mt_logo

రాణి రుద్రమపై పోస్టల్ స్టాంపును ముద్రింపజేసిన దాస్యం వినయ్ భాస్కర్

కాకతీయ ఉత్సవాల సందర్భంగా వారి విశిష్టతను తెలియజేసే విధంగా పోస్టల్ స్టాంపులు విడుదల చేయాలని గత సంవత్సరం ప్రారంభంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ పనికి తానే పూనుకున్నాడు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్.

పోస్టల్ శాఖ వారి “My Stamp” పథకం కింద రాణి రుద్రమ స్టాంపును ముద్రింపజేసి దాన్ని వరంగల్ పోచమ్మ మైదానం లోని రాణిరుద్రమ దేవి విగ్రహంవద్ద తెలంగాణ మేధావులచే ఆవిష్కరింపజేశారు వినయ్ భాస్కర్.

ఆ అవిష్కరణ సభలో వక్తల ప్రసంగ పాఠం కింద చదవచ్చు:

దెందుకూరు సోమేశ్వర్ రావు:

ఉత్తర భారతదేశ చరిత్రయే మన దేశ చరిత్రగా చదువుతున్నాము. భారత దేశాన్ని పరిపాలించిన సామ్రాజ్యాలన్నింటిలో ఆగ్రభాగాన ఉండే అర్హత గలది కేవలం కాకతీయ సామ్రాజ్యమే.ఈ సామ్రాజ్యపు చక్రవర్తులందరిలో ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకత ఉన్నది. కాకతీయ సామ్రాజ్యంలో పాలకులు, పాలితులనే విభజన లేదు. ఒకే కుటుంబం వలే కలసి ఉండేవారు. రాజు ఆ కుటుంబ పెద్దగా వారందరి బాగోగులు చూసేవాడు. ఆ భావనే వారి బలం, అదే వారి బలహీనత, ఆ బలం వల్లనే సామ్రాజ్యం సుభిక్షంగా సిరి సంపదలతో రెండున్నర శతాబ్దాలు కొనసాగింది. ఆ బలహీనత వల్లనే తన పౌరులను తుగ్లక్ సైన్యం హింశిస్తున్న తీరును తట్టుకోలేక లొంగిపోతాడు. కాకతీయ ఉత్సవాలను పురస్కరించుకొని తపాళా బిళ్ళలను విడుదల చేయడం ప్రభుత్వ విధి. కానీ ఆ ప్రభుత్వం తన విధి నిర్వహణలో విఫలమైనా ప్రజా ప్రతినిధిగా వినయ భాస్కర్ ప్రజల కోర్కెను గౌరవించాడు. తెలంగాణాలోని అన్నీ విశ్వవిద్యాలయాలలో కాకతీయుల అధ్యయన పీఠాన్ని నెలకొల్పాలి.

నాగిళ్ళ రామ శాస్త్రి: (సభాధ్యక్షుడు)

ప్రజల కోరికను మన్నించినదే ప్రజా ప్రభుత్వం. కానీ వినయ భాస్కర్ ప్రజల అభీష్టం మేరకు తపాళా బిళ్ళను విడుదల చేయడం ముదావహం. ప్రభుత్వం ఇకనైనా సిగ్గు తెచ్చుకొని కాకతీయుల పట్ల తన బాధ్యతను గుర్తించడం మంచిది. ఈ కార్యక్రమంతో వినయ భాస్కర్ ప్రజల పట్ల తన వినయాన్ని, ప్రభుత్వం పట్ల ధిక్కరాన్ని ప్రదర్శించాడు.

ప్రొఫెసర్ హైమావతి:

కాకతీయ చక్రవర్తులలో తపాళా బిళ్ళలలో మొదటిగా రుద్రమ దేవిని తీసుకోవడం మన ప్రాంతావాసులకు, ముఖ్యంగా వినయ భాస్కర్ గారికి స్త్రీలపట్ల గల గౌరవాన్ని చూపుతున్నది. నస్త్రీ స్వతంత్ర్య మర్హతి అన్న మను ధర్మాని ధిక్కరించిన గడ్డ మన వరంగల్. ఆడ బిడ్డకు అక్షరం నేర్పించి సాధికారత నేర్పితే జనరంజకంగా రాజ్యాన్ని చేయగలదనేది నిరూపించిన నేల. ఈ మట్టిలో వినయం, వీరావేశం, ధిక్కారం కలగలసి ఉన్నాయి. రుద్రమదేవిలో ఈ మూడు లక్షణాలు సమ పాళ్ళలో ఉండటంవల్లనే ఆమె 3౦ సం|| ల సుధీర్ఘ పాలన చేయగలిగింది. పురుష స్వామ్య, ప్రభు స్వామ్య వ్యవస్థలో సామ్యవాద భావనలను ప్రదర్శించింది. స్త్రీ రాజ్యాధికారాన్ని ధిక్కరించి యుద్ధం చేసిన యాదవరాజులను దేవగిరిదాకా తరిమికొట్టి వారినుండి వసూలు చేసిన ఒక కోటి బంగారు నాణాల నష్టపరిహారాన్ని అక్కడికక్కడే యుధ్ధంలో పాల్గొన్న సైనికులకు పంచిపెట్టిన ఉదారశీలి, సామ్య వాడి రుద్రమ దేవి. ౮౩ ఏళ్ళ వయసులో మనుమడైన ప్రతాపరుద్రుడికి తోడుగా యుద్ధంలో పాల్గొని మరణించిందంటే విధి నిర్వహణ పట్ల ఆమెకు గల నిబద్ధత ఎటువంటిదో అర్ధం చేసుకోవచ్చు.

సుప్రసన్నచార్య:

కాకతీయుల గొప్పదనాన్ని కీర్తించడంతో పాటు వారి విధానాలను అవగతం చేసుకున్నప్పుడే, ఆచరించినప్పుడే ప్రగతి ఉంటుంది. కాకతీయులది “సుజలామ్, సుఫలామ్” యజ్ఞమౌతే నేటి నాయకులది జలయజ్ఞం పేరిట చేస్తున్న ధన యజ్ఞం. పువ్వునుండి తేనెటీగ మకరందాన్ని తీసుకున్న విధంగా కాకతీయుల పన్నుల విధానం ఉండేది. ప్రస్తుత మన పాలకులు జలగలు రక్తం పీల్చినట్టుగా పన్నులు వసూలు చేస్తున్నారు. ఇది గర్హనీయం. కాకతీయులు కప్పుల్లాంటి చెరువులను మనకిచ్చిపోతే సీమాంధ్ర పాలకులు వాటిని సాసర్లుగా మార్చి తెలంగాణా ప్రజలను దారిద్ర్యంలోకి తోసివేశారు. కాకతీయుల కేంద్రస్థానం వరంగల్లులో ఉండటంవల్లనే సీమాంధ్ర ప్రభుత్వం ఇంతటి నిర్లక్ష్య ధోరణీని ప్రదర్శిస్తున్నది. ఇది ఆక్షేపణీయం. ప్రత్యక్షంగా వినయ భాస్కర్ పరోక్షంగా టీ ఆర్ యస్ పార్టీ తెలంగాణా చరిత్రపట్ల, కాకతీయుల పట్ల తమ బాధ్యతను నిరూపించుకున్నారు. ఇది అభినందనీయం.

కృష్ణ దేవరాయలకు తెలంగాణాకు పెద్దగా సంబంధం లేదు. అయినప్పటికీ కృష్ణదేవరాయలు తెలుగు భాషకు చేసిన సేవను గుర్తించి మనం కూడా ఆ ఉత్సవాలను జరుపుకున్నాం. కాకతీయుల విధానాలనే కృష్ణ దేవరాయలు కొనసాగించాడు. ఆ సామ్రాజ్యానికి పునాదులు కాకతీయులనుండే ఉన్నాయి. తెలంగాణా చరిత్రను కాకతీయుల చరిత్రను మరింతగా వెలికి తీసుకురావాల్సిన బాధ్యత వినయ భాస్కర్ పైన, టీ ఆర్ యస్ పార్టీ పైన ఉన్నది.

ప్రాణ్ రావు (రుద్రమదేవి నవలా రచయిత):

పరిమిత చారిత్రకాధారాలతో ఇంత పరిణితి గల రాణి చరిత్ర రాయడమంటే కత్తిమీద సాము వంటిదే. శాతవాహనులకు కృష్ణదేవ రాయలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని, చూపించిన ఆసక్తిని సీమాంధ్రులు కాకతీయులపట్ల చూపించడంలేదు. రాణి రుద్రమ చరిత్ర రాయడం ఒక ఎత్తైతే ఆమె నడయాడిన నేలమీద, ఆమే విగ్రహం నీడలో మీ అందరి అభినందనలు అందుకోవడం నా జన్మ ధన్యమని భావిస్తున్నాను. కాకతీయుల చరిత్రకు అక్షరరూపం తీసుకురావడంలో నా బాధ్యత మరింతగా పెరిగిందని భావిస్తున్నాను. కాకతీయులు ప్రజాస్వామ్య ప్రభువులు. ప్రజలను సంప్రదించిన తర్వాతనే వారు రాజకీయ నిర్ణయాలు తీసుకొనేవారు. దేశంలోని మహిళా పాలకురాళ్ళలో రుద్రందేవి అగ్రగణ్యురాలు. ఆమె తపాళా బిళ్ళ విడుదల చేయడంతో వినయ భాస్కర్ స్త్రీలపట్ల, కాకతీయుల పట్ల, జనరంజక రాజ్యాలపట్ల తన వినయ విధేయతలను చాటుకున్నాడు.

వినయ భాస్కర్:

కాకతీయ ఉత్సవాలను ఒక సం|| పాటు నాటి సామ్రాజ్య పరిధిళోని 4 రాష్ట్రాలలో జరిపించాలని, ఇక్కడి గన్నమ నాయుడే తుగ్లక్ ఢిల్లీ సామ్రాజ్యంలో మాలిక్ మఖ్బూల్ గా కొలువు చేసినందున ఉత్సవాలను ప్రారంభ లేదా ముగింపు ఉత్సవాలను ఢిల్లీలో నిర్వహించాలని, నాలుగు పోస్టల్ స్టాంపులను విడుదల చేయాలని, దేశానికే తలమానికంగా నిలిచిన సాగు నీటి గొలుసుకట్టు చెరువుల వ్యవస్తాను పూటికలు తీయడం ద్వారా పునరుధ్ధరించాలని, ఈ ఉత్సవాలలలో స్టానిక కళాకారులకే అవకాశం ఇవ్వాలని, ఈ ఉత్సవాల నిర్వహణకు 500 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరినాము. ముష్టిగా మూడు కోట్లు కాదు కదా, ఒక కోటి రూపాయలు కూడా ఇవ్వలేదు. కేంద్ర మంత్రి చిరంజీవి కేవలం పాతిక లక్షలిచ్చి చేతులు దులుపుకున్నాడు. ఈ నిర్లక్ష్య వైఖరికి నిరసనగానూ, ప్రజల అభీష్టానుసారం నేనే ఈ స్టాంపుల విడుదలకు పూనుకున్నాను. నేను ఈ సీమాంధ్ర ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నాను. మీ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ ప్రాంత ప్రజలం చందాలు వేసుకొని, భిక్షాటన చేసి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటామ్. తదుపరి రాబోతున్న మన తెలంగాణాలో మరింత ఘనంగా నిర్వహించుకుంటామ్. రాణి రుద్రమా దేవి 714వ వర్ధంతి సందర్భంగా కాకతీయులు చూపిన బాటలోనే తెలంగాణ పునర్నిర్మాణానికి పునరంకితమౌతానని రుద్రమాంబ విగ్రహం సాక్షిగా మీ అందరిముందు ప్రమాణం చేస్తున్నాను.

వి ప్రకాష్:

కాకతీయుల గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ దేశానికే తలమానికం. తొలి కాకతీయులనుండి రాజులందరూ దార్శనికతతో పరిపాలించారు. ఈ చెరువులు పూడుకుపోయి నీళ్ళన్నీ నదుల్లోకి రావాలనే వారు తెలంగాణా లోని చెరువులని పూటిక తీయించడం లేదు. ఎండిపోయిన చెరువులను రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్ముకోవాలి. ఇదే వారి పధకం. సి యామ్ కుర్చీలో బ్రహ్మానంద రెడ్డి నుండి చంద్రబాబు, వై ఎస్ ఆర్, రోశయ్య, కిరణ్ ఎవరున్న వారి కార్యాచరణ ఇదే.

కాకతీయుల సాంకేతిక, సామాజిక విజ్ఞానాలను విజ్ఞతను ప్రస్తుత కాలానికి అన్వయించుకోవడమే తెలంగాణా పునర్నిర్మాణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *