mt_logo

ప్రభుత్వం ఏర్పాటు చేశాక నెల రోజుల్లో ఆర్టీసీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తాం: సీఎం కేసీఆర్

సంగారెడ్డి: ఆర్టీసీ ఉద్యోగులైతే తమ ఉద్యోగాలు పోతాయని దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షు అనేట్లుగా ఉండేవారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల పర్మినెంట్ ప్రక్రియ గవర్నర్ వల్ల ఆలస్యమైందని తెలిపారు. ప్రభుత్వం వచ్చాక నెలరోజుల్లోపే పర్మినెంట్ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ‘సంగారెడ్డి’ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో చెప్పినట్లుగానే ఇవ్వాల మన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో కంటే ఎక్కువ జీతాలను ఇస్తున్నామని తెలియజేసారు. మన దేశం మొత్తంలో ఉద్యోగులకు ఎక్కువ జీతాలిచ్చే రాష్ట్రం తెలంగాణ ఒక్కటే.ఇటీవల పీఆర్సీ అపాయింట్ చేసాం. పీఆర్సీతో పాటు డీఏలు కూడా ఇచ్చుకుందాం. ఉద్యోగుల సంక్షేమాన్ని చూసుకున్నామని తెలిపారు. 

అంగన్వాడీలు, ఆశావర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల పెంపు, సంక్షేమాన్ని చూసామని తెలియజేసారు. చిన్న ఉద్యోగుల కడుపు కూడా నింపాలని వారికి 30 శాతం జీతాలను పెంచామని వెల్లడించారు. గత ఎన్నికల్లో సంగారెడ్డిలో చింతా ప్రభాకర్‌ను ఓడించినా, నేను సంగారెడ్డిపై అలుగలేదన్నారు. ఇప్పుడున్న సంగారెడ్డి ఎమ్మెల్యే మొదట్లో టీఆర్ఎస్‌లో ఉండె. ఉద్యమ ద్రోహి అయి అమ్ముడుపోయిన విషయం కూడా మీకు తెలుసు. తెలంగాణ కోసం లేడని ఆరోపించారు. 

తెలంగాణకు శాపమే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఆనాడు హరీశ్ రావు, మనోళ్లు తెలంగాణ కోసం కోట్లాడుతున్నరు. తెలంగాణ కోసం ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేనన్నా రాజీనామా చేసిండ్రా? అని ఆవేదనతో అడిగారు. అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్ర మంత్రి పదవులు, మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు ఎన్నిసార్లు రాజీనామా చేసినమో మీకందరికీ తెలుసన్నారు. ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపిందీ కాంగ్రెస్సే.. నీళ్ల దోపిడీ జరుగుతున్నా పట్టించుకోనిదీ కాంగ్రెస్సే.. ఉద్యోగాలు దోపిడీ జరుగుతుంటే మాట్లాడందీ కాంగ్రెస్సే. మళ్లీ ఆ కాంగ్రెస్ వచ్చి ఏం చేస్తదో మనందరం ఆలోచన చేయాలని సూచించారు. చింతా ప్రభాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని, సంగారెడ్డి జిల్లాను మరింత అభివృద్ధి చేద్దామని సీఎం కేసీఆర్ మనవి చేశారు.