mt_logo

సెప్టెంబర్ 1 న స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్, ఆగస్టు 29: స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలను సెప్టెంబర్ 1 వ తేదీన హెచ్.ఐ.సి.సిలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియచేసారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై డా.బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో నేడు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డా. కేవీ రమణ చారి, దేశపతి శ్రీనివాస్, డీజీపీ అంజనీ కుమార్లతో ‌సహా పలువురు కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సీ.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. ఈ వజ్రోత్సవ ముగింపు ఉత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని అన్నారు. శుక్రవారం నాడు మధ్యాహ్నం జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ ల చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్, జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్.పి.టి.సి లు, మండల పరిషత్ అధ్యక్షులు. డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు సమితిల అధ్యక్షులు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులతో సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారని వివరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు గంటసేపు దేశ భక్తి, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కలిగించే పలు సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని, అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుందని వెల్లడించారు. ఈ వజ్రోత్సవ ముగింపు వేడుకలకు ఏ విధమైన ఇబ్బందులు కలుగ కుండా సంబంధిత అధికారులందరూ విస్తృత స్థాయిలో ఏర్పాట్లను చేయాలని అన్నారు.