హైదరాబాద్‌లో నరేంద్ర మోడీ ఏం చెప్పిండు ప్రతి మోటరుకు మీటరు పెట్టాలంటున్నడు. నేను పెట్టనన్న. అందుకే మనకొచ్చే 25 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను కట్ చేసిండని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారు చెప్పిండ్రు.. అన్ని రాష్ట్రాలు మీటర్లు పెట్టిండ్రు.. వీళ్ళు పెట్టలేదు. అందుకే 0.5 కట్ చేసినం.. నోట్ల మన్నువోసినం.. అని స్వయంగా తెలిపారని పేర్కొన్నారు. సూర్యాపేట ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత సీఎం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం అని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అని తెలిపారు.
15 ఏండ్లు రాజీలేని పోరాటం చేసినం. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. 58 ఏండ్లు మనల్ని ఏడిపించింది కాంగ్రెస్ పార్టీ. సూర్యాపేటకు, తుంగతుర్తికి నీళ్లు రాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చాలా కఠినమైన పరిస్థితులుండే. కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, సాగునీరు లేదు. చాలా గందరగోళ పరిస్థితులుండే అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో ఫ్లోరైడ్ నీళ్లు తాగించారని ఆవేదన వ్యక్తం చేసారు. కనీసం మంచి నీళ్లివ్వలేదన్నారు. పాలేరు నుంచి పాల లాంటి నీళ్లొస్తున్నాయని స్పష్టం చేసారు. నిన్న రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు.. పండబెట్టి తొక్కుతమంటుండ్రు. చాలా అహంకారంతో మాట్లాడుతుండ్రు. ఇది ఉద్యమాల గడ్డ. ఎర్రజెండాలు ఎగిరిన గడ్డ. కమ్యూనిస్టు ఉద్యమాలు నడిచిన గడ్డ. భీం రెడ్డి నరసింహా రెడ్డి లాంటి మహానీయులు పనిచేసిన గడ్డ. ఈ గడ్డ మీ దుర్మార్గుల ఆగడాలేంటో మీరు ఆలోచన చేయాలని అన్నారు.
బీజేపీకి ఓటేస్తే మోరీల పారేసినట్టే.. అందుకే జగదీష్ రెడ్డికి ఓటెయ్యండని కోరారు. అందరి బాధలు పట్టించుకునే బీఆర్ఎస్‌ను గెలిపించాలని నేను కోరుతున్న. జగదీశ్ రెడ్డి మంచి నాయకుడు. నిజాయితీ పరుడు. ఆయన కోరిన పనులన్ని చేసే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు అందుకే ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.