mt_logo

వచ్చిన తెలంగాణను విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్: సీఎం కేసీఆర్

వచ్చిన తెలంగాణను విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. కామారెడ్డి ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో నాకు దీవెన ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన మీ అందరికీ సంతోషంతో ధన్యవాదాలు తెలియజేసారు. కామారెడ్డి గడ్డతో నాకు పుట్టుక నుంచే సంబంధం ఉందని వెల్లడించారు. బీబీపేట మండలంలో ఉన్న కోనాయిపల్లి గ్రామాన్ని గతంలో పోసానిపల్లె అని పిలిచేది. మా అమ్మగారు పుట్టింది ఆ గ్రామంలోనే, ఆరుగొండలో మా మేనమామలుండేవారని చెప్పారు. 

ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నా..: కేసీఆర్ 

నాడు జలసాధన ఉద్యమ కామారెడ్డి మండల బ్రిగేడియర్‌గా నేనే ఇక్కడ కొచ్చి పనిచేసిన అని పేర్కొన్నారు. ఆరోజు పరేడ్ గ్రౌండ్ సభకు వెళ్లేందుకు కామారెడ్డి దేశాయి బీడీ ఫ్యాక్టరీలో కూలీ పని చేసాను. తెలంగాణ ఉద్యమం ప్రారంభ రోజుల్లో కామారెడ్డి న్యాయవాదులు అందరికంటే ఎక్కువ చైతన్యంతో మా బావగారు రామారావు, మిత్రుడు తిరుమల్ రెడ్డి ల నాయకత్వంలో మొట్టమొదటి బార్ అసోసియేషన్ తెలంగాణలో తెలంగాణ కోసం ఏకగ్రీవ తీర్మానం చేసిన బార్ అసోసియేషన్ కామారెడ్డి బార్ అసోసియేషన్. ఉద్యమానికి ఊపునిచ్చింది. గతంలో హామీనిచ్చిన విధంగా కామారెడ్డిని జిల్లాను చేశామని తెలిపారు. మెడికల్ కాలేజీని కూడా తెచ్చామని సగర్వాంగా స్పష్టం చేసారు. 

కేసీఆర్ ఒక్కడే రాడు. చాలా వస్తయ్.. 

కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నాయకులు కామారెడ్డి నుంచి పోటీచేయాలని అడగడం దైవకృపతో పోటీ చేయడం జరుగుతున్నది.కేసీఆర్ ఒక్కడే రాడు..కేసీఆర్ వెంట చాలా వస్తయ్ అని అన్నారు. కేసీఆర్ వెంట కామారెడ్డి, ఎల్లారెడ్డిపేటల ప్రాంతాలకు ఏడాదిన్నరలో సాగునీళ్లను అందిస్తాను. ఇది నా వాగ్దానం అన్నారు.  కేసీఆర్ వెంట.. విద్యుత్, విద్యా సంస్థలు, పరిశ్రమలు వస్తయ్..కామారెడ్డి రూపురేఖలు చాలా అద్భుతంగా తయారు చేసే బాధ్యత నాదన్నారు.  ఎన్నికలు రాగానే ఇష్టమొచ్చిన అబద్ధాలు, అభాండాలు, పనికిమాలిన వాగ్ధానాలు, చెయ్యలేమని తెలిసి కూడా ఆశలు పెట్టుడు.. తర్వాత గోల్ మాల్ తిప్పుడు.. ఇదంతా ఏ పరిణామాలకు దారితీస్తావుంది. ఆ పరిస్థితులు రాకుండా చూడాలె అని సూచించారు. 

నిజాయితీతో పనిచేసిన వారికే ఓటు   

తరతరాలుగా దోపిడీకి, అణచివేతకు గురైన దళితులు మన ప్రజాస్వామ్యంలో బాగుపడవద్దా? వాళ్లు మనుషులు కారా?దళితుల ఓట్లు కావాలె..కానీ వాళ్ల బాగోగులు చూడరు. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే ‘దళిత బంధు’ పథకం లాంటివి పెట్టివుంటే ఇవ్వాల దళితులకీ దుస్థితి పట్టేదేనా? అని ప్రశ్నించారు.  చరిత్ర తెలియనివాళ్లు తెలుసుకొనే ప్రయత్నం చేసి తమ ఓటును నిజాయితీతో పనిచేసినవారికి వేయాలన్నారు.  కాంగ్రెస్ పార్టీ తన పాలనలో ప్రాజెక్టులు కట్టిండ్రా..నీళ్లు ఇచ్చిండ్రా..ఉద్యోగాలు ఇచ్చిండ్రా.. కరెంటు ఇచ్చిండ్రా..పంట ఎక్కువ పండటానికి దోహదపడ్డరా.. ప్రజలు ఆలోచన చేయాలి.

డబ్బుల కట్టల్తో దొరికిన దొంగకు కేసీఆర్‌తో పోటా?

వచ్చిన తెలంగాణను బతకనీయొద్దని ఎమ్మెల్యేలను కొని అస్థిరత సృష్టించాలని చూసిండ్రు అని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనాలని ఎవరైతే యాభై లక్షల రూపాయలతో పట్టుబడినోడే కామారెడ్డిలో కాంగ్రెస్ నుంచి పోటీచేస్తడట. వచ్చిన తెలంగాణను విచ్ఛిన్నం చేయడానికి, టీఆర్ఎస్ పార్టీని అస్థిరపరచడానికి యాభై లక్షల రూపాయలతో దొరికినోన్ని ఇవ్వాల కేసీఆర్ మీద పోటీ పెడుతున్నది కాంగ్రెస్. ఓటుకు నోటు దొంగలకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఇవ్వాల కామారెడ్డి ప్రజలపై ఉన్నదని సూచించారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని బంగారు తున్కగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని అన్నారు. మీరు దీవెనలు ఇవ్వండని ప్రజలను కోరారు.