హైదరాబాద్: ప్లాజా వేదికగా 108, అమ్మఒడి.. మొత్తం 466 వాహనాలు సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు కలిసి సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం అంబులెన్సుల ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి మంత్రి హరీశ్ రావు ప్రసంగించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. అత్యవసర సేవలు అందించే 466 అధునాతన వాహనాలను ఒకేరోజు ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి 316 అంబులెన్సులు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 455 కు పెరిగింది. గతంలో లక్ష మందికి ఒక 108 వాహనం ఉంటే.. ఇప్పుడు 75 వేలకు ఒక వాహనం అందుబాటులోకి వచ్చింది.
అమ్మ ఒడి ద్వారా రోజుకు 4 వేల మందికి, 108 ద్వారా రోజుకు 2 వేల మందికి సేవలు అందుతున్నాయి. నియోజక వర్గానికి 100 పడకల ఆసుపత్రులను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, నాలుగు టీమ్స్, వరంగల్ హెల్త్ సిటీ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50 వేల పడకలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా కాదు దాని తాత వచ్చినా ఎదుర్కొనేలా రాష్ట్ర వైద్య రంగం పటిష్టం అయిందన్నారు.
మాకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా కేసిఆర్ ప్రభుత్వం అండగా ఉన్నదనే భరోసా కలిగింది. బిజెపి, కాంగ్రెస్ రాష్ట్రాల్లో స్కాములు ఉంటే.. తెలంగాణలో స్కీములు ఉన్నాయి. బిజెపి, కాంగ్రెస్ రాష్ట్రాల్లో కొట్లాటలు, కరెప్షన్ తప్ప అభివృద్ధి శూన్యం. ఆశ కార్యకర్తల సెల్ ఫోన్ బిల్లును ఇకపై ప్రభుత్వమే కడుతుంది. కొత్తగా హైదరాబాద్ పరిధిలో నియమితులైన ఆశాలకు స్మార్ట్ ఫోన్లు. గతంలో అంబులెన్స్ సగటు సమయం 30 నిమిషాలు ఉంటే.. ఇప్పుడు 15 నిమిషాలకు తగ్గిందని తెలిపారు. అంబులెన్స్ లను డైనమిక్ పొజిషన్లో ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాం. 108 ఉద్యోగుల వేతనాలు 4 స్లాబులుగా పెంచుతున్నామన్నారు మంత్రి హరీశ్ రావు.