గజ్వేల్: గజ్వేల్‌కు ఐటీ పరిశ్రమలు తెచ్చి పెట్టే బాధ్యత నాదని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ‘గజ్వేల్’ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు నాకు బలాన్ని ఇచ్చిన గడ్డ సిద్దిపేట అని తెలిపారు. సాధించిన తెలంగాణను తీర్చిదిద్దేటందుకు నన్ను ఎమ్మెల్యేను చేసి, రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిన గడ్డ ఈ గజ్వేల్ గడ్డ అన్నారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా గజ్వేల్ ప్రాంత అభివృద్ధికి కూడా శాయశక్తులా కృషి చేశానని పేర్కొన్నారు.
మంచినీళ్ల భాధ తీరింది శాశ్వతంగా..
గజ్వేల్‌లో చేసిన అభివృద్ధి మీ కండ్ల ముందటే ఉన్నదని సూచించారు. గతంలో మంచినీళ్ల కోసం నానా ఇబ్బందులు పడ్డ గజ్వేల్‌కు శాశ్వతంగా ఆ భాధ తీరిపోయింది. సాగునీటితో ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డ గజ్వేల్‌కు ప్రాజెక్టులు, కాలువలు తీసుకొచ్చి బాధ లేకుండా చేసినాను. ఎన్నడూ అనుకోని విధంగా గజ్వేల్‌కు రైలు కూడా వచ్చిందని వెల్లడించారు. గజ్వేల్ అన్ని రంగాలలో మంచి ఆరాధ్య భావం పెంపొందించే విధంగా ఒక గుర్తింపు కలిగింది. మన గజ్వేల్ మోడల్ అభివృద్ధిని చూడటానికి వేరే దేశాలు, రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా వచ్చారు. మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్, అడవులు పునరుద్ధరణ, మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ తదితర పనులను చూడటానికి గజ్వేల్‌కు వస్తున్నారు. ‘మిషన్ భగీరథ’ పథకం గురించి తెలుసుకోవడానికి కోమటి బండకు రాని రాష్ట్రమే లేదన్నారు. మనం తాగేనీళ్లే కాకుండా మన పొలాలకు కూడా గోదావరి నీళ్లే వస్తున్నాయి. గజ్వేల్ ఒక రోల్ మోడల్ గా మంచి పద్ధతిలో ఎదిగిందని స్పష్టం చేసారు. ఇంకా చాలా పనులు జరగాల్సి ఉందని తెలిపారు. గజ్వేల్‌లో నేను మాట్లాడేది 96వ సభ. గజ్వేల్ నుంచి మీరు అవకాశమిస్తే, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పంపిస్తే ఈ రాష్ట్రం కోసం చాలా కష్టపడ్డాం..అభివృద్ధి చేశాం. వచ్చేటటువంటి ఆర్ఆర్ఆర్ కూడా మన గజ్వేల్ నుంచే వస్తున్నదని సంతోషంగా తెలియజేస్తున్నాను. తెలంగాణనే ఆశగా, శ్వాసగా గత 24 ఏండ్లుగా బతుకుతున్నాను. మీ అందరికీ తెలిసిందే అన్నారు.
కాంగ్రెస్ గెలిచేది లేదు.. సచ్చేది లేదు..
కాంగ్రెస్ పార్టీ మళ్లీ కొత్త రూపంలో వస్తూ.. మేం గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారు. ఇయ్యాల ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాల్నో అర్థం కాదు. ఇందిరమ్మ రాజ్యంలో సక్కదనముంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టి, రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చేదాక ఆకలి కడుపులతోనే ఉన్నది మన రాష్ట్రం. ఇందిరమ్మ రాజ్యంలోనే కదా ఎమర్జెన్సీ చీకటి రాజ్యం వచ్చిందని అడిగారు. ఇందిరమ్మ రాజ్యమంలోనే కదా ఎన్ కౌంటర్లు జరిగి రక్తపాతం జరిగింది. ఇందిరమ్మ రాజ్యంలోనే కదా 1969 తెలంగాణ ఉద్యమంలో 400 మందిని కాల్చి చంపింది. ఇలాంటి దుర్మార్గాలను కావాలని తెలంగాణ ప్రజలు మళ్లెట్ల కోరుకుంటారు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిచేది లేదు.. సచ్చేది లేదు గానీ ఇందిరమ్మ రాజ్యం తెస్తమని మట్లాడుతున్నరు. తెలంగాణ వచ్చిన మొదట్లోనే మన ప్రభుత్వాలను పడగొట్టాలని కుట్రలు చేసినారు. మన ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నం చేసినారు. ఎన్నో ఆటంకాలు, కుట్రలు, కుతంత్రాలను అధిగమించుకుంటూ తెలంగాణలో మన పాలనను మొదలుపెట్టుకున్నామని తెలియజేసారు.
ప్రతి మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్
వరంగల్‌లో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు, నిమ్స్ 2 వేల పడకలతో విస్తరణ, హైదరాబాద్‌లో 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పూర్తవుతున్నాయని అభివర్ణించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత ఒకే విడతలో దళితబంధును అమలుచేసుకుందామని అన్నారు. గజ్వేల్‌లోని దళితవాడల్లో గల దరిద్రాన్నంతా పారద్రోలుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ పంటల ఉత్పత్తి పెరిగింది. పంటల వైవిధ్యం రావాలి. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రతి మండలంలో రావాలి. రైతులందరూ వాటాదారులు కావాలి. రైతుల బిడ్డలకు అందులో ఉద్యోగాలు రావాలి. కుల,మత, జాతి అనే పిచ్చి ఆలోచనలు లేకుండా శాంతిభద్రతలు లేకుండా అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగతిలో ఉండాలని పనిచేస్తున్నానని పేర్కొన్నారు. గజ్వేల్ ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తే రానున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొండపోచమ్మ, నాచారం దేవాలయంను అద్భుతంగా మార్చుకుందామన్నారు. గజ్వేల్‌కు ఐటీ పరిశ్రమలు తెచ్చి పెట్టే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. ప్రతి మండల కేంద్రంలో మార్కెట్ యార్డును నిర్మించుకుందామన్నారు.
ముంపు గ్రామ ప్రజలకు పరిశ్రమలు
ఆసియా ఖండంలోనే అతిపెద్ద రిజర్వాయర్ మన మల్లన్న సాగర్ రిజర్వాయర్. దాన్ని అద్భుతమైన టూరిస్ట్ ప్రాంతంగా మార్చుకుందామని తెలిపారు. ఒకనాడు సుక్క నీళ్ల కోసం తపించిన గజ్వేల్.. ఇయ్యాల 12 జిల్లాలకు నీళ్లందించే నీటి ఖజానా అయింది. ముంపు గ్రామ ప్రజలకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నిర్వాసితులందరికీ నమస్కరిస్తున్నాను. వారి ప్రాంతంలో పరిశ్రమలు పెట్టిస్తానని మాట ఇస్తున్నాను. 12 కాలుష్య రహిత పరిశ్రమలను తప్పకుండా గజ్వేల్‌కు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. రైతులకు లాభం వచ్చే విధంగా అన్ని కార్యక్రమాలను గజ్వేల్‌లో చేసుకుందాం. నరేంద్ర మోడీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ గానీ, నవోదయ పాఠశాల గానీ ఇవ్వలేదు. బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయకూడదని సూచించారు. నేను ముఖ్యమంత్రిగా కావడానినికి నన్ను ఎమ్మెల్యే చేసినందుకు హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కూడా అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే గజ్వేల్ కీర్తిని ఆకాశానికెత్తుకునేలా చేస్తానని సీఎం కేసీఆర్ మాట ఇచ్చారు.