జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నాకు తెలంగాణ తెచ్చిన పేరే ఆకాశమంత పెద్దది. దాన్ని మించిన పదవి ఉన్నదా? మీరు మన్నించి ఇచ్చిండ్లు కాబట్టి రెండు సార్లు ముఖ్యమంత్రి చేసినా. . పదేండ్లయింది. నా అంత ఎక్కువ కాలం పనిచేసిన తెలుగు ముఖ్యమంత్రి ఎవ్వడు లేడని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ కీర్తి చాలు నాకు చాలన్నారు. కొట్లాడేది నా పదవి కోసం కాదు. 100 శాతం పేదరికం లేని తెలంగాణ కావాలి.అది నా పంతం అని స్పష్టం చేసారు. కేరళ రాష్ట్రం మాదిరిగా 100 శాతం అక్షరాస్యత ఉన్న తెలంగాణ కావాలనేది నా కోరిక అని తెలిపారు. ఇప్పుడు 70 సంవత్సరాల వయస్సు వచ్చింది. ఇంకేం కావాలి జీవితంలో అని అన్నారు.
కాంగ్రెస్ మోసానికి మీరంతా సాక్షులే..
తెలంగాణలో ఇస్తాం పొత్తు కలుద్దామని కాంగ్రెస్ మోసం చేసిందని తెలిపారు. సత్యనారాయణ రావు అనే పీసీసీ అధ్యక్షుడు మా వల్లే గెలిచారు అన్నడు.దమ్ముంటే రుజువు చేయి కేసీఆర్ అని సవాల్ విసిరిండు. నేను రాజీనామా చేసి ఆయన ముఖం మీద కొట్టినా. దమ్ముంటే రా మీ సంగతి మా సంగతి తేలుతదని ముఖానా కొట్టినా. ఎంపీగా నేను మళ్లీ పోటీ చేస్తే.. సమైక్యవాదుల తరపున ఆంధ్ర పాలకుల తరపున ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడ్డ జీవనరెడ్డి అప్పుడు నా మీద నిల్చున్నడు. మీరందరూ సాక్షులే. మీరు రెండు లక్షల 50 వేల మెజారిటీతో గెలిపించిండ్లు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులేపిండ్లు. ఆ పోరాటం కూడా మీ కండ్ల ముందు జరిగింది.
కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రజలకు ఆశనీపాతం, శని
తెలంగాణను ముంచింది ఆంధ్ర వాళ్లకన్నా ఎక్కువగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులే ముంచారు. తెలంగాణ కాంగ్రెస్ దద్దమ్మలే 58 ఏండ్ల దు:ఖానికి ప్రధాన కారణం. ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇండియా మొత్తానికి తెలుసన్నారు. తెలంగాణ కాంగ్రెస్ గట్టిగా నిలబడి ఉంటే ఈ పరిస్థితి రాకపోయేదని చెప్పారు. ఓట్లు కులం మీద మతం మీద పడొద్దు. అన్ని వర్గాల ప్రయోజనాలు కేంద్ర బిందువుగా ఓట్లు పడాలి. అది ఆరోగ్యవంతమైన రాజకీయం అని వివరించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రజలకు ఆశనీపాతం, శని, రైతాంగానికి మరీ దరిద్రం.. ఇవన్నీ ప్రజలు భరిస్తమంటే నేను ఏమి చేయలేనన్నారు. ఆలోచించకుండా ఓటేస్తే లేని ప్రమాదం కొని తెచ్చుకున్నట్లయితదని సూచించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే పదేండ్ల నుంచి నేను చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుందన్నారు.
బ్రహ్మాండగా మంచి మెజారిటీతో గెలుస్తున్నాం..
జిందగీల జగిత్యాల జిల్లా అవుతదని అనుకున్నామా? మెడికల్ కాలేజీ వచ్చింది. జగిత్యాల ఇంచుమించు భవిష్యత్తులో కరీంనగర్ అంత పట్టణం అవుతుంది. కాంగ్రెస్ పాలనలో వరద కాలువలకు నాలుగు తూములు కూడా పెట్టుకోలేదు. రోళ్ల వాగు ప్రాజెక్టు చేసుకున్నాం.. కాంగ్రెస్‌లో 12 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎవ్వడు ముఖ్యమంత్రి అవుతడో ఎవడి అయ్యకు తెలియదు. వాడు గెలిచేది లేదు చచ్చేది లేదు. బ్రహ్మాండగా మంచి మెజారిటీతో గెలుస్తున్నాం. అనుమానం లేదు. ఎవ్వరు ఏమీ చేయరు. గాలిలేదు, గత్తరలేదన్నారు. గాలి లేదు.. ఉన్నకాడికి గాలి బీఆర్ఎస్‌దే ఉన్నది. వంద శాతం భయంకరమైన మెజారిటీతో బీఆర్ఎస్ వస్తుందని తెలిపారు.