బుధవారం మెదక్‌లో నిర్వహించిన ప్రగతి శంఖారావ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సిఎస్ఐ (ది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా) చర్చ్ గ్రౌండ్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పాలించి, ఏం ఒరగబెట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, టీడీపీ అధికారంలో ఉన్నా ప్రజలకు ఒరిగింది శూన్యమని సీఎం అన్నారు. నేడు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పచ్చ బడి లక్ష్మి ఓలలాడుతున్నదని సీఎం తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని ఆయా రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారని సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో ఇలాగే సంక్షేమం వర్ధిల్లాలంటే ప్రజలు మరోమారు బీఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
నా బిడ్డ అడిగిందంటే నేను ఏది కూడా కాదనే పరిస్థితి లేదు
గత ఎలక్షన్లలో నేను మెదక్ కు వచ్చినప్పుడు నేను మీకో మాట మనవి చేశాను. (ప్రేక్షకుల నుంచి హర్షధ్వానాలు) పద్మ నా బిడ్డ. నా బిడ్డ అడిగిందంటే నేను ఏది కూడా కాదనే పరిస్థితి లేదు. నా మాటను గౌరవించి, మీరందరూ మంచి మెజారిటీతో పద్మను దీవించారు. దాని ఫలితమే ఇంద్రభవనం లాంటి కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులను నేడు మనం చూస్తున్నాం. మంచి నాయకురాలుంది కాబట్టీ ఇక్కడ మంచి పనులు జరుగుతున్నాయి.ఉద్యమ కార్యకర్త నుంచి జెడ్పీటీసీ గా, ఎమ్మెల్యేగా ఎదిగిన బిడ్డ పద్మ.
రామాయంపేట డిగ్రీ కాలేజీ మంజూరు
మెదక్ పట్టణంలో అండర్ గ్రౌండ్ పైపుల వల్ల రోడ్లన్నీ చిందరవందర అయినయని చెప్పింది. రోడ్లన్నీ బాగు కావాలని కోరింది. జిల్లా గ్రామ పంచాయతీలకు కూడా నిధులు కావాలని కోరింది. అవన్నీ ఇస్తాం. రామాయంపేట రెవెన్యూ డివిజన్ కావాలని పద్మ కోరింది. ఎల్లుండి సాయంత్రం లోపల అది మంజూరు చేసి జీవో కూడా ఇస్తాం. రామాయంపేట డిగ్రీ కాలేజీని కూడా మంజూరు చేస్తున్నా అని తెలిపారు.
టూరిజం ప్యాకేజీలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి
మెదక్ రింగ్ రోడ్డు కూడా మంజూరు చేస్తాం. గతంలో ప్రకటించిన టూరిజం ప్యాకేజీలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. మదన్ రెడ్డి గారి కోరిక మేరకు కౌడిపల్లిలో డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తాం. మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలకు, ప్రతి పంచాయతీకి రూ. 15 లక్షల రూపాయల చొప్పున ప్రత్యేకమైన నిధిని కూడా మంజూరు చేస్తున్నాం. అదే విధంగా మెదక్ లో నాలుగు మున్సిపాలిటీలున్నాయి. నర్సాపూర్, రామాయంపేట, తూఫ్రాన్ లకు తలా 25 కోట్ల రూపాయల చొప్పున, మెదక్ మున్సిపాలిటీలకు 50 కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నాం అని పేర్కొన్నారు.