mt_logo

గద్దర్ పేరు అజరామరం : సీఎం కేసీఆర్

తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన  ప్రజా వాగ్గేయ కారుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో తన పాట ద్వారా పల్లె పల్లెనా భావజాల వ్యాప్తి చేసిన గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) మరణం గురించి తెలిసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. వారి మృతి పట్ల తీవ్ర  సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ కోసం తన ఆట పాటలతో ప్రజల్లో స్వరాష్ట్ర చైతన్యాన్ని రగిలించిన గద్దర్ ప్రజాయుద్దనౌకగా ప్రజల హృదయాల్లో నిలిచారని సీఎం తెలిపారు. ప్రజలకోసం తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసి ప్రజల కోసమే బతికాడని, గద్దర్ మరణంతో  యావత్ తెలంగాణ  గొప్ప ప్రజా కవిని కోల్పోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలంగాణ కోసం గద్దర్ చేసిన సాంస్కృతిక పోరాటాన్ని, గద్దర్ తో తనకున్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సాధారణ బుర్రకథ కళాకారుడుగా ప్రారంభమైన గద్దర్ కళా జీవితం, విప్లవ రాజకీయాలతో మమేకమై, అనంతర కాలంలో  తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో  సాంస్కృతిక పోరాటంలో ఉన్నత స్థాయికి చేరిందన్నారు. కవిగా గద్దర్  ప్రజా కళలకు, ఉద్యమాలకు చేసిన సేవలు మరుపురానివని, వారు లేని లోటు పూడ్చలేనిదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజా కళాకారులకు కవులకు మరణం వుండదని,  ప్రజాకళలు వర్ధిల్లినంతకాలం ఆయన పేరు అజరామరంగా నిలిచి ఉంటుందని సీఎం తెలిపారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ  సానుభూతిని తెలియజేశారు.