mt_logo

111 జీవో పూర్తిస్థాయిలో ఎత్తివేత: సీఎం కేసీఆర్

చేవెళ్ల: ఉద్యమ సమయంలో రంగారెడ్డి జిల్లాలో  కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే భూముల ధరలు తగ్గిపోతాయని ప్రచారం  చేశారు. ఇప్పుడు భూముల ధరలు ఎట్లా ఉన్నాయో మీకు తెలుసన్నారు. పిచ్చి కాంగ్రెస్ వాళ్లకు పిచ్చి పట్టుకుంది. రైతుబంధు వేస్తేనే ఓట్లు పడుతాయని కాంగ్రెస్ అనుకున్నరు. రైతుబంధు వేయవద్దని కాంగ్రెస్ వాళ్లు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేసిండ్లు. రైతుబంధు కాంగ్రెస్ వాళ్లు ఆపేసిండ్లని మండిపడ్డారు. 

రైతులు రందిపడాల్సిన అవసరం లేదు

తొండ బిర్రు ఏందాక రా అంటే ఏనుగుల దాకా అని వెనకట ఒకడు చెప్పిండని ఎద్దేవా చేసారు. ఎన్ని రోజులు కాంగ్రెస్ వాళ్లు ఆపుతరు. మూడు తారీఖు ఓట్లు లెక్కపెడితే మన పార్టీ వస్తుంది. 6 నుంచి రైతుబంధు ఇచ్చుకుందామన్నారు. రైతులు రందిపడాల్సిన అవసరం లేదు. వచ్చేది మన గవర్నమెంటే అని ధీమా వ్యక్తం చేసారు. దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ రైతుబంధు ఆపినా  వాళ్ల శక్తి అంతా 3 వ తారీఖు వరకే అన్నారు. 6 వ తేదీ నుంచి రైతుబంధు యథావిధిగా వస్తదని తెలిపారు. 

ఒక్క దళిత ఓటు కూడా పోవద్దు 

కాంగ్రెస్ వాళ్లు నీచంగా ఆలోచిస్తారు. 111 జీవోను కంప్లీట్ క్లియర్ కావాలని అని సీఎం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారమే ఎత్తేసినా మాస్టర్ ప్లాన్ తయారు కాగానే క్లియర్ అవుతది. దీన్ని చేపించే బాధ్యత నాదే అని హామీ ఇచ్చారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు  మీకు రావాలే. పదేండ్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసులు పెట్టి ఆపినారని ఆగ్రహం వ్యక్తం చేసారు. రంగారెడ్డి జలాల్లో వాటా మీకే ఉన్నది. పాలమూరు నుంచి మొదట చేవేళ్లకే నీళ్లు వస్తయి. ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి నీళ్లు వస్తయని సూచించారు. యాదయ్య గెలిస్తే 24 గంటల కరెంటు వస్తది. కాంగ్రెస్ గెలిస్తే 3 గంటల కరెంటు మాత్రమే వస్తదని హెచ్చరించారు. రైతులకు పాత పద్ధతులతో కష్టాలు తెచ్చే కుట్ర కాంగ్రెస్ చేస్తున్నదన్నారు. పాలమూరు నీళ్లు తెచ్చే బాధ్యత నాది. గవర్నమెంట్ వచ్చినంకా రెండు నెలల్లో 111 జీవో పూర్తిస్థాయిలో తీసేస్తా అని హామీ ఇచ్చారు. ఒక్క దళిత ఓటు కూడా పోవద్దని సీఎం కోరారు.