mt_logo

గిరిజనేతరులకు కూడా పట్టాలు: సీఎం కేసీఆర్

నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు జ్యోతిలాగా వెలిగిపోతుందని సీఎం కేసీఆర్ సూచించారు. ములుగు ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం మాట్లాడుతూ.. సమ్మక్క సారక్క తల్లి ఉండే ఈ నేలకు వందనం చేస్తున్నానాని పేర్కొన్నారు. అమ్మా సమ్మక్క తల్లి, సారక్క తల్లి మా తెలంగాణ మాకు వచ్చేట్లు చూడుమని ఎన్నోసార్లు మొక్కి బంగారం కూడా ఇచ్చినాను అని తెలిపారు. అంతకుముందు మన జాతరకు ఆదరణ లేకుండే. తెలంగాణ ఏర్పాటయ్యాక  ప్రతి సంవత్సరం 80 నుండి 100 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టుకుంటూ జాతరను  రాష్ట్ర స్థాయిలో నిర్వహించుకుంటున్నాం. ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. జాతరకు రావడానికి రోడ్లు కూడా బాగా లేకుండే ఒక సారి నేను వస్తే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి ఉన్నా అని తెలిపారు. రోడ్లు వేసుకున్నాక  మేలుగా కనబడుతూ ఉన్నది. ఇంకా అభివృద్ధి చేసుకుంటున్నాం అని తెలిపారు. 

కల్యాణ లక్ష్మికి ఆయనే ప్రేరణ

ములుగులోని తండాలో ఒక గిరిజన సోదరుడి గుడిసె అంటుకుని కాలిపోయింది. ఇంటి ఆయనది ఒకటే ఏడుపు నేను చనిపోతా బతుకనని అంటూ. ఎందుకయా ఏడుస్తున్నావ్ అంటే శ్రీరామనవమి తర్వాత నా బిడ్డ పెళ్లి  పెట్టుకున్నా. డబ్బులు కూడా కాలిపోయినయి. నాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదు అన్నాడు. బాధపడకు నేను డబ్బులు పంపిస్తా నేను కూడా వస్తానని చెప్పినా. ఆయన అప్పుడు సంతోష పడ్డాడు. పెళ్లికి కూడా వచ్చినా అని గుర్తు చేసారు. దీనిని ప్రేరణగా తీసుకుని లక్ష రూపాయలు కల్యాణ లక్ష్మి ఇస్తున్నాం అని పేర్కొన్నారు. 

గిరిజనేతరులకు కూడా పట్టాలు

ములుగులో  పోడు భూములు పంపిణీ చేసినాం. రైతుబంధు, రైతుబీమా కల్పించాం. కేసులు ఎత్తివేశాం అని వివరించారు. గిరిజనులు కాని వారి చేతిలో పోడు భూములు ఉన్నాయి. గిరిజనేతరులకు కూడా పట్టాలు ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పార్టీ ఎమ్మెల్యేను ములుగులో మీరు ఓడగొట్టినా.. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ములుగును జిల్లా చేసానని తెలిపారు. తెలంగాణ వచ్చాక నవ్వెటోని ముందు జారిపడొద్దని జాగ్రత్తగా అడుగులు వేశామని అన్నారు. జీవితంలో అనుకున్నామా.. ములుగుకు మెడికల్ కాలేజీ వస్తుందని అని అడిగారు. ఏటూరి నాగారంలో డయాలసిస్ సెంటర్‌ను కూడా పెట్టించినా అని అభివర్ణించారు. ఎమ్మెల్యేగా ఏ పార్టీకి చెందిన వారైనా  ఉండొచ్చు. ముఖ్యమంత్రిని కలువాలి మాట్లాడాలి. అభివృద్ధి పనుల గురించి అడుగాలి. మీ ఎమ్మెల్యే ఏ రోజు వచ్చి ఏమి అడుగదు. మాకు తెలిసినవి. తోచినవి చేశాం అని వెల్లడించారు. మీ కాంగ్రెస్ పాలనలో  మంచి నీళ్లు ఇచ్చిండ్లా? అని ప్రశ్నించారు. వాదులాటలు కాదు..జరగాల్సింది ప్రజల క్షేమం అన్నారు. 

ఇందిరమ్మ రాజ్యంలో ఎన్ కౌంటర్లు, బానిస బతుకులే.. 

బడే నాగజ్యోతి చరిత్ర మీకు తెలుసు. ఇందిరమ్మ రాజ్యంలో ఎన్ కౌంటర్లు, బానిస బతుకులే అని ఆవేదన వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పాలనలో బడే నాగజ్యోతి తండ్రి ప్రజల కోసం ఉద్యమంలోకి వెళ్లి అమరుడయ్యాడని గుర్తు చేసారు. తల్లి లేదు తండ్రి లేదు. ములుగు ప్రజలే తల్లిదండ్రులని జ్యోతి చెప్పింది. సర్పంచ్‌గా పని చేసి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యింది. నాగజ్యోతి గెలిచాక రెండు రోజులు ఇక్కడే ఉండి మీ సమస్యలన్నీ తీర్చుతానని మాట ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు గెలిచేది లేదు. చచ్చేది లేదు. ఏమి లేదు గాలి అంతా తుస్సుమున్నదని ఎద్దేవా చేసారు. ములుగు అభివృద్ధి కావాలంటే గవర్నమెంట్ ఉండే పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు.