గద్వాలను గబ్బు పట్టించిన గబ్బునాయళ్లు కాంగ్రెస్ నాయకులు అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. గద్వాలలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ… గద్వాల్ చరిత్ర చాలా గొప్పది, గద్వాలను గబ్బు పట్టించిన గబ్బునాయళ్లు ఎవరు.. కాంగ్రెస్ నాయకులే అని సీఎం కేసీఆర్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలోని అన్ని ప్రాజెక్టులను ఆ పార్టీల నేతలే నాశనం చేశారని ఆరోపించారు. కానీ మీరు దీవించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గద్వాలను అద్భుతంగా అభివృద్ధి చేశారని తెలిపారు.ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ, అభ్యర్థి చరిత్ర చూడాలన్నారు.
గద్వాల్‌ను నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ
కృష్ణా, తుంగభద్ర నడుమ ఉన్న నడిగడ్డ ప్రాంతాన్ని కరువుసీమగా ఆగం చేసిన పార్టీ ఏదీ? ఆర్డీఎస్ కాలువను ఆగం చేసింది ఏ పార్టీ?.. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడి మంత్రులు ఎలా పని చేశారో మీకు తెలుసు అన్నారు. ఇక్కడి నీళ్లు తీసుకుపోతుంటే, అప్పటి మంత్రులు మంగళహారతులు పట్టారు. వాల్మీకి బోయలు ఆంధ్రలో ఎస్టీలు.. తెలంగాణలో బీసీలు. దీనిని చెడగొట్టింది. ఆంధ్రలో ఎస్టీల కింద పెట్టి.. తెలంగాణలో బీసీల కింద పెట్టింది ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి అని తెలిపారు. గద్వాల్‌ను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి, వాల్మీకి బోయలను పట్టించుకోని బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు.
పచ్చబడ్డ తెలంగాణను మళ్ళీ దోచుకోవడానికే వారి ప్రయత్నం
తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కానీ, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీ ఎందుకు ఓటెయ్యాలన్నారు. రైతుబంధు, 24 గంటల కరెంటు అవసరం లేదని చెప్తున్న కాంగ్రెస్‌కు ఓటు వేస్తారో, మాకు ఓటు వేస్తారో తెలుసుకోవాలని సూచించారు. గద్వాల్‌కు మెడికల్ కాలేజీ, 300 పడకలు గల ఆసుపత్రిని కల్పించామని తెలిపారు. గద్వాల్‌లో కృష్ణమోహన్ రెడ్డి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు కూడా ‘జై తెలంగాణ’ అనే పదాన్ని పలకని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నేడు అధికారం కోసం వెంపర్లాడుతున్నాయని విమర్శించారు. పచ్చబడ్డ తెలంగాణను మళ్ళీ దోచుకోవడానికే ఆ పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. వారికి ఓటేస్తే మళ్ళీ కష్టాలు తప్పవని, మళ్ళీ పాత రోజులే వస్తాయన్నారు.