పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘ధరణి’ తీసేసి ‘భూమాత’ పెడుతరట. అది భూమాత’నా?.. భూ‘మేత’నా? అని సీఎం కేసీఆర్ అడిగారు. స్టేషన్‌ఘన్‌పూర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. స్టేషన్‌ఘన్‌పూర్‌లో గొప్ప ఉద్యమకారులున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పుట్టినప్పుడే గులాబీ జెండాలు ఎగరేసి చాలా గెలుపులు సాధించారని తెలిపారు. బీఆర్ఎస్ పదేండ్ల పరిపాలనలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎట్లుంది? యాభై ఏండ్ల గత కాంగ్రెస్ పాలనలో ఎట్లా ఉండెనో మీరు తేల్చాలని సూచించారు.
ఉద్యమాన్ని ముంచే ప్రయత్నం చేసిన కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వం మనల్ని 15 ఏండ్లు ఏడ్పించి, ఉద్యమాన్ని ముంచే ప్రయత్నం చేసిందని వెల్లడించారు. ఆనాడు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేతో సహా చాలామంది ఎమ్మెల్యేలు అమ్ముడుపోయిండ్రని గుర్తు చేసారు. నాడు బీహార్‌లో పనిచేస్తున్న ఆర్థిక నిపుణుడు ప్రొ.జీఆర్ రెడ్డి, ఇతర నిపుణులతో మేధోమథనం చేసి ఒక లైన్ ఏర్పాటు చేసుకున్నం అని తెలిపారు. ఎన్నికల తర్వాత పెన్షన్ ను ఐదు వేలకు పెంచుకుంటామని హామీ ఇచ్చారు. ‘కంటి వెలుగు’ ద్వారా రాష్ట్రం మొత్తం 3 కోట్ల మందికి పరీక్షలు చేసి, 80 లక్షల కండ్లద్దాలను ఇచ్చాం అని వివరించారు.
చుక్కా సత్తయ్య కథ
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కులమతాలకు అతీతంగా నాలుగు గుడిసెల ఉన్న ఊరికి కూడా ప్రతి ఇంట్లో నల్లా పెట్టి మిషన్ భగీరథ నీళ్లను అందిస్తున్నాం అని వివరించారు. కృష్ణా, గోదావరి నదుల మధ్యల ఉన్న గడ్డకు కనీసం మంచినీళ్లు ఇవ్వడానికి కూడా గత సీఎంలకు చేతకాలేదని ఎద్దేవా చేసారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో మాణిక్యపురం అనే గ్రామంలో పేరొందిన ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య ఉండె. చుక్క సత్తయ్య తన ఒగ్గు కథల ద్వారా వచ్చిన పైసలన్నీ ఆనాటి బోరు పొక్కలల్లనే పోసిండు పాపం. చుక్క సత్తయ్య ఆనాడు 58 బోర్లు వేస్తే చుక్కా నీరు రాలేదు. ఇది చుక్కా సత్తయ్య కథ. ఆనాడు దేవాదుల దగ్గర నీళ్లు రాకపోతే మన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పోయి పిండం పెట్టి నాటి ప్రభుత్వాన్ని దిగాలని గట్టిగా డిమాండ్ చేసిండని వివరించారు.
దిక్కుమాలిన ఇందిరమ్మ రాజ్యంలో ఏముండే?
యాభై ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల ఇందిరమ్మ రాజ్యం తెస్తామని అంటున్నది. ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి, ఎమర్జెన్సీ, ఎన్ కౌంటర్‌లే కదా? నక్సలైట్ ఉద్యమాలే కదా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఏం సక్కదనం ఏడిసింది. మందిని పట్టుకపోయి జైళ్లల్ల పారేసిండ్రు కదా? ఇందిరమ్మ రాజ్యంలో మంచినీళ్లు, కరెంటు లేకుండె కదా. ఎవరికి కావాలె ఇవ్వాల ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం కావాలని మనం కోరుకున్నమా? ఆ దిక్కుమాలిన రాజ్యంలో ఏం లేదు. బలిసినోడు బలిసిపోయిండు..తిండికి లేనోడు తిండికి పోయిండు. ఇందిరమ్మ రాజ్యమే సక్కగుంటే ఎన్టీ రామారావు ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది? రెండు రూపాయలకు కిలో బియ్యం ఎందుకు ఇయ్యాల్సి వచ్చింది? మాడిన కడుపులున్నయని.. ఎండుతున్న డొక్కలున్నయని ఆనాడు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇయ్యాల్సి వచ్చిందని మీ అందరికీ తెలుసు. మనం ఆలోచన చేయాలని సూచించారు.