mt_logo

రైతులు, సంక్షేమం, అభివృద్ధి విషయాల్లో కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్‌కు నక్కకు, నాగలోకానికి ఉన్న తేడా ఉంది: సీఎం కేసీఆర్

రాజరాజేశ్వర స్వామి కొలువైనటువంటి ఈ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నా జీవితంలోని ప్రధాన ఘట్టమైన నా పెండ్లి రాజరాజేశ్వరస్వామి ఆలయంలోనే జరిగింది. అందుకే ఈ వేములవాడతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని గుర్తు చేసారు. ‘వేములవాడ’ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పొరపాటున కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తమంటున్నరు. ఇందిరమ్మ రాజ్యంలో సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాలలను కల్లోలిత ప్రాంతాలుగా డిక్లేర్ చేసి, ఎంత మంది యువకులను కాల్చి చంపిండ్రో, ఎంత మందిని పొట్టనబెట్టుకున్నరో మనకు తెలిసిందే అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏమన్నా మంచి జరిగిందా? వెనుకట ఎవడో ఒకడు.. ‘తద్దినమున్నది రమ్మని పిలిస్తే..బాగా మెక్కి రోజు మీ ఇంట్లో ఇట్లనే జరగాలె’ అన్నడట. కాలం చెల్లిన ఇందిరమ్మ రాజ్యం తెస్తమంటే మోసపోయేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని తేల్చి చెప్పారు. 

మూడేండ్లు కష్టపడితే ధరణి వచ్చింది

పొరపాటున కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ‘ధరణి తీసేసి బంగాళాఖాతంలో వేస్తమని రాహూల్ గాంధీ, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అంటున్నరు. ‘ధరణి’తో దొంగలు, పైరవీకారులు, లంచావతారాల నుంచి రైతులకు బాధలు పోయినయి.  ‘ధరణి’ తీసేసి ‘భూమాత’ పెడుతరట.. అది ‘భూమాత’నా? లేక భూ‘మేత’నా? అని అడిగారు. గత కాంగ్రెస్ దళారీ వ్యవస్థ, లంచగొండితనం పోవాలని, రైతుల భూములపై యాజమాన్య హక్కు వాళ్లకే ఉండాలని నేను మూడేండ్లు కష్టపడి ధరణిని తెచ్చానని పేర్కొన్నారు. మీ భూములు మార్చాలంటే మీ బొటనవ్రేలుకు తప్ప..ముఖ్యమంత్రికి కూడా అధికారం లేకుండా చేసినమన్నారు. ‘ధరణి’ తీసేస్తే రైతుబంధు, రైతుబీమా, పంట కొనుగోళ్ల పైసలు ఎట్లా రావాలె? అని అడిగారు. ఇవ్వాల ధరణి’తో మీరు ఎక్కడికి తిరగకున్నా పైసలు మీ ఖాతాల్లో పడుతున్నయి. రైతులు, సంక్షేమం, అభివృద్ధి విషయాల్లో కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్‌కు నక్కకు, నాగలోకానికి ఉన్న తేడా ఉంటదన్నారు. 

కాంగ్రెసోళ్లు ఏడ్చిండ్రు, తుడ్చిండ్రని ఓట్లేస్తే.. కరెంటు కాటగలిసి, రైతుబంధుకు రాంరాం

వేములవాడకు రింగు రోడ్డును సాధించుకున్నామన్నారు. బద్ది పోచమ్మ గుడి దగ్గర 19 కోట్లతో ఎకరం స్థలం కొని విశాలంగా చేసుకున్నం అని అభివర్ణించారు. వేములవాడ మందిరం పనులు కూడా ప్రారంభమైనయి. 30 ఎకరాల స్థలాన్ని కూడా తీసుకున్నాం. మన ఇంటి ఇలవేల్పును పవిత్ర ప్రదేశాన్ని మరింత బాగుచేసుకుందామని హామీ ఇచ్చారు. మూలవాగు వెంట యాత్రికుల కోసం కాటేజీలు ఇతరత్రా సౌకర్యాలను కల్పించుకుందాం. కలికోట సూరమ్మ చెరువు పనులను శరవేగంగా చేస్తామన్నారు. మల్కపేట రిజర్వాయర్‌కు ఎన్నో దశాబ్ధాల పోరాటం చేసిన రాజేశ్వర రావు పేరు పెట్టుకున్నాం. వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాలకు నీరందుతుంది. ఒకనాడు కరువుకాటకాలకు నిలయమైన వేములవాడ అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. కాంగ్రెసోళ్లు ఏడ్చిండ్రు, తుడ్చిండ్రని ఓట్లేస్తే.. కరెంటు కాటగలిసి, రైతుబంధుకు రాంరాం అంటూ ప్రజలు ఏడువాల్సి ఉంటదని హెచ్చరించారు. పని, పాలసీల మీద ఓట్లెయ్యాలి కాని సెంటిమెంట్ల మీద ఓట్లేయడం మంచిది కాదన్నారు. విద్యావంతుడైన లక్ష్మీనర్సింహారావును ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపించండి, నేను మీతో ఉంటానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.