పంచరంగుల కల కంటున్నా జానారెడ్డి అని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేసారు. హాలియా ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ధైర్యం చేసి అన్ని వర్గాలకు ఉపయోగపడే పనులు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. మెదక్, మహబూబ్‌నగర్ లాంటి అనేక జిల్లాల నుంచి ప్రజలు వేరే ప్రాంతాలకు బతుకపోయేదని తెలిపారు. పశువులకు కూడా గడ్డి లేక కబేళాలకు అమ్మేసి, అన్నమో..రామచంద్రా!.. అని పొట్టచేత పట్టుకొని బతుకపోయేదని పేర్కొన్నారు.
జాగ్రత్తగా ఉండాలి
జానారెడ్డి మన పార్టీకి మారలేదు.. మన కండువా కప్పుకోలేదు.. ఉల్టా పోయిన ఎన్నికల్లో మన భగత్ మీద నిలబడితే ఈ నియోజకవర్గ ప్రజలే ఓడించిండ్రని అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పడే ప్రభుత్వం మంచిగుంటే మీకు మంచి జరుగుతది.. చెడ్డగుంటే మీకు చెడ్డ జరుగుతది, మీ నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. జానారెడ్డి ఇప్పుడు కూడా తాను ముఖ్యమంత్రినైతా అని పంచరంగుల కల కంటున్నాడని ఎద్దేవా చేసారు. భగత్ ఎమ్మెల్యే అయ్యేదాక నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ కూడా దిక్కులేకుండె అని మండిపడ్డారు.
కాంగ్రెస్ పేదలను చూడలే..
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఏ పేదలను చూడలేదు. రెండొందల పెన్షన్ మొఖాన కొట్టి మీ చావు మీరు చావుమన్నరని పేర్కొన్నారు.పెన్ష న్‌ను మొదటి వెయ్యి చేసి, ఇవ్వాల రెండు వేలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ యే అని గర్వించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కంటి వెలుగును పెట్టాం అని తెలిపారు. 3 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి దాదాపు 80 లక్షలకు పైగా కండ్లద్దాలు ఇచ్చామని స్పష్టం చేసారు.
ఆనాడు ఇచ్చిన బియ్యం ఎంత? మనం ఈనాడు ఎంత?
కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లాడు పుడితే రూ.12 వేలు ఇస్తున్నాం. అమ్మవొడి వాహనాలను పెట్టాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ ఏనాడైనా ఆలోచన చేసిందా? ఆనాడు దోపిడీకి గురైతే ఎప్పుడైనా ప్రజల గురించి ఆలోచన చేసిండ్రా? అని అడిగారు. ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన బియ్యం ఎంత? మనం ఈనాడు ఇస్తున్న బియ్యం ఎంత? అని ప్రశ్నించారు. చరిత్రలో ఎప్పుడూ విననటువంటి.. జానారెడ్డిని విమర్శించ దలుచుకోలేదు, కానీ ఆయన హయాంలో నాలుగు రోడ్లు తప్ప పెద్దగా అభివృద్ధి జరగలేదని స్పష్టం చేసారు.