mt_logo

రైతు బంధు వేస్ట్ అంటున్నోళ్లకు ఓట్లు ఎందుకు?: సీఎం కేసీఆర్

ధరణి తీసేస్తామని, కరెంట్ 3 గంటలే ఇస్తమని, రైతు బంధు వేస్ట్ అంటున్నోళ్లకు ఓట్లు వేయొద్దని సీఎం కేసీఆర్ సూచించారు. డోర్నకల్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ..కురవి వీరభద్రస్వామి చాలా శక్తి ఉన్న దేవుడు. ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే స్వామికి బంగారు మీసాలు పెడుతానని మొక్కినా. వీరభద్రస్వామి దయవల్ల తెలంగాణ వచ్చింది.. బంగారు మీసాలు సమర్పించి నేను మొక్కు కూడా చెల్లించుకున్నానని గుర్తు చేసారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నాం అని తెలిపారు. లంబాడి, ఆదివాసీలు, కోయల గురించి దశాబ్దాలుగా ఉన్న కాంగ్రెస్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.  

పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు వేస్ట్ అంటుండు. ప్రజలేమో ఎక్కడికి పోయినా రైతు బంధు ఉండాలని జేజేలు పలుకుతున్నరు. ఎవరైతే యుద్ధం చేస్తడో వారి చేతిలోనే కత్తి పెట్టాలని సూచించారు. కర్ణాటకలో 20 గంటల కరెంటు ఇస్తమని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చాక 5 గంటలే ఇస్తున్నరని ఆరోపించారు. ధరణి తీసేసి కాంగ్రేసోల్లు భూమాత పెడుతరట.. అది భూమాత’ కాదు..భూ‘మేత’ అని పేర్కొన్నారు. ప్రజల భూ యాజమాన్యం మార్చే శక్తి ప్రజల బొటనవ్రేలుకే ఇచ్చినం. దాన్ని మార్చే శక్తి రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా లేదు. ‘ధరణి’ లేకుంటే.. రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోలు పైసలు ఎట్లా ఇయ్యాలె అని ధ్వజమెత్తారు. 

ఖమ్మంలో సీతారామ, పాలమూరు ప్రాజెక్టులు కూడా పూర్తయితే తెలంగాణలో 4 కోట్ల వరి ధాన్యం పండిస్తం అని తెలిపారు. ఇప్పుడు రికార్డు స్థాయిలో 3 కోట్ల టన్నులు పండిస్తున్నం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాండాలన్నింటినీ గ్రామ పంచాయతీలుగా చేసుకున్నం. డోర్నకల్ నియోజకవర్గంలో 82 తాండాలు గ్రామ పంచాయతీలుగా అయినయని వెల్లడించారు. ప్రతి తాండాకు బీటీ రోడ్లు, సీసీ రోడ్ల సౌకర్యం కల్పించినం. డోర్నకల్‌లో 100 పడకల హాస్పిటల్, డిగ్రీ కాలేజీ.. ఇంకా మిగిలిన పనులన్నీ చేయించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. సీనియర్ రాజకీయవేత్త అయిన రెడ్యానాయక్ ను గెలిపించాలని సీఎం కేసీఆర్ కొరారు.