బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. ఆర్మూర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జీవన్ రెడ్డి ఉద్యమంలో ఉండి ఎర్రజొన్న రైతుల కోసం ఆమరణ దీక్ష చేసారు. ఆనాడు ఆర్మూర్‌లో కాల్పులు జరిగితే వెంటనే నేను వచ్చి అండగా ఉన్నా అని తెలిపారు. కుటుంబసభ్యుడిలా ఉంటూ బీఆర్ ఎస్ పార్టీని బలంగా ముందుకు తీసుకుపోతున్న నాయకుడు జీవన్ రెడ్డి.
జీవన్ రెడ్డి నమ్ముకున్న ప్రజల కోసం పట్టుబట్టి ఆరూరు, డొంకేశ్వర్ మండలాలు కావాలని సాధించిండని వివరించారు. అంకాపూర్ అంటే నాకు ప్రాణం అని పేర్కొన్నారు. నేను ప్రచారం చేసినంత ప్రపంచంలో ఎవరూ చేయలేదు అని వెల్లడించారు. దేశంలో రావాల్సిన రాజకీయ పరిణతి ఇంకా రాలేదని అన్నారు. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల గుణగణాలతో పాటుగా పార్టీల వైఖరులను తెలుసుకొని మన ఓటును సరైన పద్ధతిలో వినియోగించుకోవాలని సూచించారు.
నీటితీరువా బకాయిలు రద్దు
బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం పదేండ్లలో ఎంతగానో కృషి చేసిందని అభివర్ణించారు. అన్ని రాష్ట్రాల్లో నీటి తీరువా పన్నులు వేస్తుంటే..మన రాష్ట్రంలో పాత నీటితీరువా బకాయిలను రద్దు చేసి వాటన్నింటినీ లేకుండా చేసాం అని వెల్లడించారు. మన రాష్ట్రంలో 24 గంటల కరెంటును ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో కరెంటు సక్కగ ఇయ్యలేదు. సగం సగం ఇచ్చిన మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలుడు, కొత్తది తేవాల్నెని డబ్బులు వసూలు చేసే పైరవీకారులు ఉండె. కరెంటు ఎప్పుడొస్తదోనని రైతులు బాయిలకాడనే నిద్రపోయేటోళ్లు. నేడు ట్రాన్స్ ఫార్మర్లు, మోటార్లు కాలవు. లో వోల్టేజ్ లేదు. ఇన్వర్టర్లు, స్టెబిలైజర్లు, కన్వర్టర్లూ, జనరేటర్లు లేవు. అన్నీ మాయమయ్యాయని పేర్కొన్నారు.
భారతదేశంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్తును రైతులకు ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ మాత్రమే అని తెలిపారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు. ప్రధానమంత్రి మోదీ తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేసినా నేను పెట్టలేదని తెలిపారు. 25 వేల కోట్ల రూపాయలను మనకు ఇవ్వకున్నా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలేదు అని తెలియజేసారు.
ఆదాయం పెరుగుతున్న కొద్దీ పేదలకు పంచుతున్నాం..
నాడు ప్రసూతి కోసం హాస్పటల్స్‌కి వెళితే అనేక సమస్యలుండేవని గుర్తు చేసారు. నేడు వైద్యాన్ని మెరుగుపరుచుకొని, కేసీఆర్ కిట్‌లను అందిస్తున్నాం. ఆర్మూర్ హాస్పిటల్‌కు అవార్డులు కూడా వచ్చినయ్ అని స్పష్టం చేసారు. ప్రసూతి తర్వాత 12 వేలు, 13 వేలు ఇస్తూ ‘అమ్మ ఒడి వాహనాల’ ద్వారా ఇంటి దగ్గరకి చేరుస్తున్నది మన ప్రభుత్వం అని చెప్పారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు కోరుకున్న విధంగా సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనమే కాకుండా ‘బ్రేక్ ఫాస్ట్’ను కూడా పెడుతున్నాం అని వివరించారు. దేశంలో ఎవరూ ఆలోచించని విధంగా దళితుల సంక్షేమం కోసం అద్భుతమైన ‘దళిత బంధు’ పథకాన్ని సృష్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. రాష్ట్ర ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఎవరూ అడగకున్నా పేదలకు పంచుతున్నాం అని అభివర్ణించారు.
ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమే..
కల్యాణలక్ష్మి పథకాన్ని మొదట యాభై వేలతో ప్రారంభించి, తర్వాత 75 వేలకు పెంచుకున్నాం. అనంతరం లక్ష నూట పదహారులకు పెంచి ఇస్తున్నాం అని తెలిపారు. ఆసరా పెన్షన్లకు మొదట వెయ్యి రూపాయలు ఇచ్చినం. తర్వాత రెండు వేలకు పెంచుకున్నం. ఎన్నికల తర్వాత మరింత పెంచుతామని మేనిఫెస్టోలో చెప్పాం. దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నది మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటే అని స్పష్టం చేసారు. ధరణి తీసేస్తే.. రైతుబంధు, రైతు బీమా, పంట కొనుగోళ్ల డబ్బులు రైతులకు ఎట్లా వస్తయి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ధరణిని తీసేస్తానంటోంది. ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తదని హెచ్చరించారు. నియోజకవర్గ ప్రజలు, వారి అభివృద్ధి కోసం ప్రజల మధ్య ఉండి పనిచేసే జీవన్ రెడ్డి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.