు కొలిచే దేవత కాబట్టి ఆలయాన్ని  అభివృద్ధి చేసే బాధ్యత నాదే. సిద్ధిపేట-ఎల్కతుర్తి జాతీయ  రహాదారి కావాలని చెబుతా ఉన్నారు. తప్పకుండా పరిశీలన చేస్తా అని చెబుతున్నా అని పేర్కొన్నారు. 

 హుస్నాబాద్ గెలుపే బీఆర్ఎస్ గెలుపుకు నాంది 

ముల్కనూరులో కొత్త బస్టాండు కావాలని కోరుతా ఉన్నారు. అది చిన్న విషయం. దాన్ని కూడా మంజూరు చేస్తా అని హామీ ఇచ్చారు. ఎల్కతుర్తిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను తప్పకుండా మంజూరు చేయిస్తా. కోరిన పనులన్నీ చేయలేని పనులు కాదు. పటిష్టమైన, ఆర్థికంగా వృద్ధి చెందినటువంటి, అన్ని రంగాల్లో ముందుకు పోయేటటువంటి బాగుండుటటువంటి గొప్ప ఎజెండాతో ముందుకు కదుల్తూ ఉన్నాం. ఇప్పుడు దేశానికి ఆదర్శం అయ్యాం. రాబోయే రోజుల్లో దేశానికి మార్గదర్శకులం  కావాలి.  ఎజెండా కొనసాగాలంటే కచ్చితంగా బీఆర్ ఎస్ గెలువాలే.  హుస్నాబాద్ గెలుపే  రేపు 95 నుంచి 105 సీట్ల మధ్య బీఆర్ఎస్ గెలువడానికి నాంది కావాలే. ఈ సభలో తొలి బహిరంగ సభలో మీ ఆశీర్వాదం కోరడానికి వచ్చాను. ఇంత పెద్ద మొత్తంలో వస్తారని నేను కూడా ఊహించలేదు. తక్కువ సమయంలో చెప్తే మీరందరూ కదలి వచ్చినారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

ఉధృతంగా ప్రచారం చేస్తే అద్భుతమైన విజయం సొంతం

బ్రహ్మాండమైన మన మేనిఫెస్టో ప్రకటించినమని తెలిపారు. బీఆర్ ఎస్ కార్యకర్తలకు మనవి చేస్తున్నాం. మీ ఎమ్మెల్యే నాయకత్వంలో, మీ జడ్పీటీసీల నాయకత్వంలో, ఎంపీపీలు, సర్పంచులు అందరూ కూడా వాటి కాపీలు ప్రింట్ చేపించి కాపీలను గ్రామగ్రామాన పంచిపెట్టాలని కోరుతున్నాను. మనది పేదల ప్రభుత్వం పేదల ఎజెండా, రైతుల ప్రభుత్వం రైతుల ఎజెండా కాబట్టి ఉధృతంగా ప్రచారం చేసి అద్భుతమైన విజయాన్ని హుస్నాబాద్ లో  సాధించాలని నేను కోరుతూ ఉన్నాను. నిండు సభలో సతీష్‌కి సభా వేదికపై  సీఎం కేసీఆర్ బీ-ఫారం అందజేశారు. నన్ను,సతీష్‌ను ఆశీర్వాదం అందించడానికి వచ్చిన వారందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, కారు గుర్తుకే మన ఓటు’’  అంటూ ప్రసంగం ముగించారు.