mt_logo

క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకే సీ.ఎం కప్-2023 క్రీడా పోటీలు

  • క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకే సీ.ఎం కప్-2023 క్రీడా పోటీలు 
  •  జిల్లా స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 
  •  జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపు 

నిజామాబాద్, మే 22 : గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చీఫ్ మినిస్టర్ కప్ -2023 క్రీడా పోటీలను నిర్వహిస్తోందని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం రాష్ట్ర ఆర్టీసీ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఎమ్మెల్సీ రాజేశ్వర్, మేయర్ నీతూ కిరణ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులతో కలిసి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి సీ.ఎం కప్ – 2023 జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. జాతీయ స్థాయిలో ప్రతిభను చాటిన క్రీడాకారుల చేతుల మీదుగా క్రీడా జ్యోతిని అందుకుని జిల్లా స్థాయి పోటీలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. క్రీడా స్ఫూర్తిని చాటుతూ, సహృద్భావ వాతావరణంలో పోటీలను విజయవంతం చేస్తామని క్రీడాకారులచే ప్రతిజ్ఞ చేయించారు. వాలీబాల్, ఖో-ఖో కబడ్డీ, ఆర్చరీ క్రీడాకారులను పరిచయం చేసుకుని లాంఛనంగా పోటీలకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, వారు ప్రతిభను చాటుకునేందుకు వీలుగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో చీఫ్ మినిస్టర్ కప్-2023 క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చూపు ఎల్లప్పుడూ గ్రామీణ ప్రాంత ప్రజల అభ్యున్నతి పైనే కేంద్రీకృతమై ఉంటుందన్నారు. ఈ దిశగానే గ్రామీణ ప్రాంత క్రీడాకారుల కోసం ప్రతి గ్రామ పంచాయతీలో, పట్టణ ప్రాంతాల్లోని అన్ని వార్డులలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారని అన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుని గ్రామీణ ప్రాంత విద్యార్థులు, యువత క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. జిల్లా నుండి మలావత్ పూర్ణతో పాటు నిఖత్ జరీన్, యెండల సౌందర్య, గుగులోత్ సౌమ్య, హుసాముద్దీన్, ఇషాసింగ్ వంటి అనేక మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి వేముల పిలుపునిచ్చారు. క్రీడల నిర్వహణకు సహకరిస్తున్న పీ.డీలు, పీ.ఈ.టీలను మంత్రి అభినందించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్రావులు మాట్లాడుతూ, ఆరోగ్య పరిరక్షణకు, మానసికోల్లాసానికి ఎంతగానో దోహదపడే క్రీడలను ప్రతి ఒక్కరు అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరాశ చెందకుండా గెలుపొందిన వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని హితవు పలికారు. 

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, చీఫ్ మినిస్టర్ కప్ -2023 క్రీడా పోటీల్లో క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని, ఈ నెల 15 , 16 , 17 వ తేదీలలో మండల స్థాయిలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు ప్రస్తుతం జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ నెల 28 నుండి 31 వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో జరుగనున్న పోటీల్లోనూ జిల్లాకు చెందిన క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేయాలని పిలుపునిచ్చారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునేందుకు సీ.ఎం కప్ క్రీడా పోటీలు చక్కటి అవకాశం అని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.