mt_logo

ఒక్క తప్పు చేసినా ముందుతరాలకు నష్టం!- సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి ఏది మంచో అదే చేస్తామని, గత ప్రభుత్వాలు చేపట్టిన అడ్డగోలు ప్రాజెక్టులు యధాతథంగా కొనసాగించే అగత్యం తెలంగాణ ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ తొలి ప్రభుత్వంగా తాము ఈరోజు ఒక్క తప్పటడుగు వేస్తే తరతరాల ప్రజలు నష్టపోతారని, అందుకే ఎవరు ఎంత అరిచి గీ పెట్టినా తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు మార్చుకుంటామని సీఎం తేల్చిచెప్పారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ పలు అంశాలపై సుదీర్ఘంగా వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రాణం పోయినా సరే తెలంగాణ రైతులు, ప్రజల కోసమే పనిచేస్తాం తప్ప ఎవరో వ్యక్తుల కోసం పనిచేయమని స్పష్టం చేశారు. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు డిజైన్ మార్చి తీరుతామని, చేవెళ్ళకు గోదావరి నీరు రాదని తాను ఎన్నికల ప్రచారం సమయంలోనే అక్కడి ప్రజలకు చెప్పానని, రంగారెడ్డి జిల్లాకు పాలమూరు పథకం ద్వారానే కడుపునిండా నీరిస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ఇరిగేషన్ పాలసీని త్వరలో ప్రకటిస్తామని, ఏ నదినుండి ఎన్ని నీళ్ళు తీసుకోవచ్చు, ఏ ప్రాజెక్టుకు ఎక్కడినుండి నీరు ఇవ్వొచ్చు వంటి వివరాలను ప్రజల ముందు పెడతామని సీఎం చెప్పారు. సమైక్య పాలకుల హయాంలో గోదావరి మీద మహారాష్ట్ర ఏకంగా 200 ప్రాజెక్టులు కట్టిందని, దాని ఫలితంగానే ప్రస్తుతం శ్రీరాంసాగర్ కు చుక్క నీరు రావడం లేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రాణహిత, ఇంద్రావతి తప్ప గోదావరి నుండి నీరు వచ్చే అవకాశం లేకుండాపోయిందని అన్నారు. ప్రాజెక్టులపై సంపూర్ణ అధ్యయనం చేయాలి. ఎటుపడితే అలా చేయడానికి వీలుకాదు. ఇది కొత్త రాష్ట్రం. పునాది వేశాం. పడే పునాది ఏమాత్రం తలకిందులైనా రాష్ట్రం దెబ్బతింటుంది. ఎటూ కాకుండా అయిపోతుంది. ఆ తప్పును ప్రభుత్వం చేయదల్చుకోలేదన్నారు. గ్రామజ్యోతి తరహాలో త్వరలో పట్టణజ్యోతి ఉంటుందని, మున్సిపాల్టీల్లోనూ క్రమబద్ధీకరణ చేపడతామని సీఎం చెప్పారు.

గతంలో దేవాదుల ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టింది రూ. 7,500 కోట్లు. ప్రాజెక్టు అంచనా ప్రకారం లిఫ్టులు 170 రోజులు నడవాలి. గోదావరి నది పారుతున్నా లిఫ్టుకు నీళ్ళు అందడం లేదు. చిన్న ఆనకట్ట కూడా కట్టలేదు.. అతి కష్టం మీద 50 నుండి 60 రోజులకు మించి నడవడం లేదు. ఏడున్నర వేల కోట్లు ఖర్చు పెడితే ఇదీ ఫలితం! క్లియరెన్స్ ల పేరుతో కాలయాపన చేయడం, వివాదాలు లేకపోతే కావాలని కొత్తవి కావాలని సృష్టించడం, గోదావరి నీళ్లంతా ధవళేశ్వరం తీసుకెళ్ళే కుట్రలే ఇన్నాళ్ళూ జరిగాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్ రూపకల్పన చాలా పటిష్ఠంగా చేసుకున్నాం. చాలా చక్కగా మన రెవెన్యూ ఉంది. కానీ కొన్ని పత్రికలు మాత్రం పనికట్టుకుని వ్యతిరేక కథనాలు రాస్తున్నాయి. కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు తెలిసీతెలియక వారి పరువు తీసుకునే పద్దతుల్లో మాట్లాడుతున్నారు. తెలియకపోతే ఆర్ధికశాఖ మంత్రినన్నా, సెక్రెటరీనన్నా అడగాలి. స్టేట్మెంట్లు ఇచ్చే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. నవ్వాలో, ఏడ్వాలో తెలీదు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ తెలంగాణ రాష్ట్రానికి ఏ రేటింగ్ ఇచ్చింది. చాలా తక్కువ రాష్ట్రాలకు, నాకు తెలిసి ఒకటో, రెండో రాష్ట్రాలకు ఈ అర్హత వస్తుంది. ఈరోజు సంక్షేమ రంగంలో దేశంలో మనమే టాప్ లో ఉన్నాం. రూ. 28 కోట్ల ఖర్చుతో పథకాలు అమలు చేస్తున్నాం అన్నారు.

రాష్ట్రంలో విచ్చలవిడిగా గుడుంబా ఏరులై పారేందుకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ హయాంలోనే గుడుంబా బారినపడి ఎంతోమంది చనిపోయారన్నారు. తాను వరంగల్ వెళ్ళినప్పుడు పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చి ప్రభుత్వ సారా పెట్టి అయినా సరే గుడుంబా రాకుండా చెయ్యమని అడిగారని సీఎం గుర్తుచేశారు. అందుకే చీప్ లిక్కర్ తో గుడుంబా మహమ్మారిని రూపుమాపడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. తాను ఈ ప్రతిపాదన అధికారుల ముందు పెట్టినప్పుడు వందల కోట్ల నష్టం వస్తుందని చెప్పారని, అయినా ఫర్వాలేదు, అమలు చేద్దామని చెప్పానన్నారు. కేజీ టూ పీజీ విద్యను ఖచ్చితంగా అమలుచేసి తీరుతామని, దీనికి పూర్తిస్థాయిలో కసరత్తు జరుగుతుందని సీఎం వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *