mt_logo

కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది లేదు..సచ్చేది లేదు: తాండూర్ సభలో సీఎం కేసీఆర్

కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది లేదు..సచ్చేది లేదని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేసారు. తాండూర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. 15 ఏండ్లు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని గుర్తు చేసారు. ప్రజల ఆశీస్సులతోని పదేండ్లుగా పరిపాలన చేసుకుంటున్నాం. గత యాభై ఏండ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఏం జరిగింది.. పదేండ్ల మన బీఆర్ఎస్ పాలనతో ఎంత మంచి అభివృద్ధి జరిగిందో పోల్చి చూడమని కోరారు. మంచిగున్న తెలంగాణను కాంగ్రెస్ ఆనాడు జబర్దస్తీగా ఆంధ్రాలో కలిపితే 58 ఏండ్లు మనం చాలా బాధలు పడ్డాం. గత కాంగ్రెస్ పాలనలో తాండూరు ప్రజలు కాగ్నా నది దగ్గర గుంతలు తీసి, వడగట్టుకుని నీళ్లు తాగిన సంఘటనలు మీరు మరిచిపోయిండ్రని అనుకోవట్లేదని అన్నారు. ఇవ్వాల మన బీఆర్ఎస్ ప్రభుత్వం ‘మిషన్ భగీరథ’ ద్వారా ప్రతి తాండా, ప్రతి గ్రామాల్లో ప్రతిరోజూ పరిశుభ్రమైన నీళ్లను సరఫరా చేస్తున్నదని వివరించారు. 

అది ‘భూమాత’ కాదు..భూ‘మేత’

యాభై ఏండ్ల కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలకు కనీసం మంచినీళ్లు కూడా ఇయ్యలేదని ఆరోపించారు. తెలంగాణ వచ్చిన్నాడు మంచినీళ్లు, సాగునీళ్లు, కరెంటు లేదు. మన ప్రభుత్వంలో రోడ్లు, చెక్ డ్యాంలు, మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను మంచిగా చేసుకున్నం అని తెలిపారు. తాండూరులోనే భూగర్భ జలాలు ఎంత బాగా పెరిగినవో మీ కండ్లారా చూస్తున్నరు. ఇదంతా మన ప్రభుత్వ ఘనతనే అని స్పష్టం చేసారు.  కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ‘రైతుబంధు’ దుబారా అంటున్నడు. కానీ రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా, ఏ మీటింగ్ కెళ్లినా రైతులు, ప్రజలేమో ‘రైతుబంధు’ ఉండాలని పెద్ద ఎత్తున అంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది లేదు..సచ్చేది లేదు. కానీ కాంగ్రేసోల్లు ఏమంటున్నరంటే.. మా ప్రభుత్వమొస్తే ‘ధరణి’ తీసేసి బంగాళాఖాతంలో వేస్తమంటున్నరు. ‘ధరణి’ స్థానంలో ‘భూమాత’ పెడుతరట. అది ‘భూమాత’ కాదు..భూ‘మేత’ అని ఎద్దేవా చేసారు. 

కోరిన కోరికలన్నీ నూటికి నూరు శాతం నెరవేరుస్తా.. 

నిజాయితీకి నిలబడి, తాండూర్‌లో బ్రహ్మాండంగా పనిచేస్తున్న రోహిత్ రెడ్డి అడిగినవన్నీ కాదనకుండా మంజూరు చేస్తా అని హామీ ఇచ్చారు. తాండూర్ బోర్డర్‌లో వెనుకబడి ఉన్న ప్రాంతం. రోహిత్ రెడ్డి తాండూర్ కోసం కోరిన కోరికలన్నీ నూటికి నూరు శాతం నెరవేరుస్తామని హామీనిస్తున్నానని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పేరుకే ఉంది కానీ అక్కడ బంజారాలు లేకుండా పోయినరు. మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదటిసారిగా బంజారాహిల్స్‌లో అద్భుతమైన ‘బంజారా భవన్’ ను కట్టుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ‘కారు’ గుర్తుకు ఓటేసి, మన సొంత పార్టీ బీఆర్ఎస్‌ను గెలిపించుకుంటే మనకు చాలా లాభం జరుగుతుందని అన్నారు. పెద్ద సంఖ్యలో ఆశీర్వాద సభకు తరలివచ్చారంటేనే తాండూర్‌లో పైలట్ రోహిత్ రెడ్డి గెలిచిపోయిండని తెలుస్తున్నదని సంతోషం వ్యక్తం చేసారు. నవంబర్ 30వ తేదీ వరకు ఇదే ఉత్సాహంతో ఉంటూ పైలట్ రోహిత్ రెడ్డిని గెలిపించండి తాండూర్ నియోజకవర్గానికి భారీ అభివృద్ధి పనులు చేసే బాధ్యత నాదని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.