mt_logo

తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఇంచు కేసీఆర్‌దే.. ప్రతీ ఇంచు బాగు పడాల్సిందే: సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇంచు భూమి అయినా కేసీఆర్ దే.. ప్రతి ఇంచు బాగుపడాల్సిందే అని సీఎం స్పష్టం చేసారు. ఎక్కడ ధాన్యం పంట పెరిగినా.. ఎక్కడ పదిమంది మొఖాలు తెల్లపడ్డా నాకు గర్వమే కదా. రాష్ట్ర నాయకత్వానికి ఉండాల్సిన సోయి అదే కదా! అని సీఎం అడిగారు. మధిర ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ..  కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసాల చరిత్ర. నేను ఘంటాపథంగా చెప్పగలుగుతా అని అన్నారు. యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో పేదలు, రైతులు, దళితుల పరిస్థితులు ఎట్లా ఉండెనో.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంత మంచిగా అభివృద్ధి జరుగుతున్నదో చూడాలని మనవి చేసారు.

ఆనాడు అసెంబ్లీకి కందిళ్లు, కిరోసిన్ బుడ్లు, ఎండిపోయిన వరి కంకులు..

నేను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో మధిర ఎమ్మెల్యే బోడేపూడి వెంకటేశ్వరరావు మాకు నీళ్లు సరిగ్గా వస్తలేవు, మా ఆయకట్టు ఎండిపోతావుందని వరి మొలకలు తీసుకొచ్చి అసెంబ్లీలో చూపెట్టేదని గుర్తు చేసారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు వస్తలేదని ఆనాడు అసెంబ్లీకి కందిళ్లు, కిరోసిన్ బుడ్లు, ఎండిపోయిన వరి కంకులు పట్టుకొని రావడం మనందరికీ తెలిసిందే అన్నారు. గత పదేండ్ల మన బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ వరి పొండ ఎండకుండా చూసుకున్నాం. 24 కరెంటు, ఆయకట్టు నీళ్లు వస్తున్నాయి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో బ్రహ్మాండమైన పండుగలా రాష్ట్రమంతా పంటలు పండుతున్నాయని తెలియజేసారు. 14 ఏండ్ల పోరాటం తర్వాత తెలంగాణ వస్తే మేం ఆషామాషీగా పని చేయలేదు. పేరెన్నికగన్న ఆర్థిక నిపుణులను పిలిపించి మేధోమథనం చేసి, పద్ధతి ప్రకారంగా వెళ్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తున్నాం అని సీఎం పేర్కొన్నారు.  

పదిమంది మొఖాలు తెల్లపడ్డా నాకు గర్వమే కదా?

తెలంగాణోళ్లకి వ్యవసాయం చేయరాదని..మీరు జొన్నలే పండించుకోవాలె..గట్కనే తినాలెనని ఆనాడు ఆంధ్రోళ్లు కొందరు కించపరిచారు. ఇయ్యాల వరి ధాన్యం ఉత్పత్తిలో ఆంధ్రా ఎక్కుడుంది? మన తెలంగాణ ఎక్కడుందో మీరంతా మనసు పెట్టి ఆలోచించాలన్నారు. పదేండ్లలో మనం సాధించిన విజయాలు మనం మంత్రం చేస్తనో..మాయ చేస్తనో, ఉపన్యాసం చెప్తనో, సొల్లు పురాణాలు చెబితేనో రాలేదు. చిత్తశుద్ధితో పనిచేసి సక్సెస్ సాధించిన అని తేల్చి చెప్పారు. మధిర చైతన్యవంతమైన ప్రాంతం. గత రెండు ఎన్నికల్లో మధిర ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించలేదు. అయినా నేను మీ మీద అలుగలేదన్నారు. ఈ మధిర నాదే అని సీఎం అన్నారు.