mt_logo

నన్నుసాదిన సిద్దిపేట గడ్డ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేను: సీఎం కేసీఆర్

నన్నుసాదిన సిద్దిపేట గడ్డ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనన్నారు సీఎం కేసీఆర్. సిద్ధిపేట బహిరంగ సభలో  సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆరడుగుల బుల్లెట్ హరీశ్ రావును అత్యధిక మెజారిటీతో గెలిపించండని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. జన్మభూమిని మించిన స్వర్గం లేదు. స్వర్గం కంటే కూడా పుట్టిన గడ్డ నా జన్మభూమే గొప్పది దాన్ని మించింది లేదు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఈ మాట అన్నది సాక్షాత్తు భగవంతుడైన శ్రీ రామచంద్రుడు. సిద్ధిపేట పేరు విన్నా, సిద్ధిపేట భూమికి వచ్చినా, సిద్దిపేట గురించి ఆలోచన వచ్చినా నా మనసులో కలిగే భావన ఇది అని తెలిపారు. సిద్దిపేట గడ్డ నన్ను సాదింది. నన్ను పెద్ద చేసింది. చదువు చెప్పింది. నాకు రాజకీయ జన్మనిచ్చింది. నన్ను నాయకున్ని చేసింది. 

గతం జ్ఞాపకం వస్తే చాలా బాధ 

తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు పెంచిన గడ్డ నాగడ్డ సిద్దిపేట అని గర్వంగా చెబుతున్నా. ఈ గడ్డ నుంచి నా రక్తం, మాంసం, బుద్ధి  అన్నీ  ఈ గడ్డ పుణ్యమే. నన్ను ఇంత వాన్ని చేసిన నా మాతృభూమికి , నా కన్న తల్లికి వినయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. నన్ను ప్రతి సందర్భంలో విజేతగా నిలబెట్టిన  ఈ గడ్డ రుణం ఈ జన్మలో  ఏమిచ్చినా తీర్చుకోలేను. ఈ సభలో నాతో కలిసి పనిచేసిన మిత్రులు, సహచరులు ఎంతోమంది ఆత్మీయ మిత్రులు స్టేజీ మీద, స్టేజీ కింద అనేక మంది ఉన్నారు. మా కొండం రాజు పల్లి మాదన్న ఎక్కడ ఉన్నాడో, నాకు డిపాజిట్ కట్టిన తోర్నాల చంద్రారెడ్డి బావ ఎక్కడ ఉన్నడో. ఈ గడ్డను ముందుకు తీసుకుపోవడానికి చాలా తిప్పలు పడ్డా. చాలా ప్రయాస పడ్డా. తెలంగాణ దేశానికే తలమానికం అయితే సిద్దిపేట తెలంగాణకే తలమానికంగా నిలిచింది. సిద్దిపేట పట్టణంలో మంచినీళ్లకు కరువస్తే 28 వార్డుల్లో వార్డుకు ఒక ట్యాంకర్ పెట్టి నీళ్లందించిన ఆరోజుల్లో. సిద్ధిపేటలో 100 బోర్లు వేస్తే రెండు బోర్లలో తేమ వచ్చింది. నీళ్లు రాలేదు. గతం జ్ఞాపకం వస్తే చాలా బాధ వేస్తుందన్నారు. 

మిషన్ భగీరథకు సిద్ధిపేట మంచినీళ్ల పథకమే పునాది

మంచినీళ్ల కోసం పడ్డ తిప్పల మామూలుది కాదన్నారు. ఆనాడే లోయర్ మానేరు డ్యాం నుంచి నీళ్లు తెచ్చుకుని జలజాతర చేసుకున్నం అని తెలిపారు. మిషన్ భగీరథ తెలంగాణ మొత్తం  అమలవుతుందంటే సిద్ధిపేట మంచినీళ్ల పథకమే దానికి పునాది. ఇక్కడి అనుభవమే అక్కడ దాకా సాగుతుంది. చింతమడకలో నేను పసికూనగా ఉండే సమయంలో అమ్మ చనుబాలు తాగే సమయంలో  మా అమ్మకు ఆరోగ్యం సరిగ్గా లేకుండె. మా ఊరిలో ఒక ముదిరాజ్ తల్లి  నాకు  చనుబాలు ఇచ్చి సాదింది. అంత అనుబంధం గడ్డతో ఉందన్నారు.  గ్రామంలో నేను పాదయాత్ర చేయని గ్రామమే లేదు. తిరుగని బాటలు లేవు. చూడని కుంటలు, చెరువులు  లేవు. ఆనాడు మంచి నీళ్లు లేని సిద్ధిపేటను, బంగారం లాంటి భూములున్నా పంటలకు నోచుకోని సిద్దిపేటను చాలా కష్టపడి  దరికి తెచ్చినం. ఆనాడు అధికారపార్టీనీ వదిలిపెట్టి  మీ దగ్గర అనుమతి తీసుకుని తెలంగాణ తల్లిని విముక్తి చేస్తే తప్ప ఈ గడ్డకు న్యాయం జరుగదని నమ్మి మొండి ధైర్యంతో ప్రాణాలకు తెగించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభం చేసిన. ప్రారంభం చేసిన తర్వాత ఉప ఎన్నికలు వచ్చాయి. నాకు బస్సు గుర్తు కేటాయించారు. సిద్ధిపేటలో సమైక్యవాదులు అడ్డాపెట్టి  కోట్లకు కోట్లు ఖర్చు పెట్టినా తిప్పికొట్టి 60 వేల మెజారిటీ ఇచ్చి విజయాన్ని చేసి పంపించినారని,  తెలంగాణ ఉద్యమం విజయం సాధించడానికి కూడా పునాది వేసింది కూడా సిద్ధిపేట గడ్డనే. నేను మరిచిపోలేనన్నారు. 

నీళ్లోచ్చినా.. రైలొచ్చినా హరీశ్ రావు కృషే.. 

హరీశ్ రావు మీద ఎమ్మెల్యేల్లో మంత్రుల్లో ఒక జోక్ ఉంది. అదేంటంటే హరీశ్ అటుతిరుగతడు, ఇటు తిరుగతడు. ఎక్కడ తట్టెడు పెండ కనబడితే దాన్ని తీసుకువచ్చి సిద్ధిపేటలో వేసుకుంటాడనే హరీశ్ రావు మీద జోక్ ఉంది. మంత్రి అయిన దగ్గర నుంచి నేటి వరకు ప్రతి ఒక్క విషయంలో హరీశ్ రావు ప్రతి కార్యక్రమాన్ని ఈ ప్రాంతానికి తేవడంలో అద్భుతమైన కృషిచేశాడు. హరీశ్ రావు జాగాలో నేను  ఎమ్మెల్యేగా ఉన్నా అంత జేయదల్చుతునో లేదో నాకు తెలియదు.  సిద్ధిపేటకు నీళ్లోచ్చినా.. రైలొచ్చినా అది హరీశ్ రావు కృషి.తెలంగాణ భారత దేశానికి తలమానికమైతే. సిద్దిపేట తెలంగాణకే తలమానికంగా మారింది. ఇప్పుడు రైలు వచ్చింది. అన్ని రకాల సదుపాయాలున్నాయి. వర్తక,వాణిజ్య, ఐటీ కేంద్రంగా సిద్ధిపేట వర్థిల్లుతున్నదన్నారు. అద్భుతమైన వ్యవసాయ క్షేత్రంగా సిద్ధిపేట ఎదగడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది.ఇదే రకంగా హరీశ్‌ను దీవించి మీ రికార్డును మీరే  తిరగరాసి విజయం సాధించేటట్లు కారు గుర్తుకు ఓటు వేసి హరీశ్ రావును గెలిపించాలని కోరారు.