
ఓ పెద్ద మనిషి ఒకాయన హైదరాబాద్ నేనే గట్టినా అని చెప్పుక తిరుగుతుండే. ఆయన ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి ఓ అభివృద్ధి పని ప్రారంభానికి పోయిండు. పని అయిపోయినంక ఓ వార్డులకు పోయిండు.. ఎదురుంగ ఒకాయన ఎదురొస్తే నన్ను గుర్తుపట్టినవా అని అడిగిండు. లేదుసార్ అని అయన అనంగనే.. అరే హైదరాబాద్‌ను నేనే కట్టినవయ్యా.. నన్ను గుర్తుపట్టకపోవుడు ఏంది అన్నడట.. దీనికి అవతలాయన సార్ నేనుగూడ నిన్న మొన్నటిదాకా వైజాగ్‌కు సముద్రం నేనే తెచ్చిన అని చెప్పుక తిరిగేటోన్ని.. మీరుగూడ మందులేసుకోండి తగ్గిపోతది అన్నడట.. ఇదీ అసెంబ్లీలో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి మంత్రి కేటీఆర్ పరోక్షంగా చేసిన విమర్శ. ఈ విమర్శను నిజం చేస్తూ చంద్రబాబు మరోసారి పిచ్చి ప్రేలాపనలు పేలారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో తెలంగాణ సర్కారు నిర్వహించిన వేలంలో ఎకరా భూమి ధర వందకోట్లు పలికిందంటే అది తన గొప్పతనమేనని, కోకాపేటకు ఆ భూమ్ తనవల్లే వచ్చిందని డబ్బాకొట్టారు. హైదరాబాద్ సృష్టికర్తను తానేనంటూ మళ్లీ అదే పాట మొదలు పెట్టారు. కాగా, హైదరాబాద్ డెవలప్‌మెంట్‌కు తన విజనే కారణమని చెప్పుకొంటున్న చంద్రబాబుకు నెటిజన్లు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబు చిలుక పలుకులివే!
ఎన్నికలు సమీపిస్తుండడంతో టీడీపీ అధినేత చంద్రబాబు స్పీడ్ పెంచారు. తెలంగాణ అభివృద్ధిని ప్రస్తావిస్తూ.. దానికి తానే కారణమని.. ఆంధ్రప్రదేశ్‌లోనూ అలాంటి అభివృద్ధి చేసి చూపిస్తానని అక్కడి ప్రజలను నమ్మించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో జరిగిన ఆ పార్టీ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారుకు సంపద సృష్టించడం నేర్పింది తానేననంటూ ప్రగల్భాలు పలికారు. తన చర్యలవల్లే హైదరాబాద్ ఇప్పుడు విశ్వనగరమైందంటూ ఊదరగొట్టారు. తనవల్లే ఒకప్పుడు కేవలం రూ. 20వేలు- రూ.30వేలు ఉన్న ఎకరం భూమి ధర ఇప్పడు వంద కోట్లకు చేరిందని డబ్బాకొట్టారు. తాను సృష్టించిన నాలెడ్జ్ ఎకానమీ వల్లే హైదరాబాద్ ప్రగతి పరుగులు పెడుతున్నదని బొంకారు. దీనిపై నెటిజన్లు ఆయనకు గట్టి చురకలు అంటించారు. సైబర్ టవర్‌కు కోకాపేటకు 7 కిలోమీటర్ల దూరం మాత్రమేనని.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అక్కడి నుంచి కోకాపేటకు కనీసం డాంబర్ రోడ్డు కూడా లేదని, అలాంటి ప్రాంతం అభివృద్ధికి చంద్రబాబు ఎలా కారణమవుతాడని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని చెప్పుకొంటున్న బాబు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఐదేండ్లు సీఎంగా ఉన్నా కూడా రాజధాని అమరావతికి కనీసం పునాది కూడా ఎందుకు తీయలేకపోయారని ప్రశ్నించారు. కనీసం అసెంబ్లీ, సెక్రటేరియట్, ఓ శాశ్వత భవనం కూడా నిర్మించలేని దద్దమ్మ చంద్రబాబు అంటూ ఓ నెటిజన్ విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ విజన్‌వల్లే కోకాపేటలో భూములకు అంత డిమాండ్ వచ్చిందని, హైదరబాద్ విశ్వనగరమవుతున్నదని ట్వీట్లు చేశారు.