mt_logo

దళిత బంధు లెక్క గిరిజన బంధు ఇస్తాం: పాలకుర్తి సభలో సీఎం కేసీఆర్

దళిత బంధు లెక్క గిరిజన బంధు ఇస్తాం అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. పాలకుర్తి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినప్పుడు పాలకుర్తి ఎట్లా ఉండె.. ఇవ్వాల జరిగిన మంచి అభివృద్ధిని చూడండని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడే 3 గంటల కరెంటు చాలని బల్ల గుద్ది చెబుతున్నడు. కేసీఆఆర్‌కు ఏం తెల్వది..10 హెచ్ పి. మోటార్‌ను రైతులు పెట్టుకుంటే గంటకు ఎకరం పొలం పారుతది..మూడు గంటలు చాలు అంటుండు. రైతుల దగ్గర 10 హెచ్.పి.మోటార్ ఉంటదా? రైతులకు ఉండేదే 3 హెచ్ పి. 5 హెచ్.పి. మోటార్లు. మరి 10 హెచ్.పి. మోటార్లు ఎవరు కొనియ్యాలె? అని ప్రశ్నించారు. 

10 హెచ్.పి. మోటార్లు ఎవరు కొనియ్యాలె?

రాష్ట్రంలో చట్టబద్ధంగా 30 లక్షల మోటార్లు ఉంటే..అదనంగా మరో రెండు మూడు లక్షల మోటార్లు ఉంటయ్. వీటన్నింటికీ 10 హెచ్.పి.మోటార్లు కొనాలంటే ఎవరు కొనాలె? 10 హెచ్.పి. మోటార్లతో నీళ్లు గుంజితే బోర్లల్లో నీళ్లుంటాయా? ఎన్నికలప్పుడు తియ్యగా పుల్లగా మాట్లాడి ఆరు సందమామలు తెస్తం.. ఏడు సూర్యులను తెస్తమంటరు. ఎన్నికలొచ్చినప్పుడే కాంగ్రెస్ లాంటోళ్లు ఎవరన్నా వచ్చి చెబితే గోల్ మాల్ కావొద్దని సూచించారు. 

గిరిజనుల రిజర్వేషన్ల పెంపు 

‘మా తాండాలో మా రాజ్యం’ కావాలని గిరిజనులు దశాబ్దాల తరబడి కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? అని ప్రశ్నించారు. ఇవ్వాల బీఆర్ఎస్ ప్రభుత్వమే పాలకుర్తి నియోజకవర్గంలో 49 గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసిందని తెలిపారు. గిరిజన బిడ్డలే సర్పంచులై రాజ్యమేలుతున్నారు. గిరిజనుల రిజర్వేషన్లను పెంచుకున్నం అని వెల్లడించారు.  దళిత బంధు మాదిరిగా భూమి, ఉద్యోగం, ఆసరా లేకుండా ఉన్న గిరిజన బిడ్డలందరికీ ‘గిరిజన బంధు’ను తప్పకుండా అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు.  75 ఏండ్ల పరిపాలనలో దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి, పార్టీ, ఇంకే నాయకుడైనా ‘దళిత బంధు’ అనే స్కీంను పుట్టించిండా? అని అడిగారు. 

రేపు నెత్తిల కిరీటం పెడుతడా? 

వేల సంవత్సరాలుగా అణిచివేయబడ్డ దళితుల క్షేమం గురించి ఎవరూ ఆలోచన చెయ్యలేదు. వాళ్లను ఓటు బ్యాంకుగా వాడున్నరు తప్ప వాళ్ల క్షేమం గురించి ఎన్నడూ ఆలోచన చెయ్యలేదన్నారు. దయాకర్ రావును గెలిపించండి.. పాలకుర్తికి ఇంజనీరింగ్ కాలేజీ ఉరికి ఉరికి వస్తదిని చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గంలో పేదలు, దళితులు, గిరిజనులు ఎక్కువగా ఉన్నరు కాబట్టి దయాకర్ రావు కోరిక మేరకు మొదటి రెండేండ్లలోనే ప్రతి గ్రామానికి వంద, వంద యాభై ఇండ్లను మంజూరు చేస్తానని అన్నారు.  పాలకుర్తిలో ఏం జరుగుతుందో నాకు తెలుసు.. అమెరికా నుంచి విమానంల వచ్చి ఐదు రోజులు మురిపించటోడు మనకు రేపు నెత్తిల కిరీటం పెడుతడా?  టోపీ పెట్టి మల్ల విమానం ఎక్కుతరు తప్ప ఇక్కడ ఉండరని ఎద్దేవా చేసారు. దయాకర్ రావు కారు గుర్తుకే ఓటేసి, బీఆర్ఎస్‌నే గెలిపించాలని మిమ్మల్ని కోరుతావున్నానని పేర్కొన్నారు.