కాంగ్రేసోళ్లని నమ్మితే వైకుంఠం ఆటలో పెద్దపామును మింగినట్లైతదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. కోరుట్ల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు ధరణి తీసేసి బంగాళాఖాతంలో వేస్తామంటున్నరు.ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమే వస్తదని హెచ్చరించారు. ఎన్నికలప్పుడు ఆలోచన తక్కువ.. గడబిడ ఎక్కువగా ఉంటది. దేశంలో ఇంకా డెమొక్రటిక్ మెచ్యూరిటీ రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎవరుంటే మంచిది, ఎవరేం చేసిండ్రో చూసి ఓటు వేస్తే ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని సూచించారు. అభ్యర్థి గుణగణాలతో పాటు అతని వెనుకున్న పార్టీల గత చరిత్ర, రైతులు, పేదల గురించి ఆ పార్టీలు ఏవిధంగా వ్యవహరించినవో చూసి ఓటెయ్యాలని వివరించారు.
బతిమాలినా ఒక్క రూపాయి ఇవ్వలే..
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. నాడు మీరందరూ ఉద్యమాన్ని సమర్ధించి, ముందుకు నడిపారు. బీఆర్ఎస్ పదేండ్ల ప్రభుత్వంలో ఏం జరిగింది.. గతంలోని యాభై ఏండ్ల ప్రభుత్వంలో ఏం జరిగిందో బేరీజు వేయండని కోరారు. చేనేత కార్మికులు సిరిసిల్ల, భూదాన్ పోచంపల్లి, దుబ్బాక లలో ఒక్కొక్కరోజు ఆరుగురు, ఏడుగురు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం, మేం ఆ శవాలను పట్టుకుని ఏడువడం జరిగిందని వెల్లడించారు. నాడు భూదాన్ పోచంపల్లిలో ఒక్కరోజులోనే ఏడుగురు నేతన్నలు చనిపోతే ఉన్నోళ్లన్నా బతుకుతారని ఒక యాభై వేలో.. లక్ష రూపాయలో ఇవ్వమని అప్పటి ముఖ్యమంత్రికి రెండు చేతులు పెట్టి బతిమాలినా ఒక్క రూపాయి ఇవ్వలేదని పేర్కొన్నారు.
కొత్తగా నమోదైన బీడీ కార్మికులకు తప్పకుండా పెన్షన్
ప్రభుత్వం వచ్చాక మూడు, నాలుగు నెలలపాటు ఎంతో మేధోమథనం చేసి ముందుకెళుతున్నాం అని తెలియజేసారు. కాంగ్రెస్ హయాంలో డెబ్బై రూపాయలు, రెండొందల పెన్షన్లనే ఇచ్చేవారుని గుర్తు చేసారు. మొదటిసారిగా పెన్షన్లను వేల రూపాయలకు తీసుకుపోయింది ఒక్క కేసీఆర్..బీఆర్ఎస్ ప్రభుత్వమే అని వివరించారు. నేను దుబ్బాకలో హైస్కూల్‌లో చదువుకున్నప్పుడు ఒక నేతన్న ఇంట్లో ఉండే చదువుకున్న. వాళ్ళు బీడీలు కూడా చుట్టేదని, నేత కార్మికుల బాధలు, వాళ్ళు తినే తిండి, వాళ్లకొచ్చే బీమారులు నేను కండ్లారా చూసిన అని అన్నారు. కష్టజీవులని తెలుసు కాబట్టే ఎవరూ అడగకున్నా నా అంతట నేనే బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నానని పేర్కొన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్లను తప్పకుండా రెండు వేల నుంచి ఐదు వేలకు పెంచుకుంటాం అని వెల్లడించారు. కొత్తగా నమోదైన బీడీ కార్మికులకు తప్పకుండా పెన్షన్ వస్తుందని హామీనిస్తున్నానని స్పష్టం చేసారు.
చేనేత కార్మికులను ఆదుకోవడానికి బడ్జెట్
పెన్షన్లను ఓట్ల కోసం పెట్టలేదు. కళ్యాణలక్ష్మి, రైతుబంధు ఓట్లప్పుడు చెప్పలేదు. ఎన్నికల ప్రణాళికలో చెప్పినవాటికంటే వంద ఎక్కువగానే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందని చెప్పారు. చేనేత కార్మికులను ఆదుకోవడానికి యాభై శాతం రంగులు, రసాయనాలు ఉచితంగా ఇస్తున్నాం. త్రిఫ్ట్ స్కీంలు పెట్టాం. అయినా నాకింకా తృప్తి లేదన్నారు. సిరిసిల్లలో చేసిన విధంగా ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకోమని కేటీఆర్‌కు చెప్పానని అన్నారు. రాబోయే రోజుల్లో చేనేత కార్మికులను ఆదుకోవడానికి బడ్జెట్ పెంచి మరిన్ని కార్యక్రమాలను తీసుకుంటాం. చేనేత వర్గానికే చెందిన ఎమ్మెల్సీ ఎల్.రమణ కూడా ఈ విషయంపై చర్చించాడు.
మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలె..
రైతు బంధు తీసేయాలని కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటడు.వచ్చే మన ప్రభుత్వంలో రైతుబంధును ఎకరానికి 12 వేల నుంచి దశలవారీగా 16 వేలకు పెంచుకుంటాం అని తెలిపారు. కాంగ్రేసోళ్లని నమ్మితే వైకుంఠం ఆటలో పెద్దపామును మింగినట్లైతదని ఎద్దేవా చేసారు. తీర్థం పోదాం తిమ్మక్కా అంటే నువ్వు గుల్లె..నేను సల్లె..అనే కథలా ఉండొద్దంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలె అని అన్నారు. నిరాహారదీక్ష, ఉద్యమ సమయాల్లో ప్రతి నిమిషం నన్ను చూసుకున్న నా బిడ్డ లాంటి వ్యక్తి సంజయ్. యువ నాయకుడు, చదువుకున్నవాడు, వైద్య వృత్తిలో కోట్లు సంపాదించుకునే అవకాశమున్నా తన ప్రాంతానికి సేవ చేయాలని సంజయ్ మీ ముందుకొచ్చాడు.సంజయ్ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని కోరుకుతున్నానని పేర్కొన్నారు.