mt_logo

అందరు నాలెక్క మంచిగ బతకాలె!- సీఎం కేసీఆర్

మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవెల్లి గ్రామంలో రెండవరోజు జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని గ్రామస్థులతో కలిసి శ్రమదానం చేశారు. ఊర్లో ఉన్న గ్రామస్థులందరితో కలిసి సహపంక్తి భోజనం చేసిన అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఎర్రవెల్లిలో ఇల్లులేనివారే ఉండొద్దని, గ్రామంలో అన్నీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లే ఉండాలని అన్నారు. దారిద్ర్యం, పేదరికం, చెత్త మీద యుద్ధం చేద్దాం.. మనం ఎందుకు ధనవంతులం కామో, ఎవరు ఆపుతారో చూద్దాం.. నేను మీ వెంట ఉంటానని సీఎం హామీ ఇచ్చారు.

నా లెక్కనే అందరూ బతకాలి.. కడుపునిండా తినాలి.. ఊరంతా బాగుపడాలి. ఒక్కరు ఉపాసమున్నా మంచిది కాదన్న భావన అందరిలో కలగాలని కేసీఆర్ అన్నారు. ప్రణాళికాబద్ధంగా ఆరునెలల్లో గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుకుందామని, అందుకు గ్రామస్థులు ఐకమత్యంగా ముందుకు పోవాలని సీఎం కోరారు. మీడియాలో నేను మాట్లాడింది విని ఈ గ్రామానికి చెందిన అనేకమంది పెద్దలు గ్రామాభివృద్ధికి ముందుకు వచ్చారు.. వారందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్న.. ఈ స్ఫూర్తి అందరికీ కావాలన్నారు. దరిద్రం పోయి మనమంతా ధనవంతులం కావాలె.. కష్టం చేసే చేతుల్లోనే లక్ష్మి ఉంటుందని సీఎం చెప్పారు. తన పిలుపుమేరకు గ్రామాభివృద్ధికోసం ఆర్ధికంగా చేయూతనివ్వడానికి ముందుకొచ్చిన దాతలను సీఎం ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించి సన్మానం చేశారు.

మేం వెనుకబడి ఉన్నాం.. మమ్మల్ని ఎవరు చూస్తారనే మాటలను దళిత సోదరులు ఇకపై బంద్ పెట్టాలె.. పెద్దోళ్ళు లేరు, చిన్నోళ్ళు లేరు. అందరం మనుషులమే. అందరం మనుషుల లెక్కనే బతకాలని సీఎం స్పష్టం చేశారు. గొప్పగా జీవించడం, పరిశుభ్రంగా ఉండడం, గ్రామాన్ని గొప్పగా ఉంచుకోవడం ముఖ్యం. గ్రామాభివృద్ధికి అందరం కలిసికట్టుగా నడుద్దామా? అని సీఎం ప్రశ్నించగానే గ్రామస్తులు అందరూ చేతులెత్తి తమ సంఘీభావం తెలిపారు. గ్రామస్థులు మోటు మాటలు మాట్లాడొద్దని, అలా ఎవరైనా మాట్లాడితే రూ. 50 జరిమానా వేద్దామని నిబంధన పెట్టుకోవాలని సూచించారు. ఇదిలాఉండగా ఎర్రవెల్లి గ్రామాభివృద్ధికోసం ఎన్ని నిధులిస్తారని తన పక్కన ఉన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని అడుగగా రూ. 50 లక్షలు ఇస్తున్నట్లు ఎంపీ ప్రకటించడంతో సీఎం హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ నిధుల నుండి మరో రూ. 25 లక్షలు అందజేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్, జాయింట్ కలెక్టర్ వెంకటరాంరెడ్డి, గ్రామ సర్పంచ్ భాగ్య బాలరాజు, ఎంపీపీ రేణుక తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *