mt_logo

ఇక్కడ బాబు మాట చెల్లదు

By: కె.ఎ. మునిసురేష్ పిళ్లె

ఆంధ్రోళ్లకు తెలంగాణలో బాధలుంటే.. వారి బాధను తన బాధగా ఎంచి, వాటిని బాపడానికి సిద్ధపడగలిగితే బాబులోని నాయకత్వం బయల్పడుతుంది. చంద్రబాబు చేతల పట్ల విమర్శలు ఎదురవుతున్న సమయంలో తన బాధ, వారందరికీ కూడా బాధ కావాలని కోరుకుంటే ఆయనలోని బేలతనం వెల్లడవుతుంది. నలభయ్యేళ్ల సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న నాయకుడికి ఇంత ప్రాథమికమైన తర్కం బోధపడకపోతే ఎలా?

రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న వేళ ఆంధ్రా తెలుగుదేశం పార్టీ విచ్ఛిన్న రాజకీయాలకు తెరదీస్తున్నది. హైదరాబాద్ నగరంలో ప్రబలంగానూ, తతిమ్మా తెలంగాణ రాష్ట్రంలో పలుచగానూ విస్తరించి, స్థిరపడి ఉన్న ఆంధ్రా మూలాలు కలిగిన వారిని ఇక్కడి జన జీవనం నుంచి, తెలంగాణ సమాజం నుంచి వేరు చేయాలనే విచ్ఛిన్నకర వ్యూహాలకు టీడీపీ పాల్పడుతున్నది. రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు ప్రత్యర్థిని ఓడించడం మీద దృష్టి పెడుతాయి, పెట్టాలి. అయితే, తమకు చేతనైతే ప్రత్యర్థి బలహీనతలను ఎండగట్టాలి, లోపాలను ఎత్తిచూపాలి, వైఫల్యాలను నిలదీయాలి. తద్వారా తాము ప్రజల మన్నన చూరగొనాలి. అంతేతప్పా సమాజంలో, ప్రజల్లో చీలికలు తెచ్చి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే వక్ర బుద్ధులు టీడీపీలో పొడసూపుతున్నాయి. కేసీఆర్‌ను ఓడించడం అనే ఏకైక లక్ష్యంతో, ఎలాంటి సిద్ధాంత సారూప్యత లేని నాలుగు పార్టీలు ఒక జట్టుగా ఏర్పడటం ప్రాథమికంగా చీదర పుట్టించే సంగతి. చంద్రబాబు టీటీడీపీని కాంగ్రెస్ పార్టీ వారి దయాదాక్షిణ్యాల కోసం భిక్ష ఎత్తుకునే దుస్థితిలో అనాథగా విడిచిపెట్టారు.

ఆ పొత్తులను అనుసంధానించిన సూత్రమేమిటీ? కేసీఆర్ వ్యతిరేకత అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ వాస్తవంలో అది వారి గతిలేనితనం మాత్రమే. ఆ పార్టీల్లో ఏ ఒక్కరికీ స్వతంత్రంగా పోటీచేయగల తెగువ లేదు. కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కోగల ధైర్యం లేదు. అందుకే వారిలో వారికి ఉన్న భావ వైరుధ్యాలను తొక్కిపట్టి, నిస్సిగ్గుగా జట్టుకట్టారు. నాలుగు పార్టీలు ముడి పెట్టుకోగానే.. ప్రతిదీ మహా అయిపోతుందా? నిజానికి ఇది అవకాశవాద కూటమి లేదా అవసరార్థ కూటమి! ఈ కూటమి హేతుబద్ధతను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో ఘాటుగానే ప్రశ్నించారు. ఆ క్రమంలోనే తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు.. పిటిషన్లు కేసుల ద్వారా, తన లాబీయింగ్ ద్వారా అడ్డుపడుతున్న చంద్రబాబును దుర్భాషలాడారు. రాక్షసిగా పేర్కొన్నారు. ద్రోహి అన్నారు. అలాంటి చంద్రబాబుతో పొత్తు ముడిపడి, ఏ మొహం పెట్టుకొని తెలంగాణ ప్రజల ఎదుటకు ఓట్లు అభ్యర్థిస్తూ ఈ కూటమి వెళ్లగలదని ఆయన ప్రశ్నించారు. ఆయన దూషణలో తీవ్రత ఉండవచ్చు. అంతే తప్పా ఆయన తన భావసంచలనాన్ని దాచుకోలేదు. ఉన్నదున్నట్టుగా బయటపెట్టారు. ఇది రాజకీయ విమర్శ. దీనికి రాజకీయ సమాధానం ఉండాలి. చేతనైతే కేసీఆర్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టాలి. ఇప్పుడు చేసిన ఆరోపణలు, అభివృద్ధికి అడ్డుపడుతున్నారనే అభియోగాలు అవాస్తవ మని చెప్పగలుగాలి. నిరూపణ చూపగలుగాలి.

కానీ జరుగుతున్నదేమిటి? చంద్రబాబును ఉద్దేశించి చేసిన విమర్శకు తెలుగుజాతికి చేసిన అవమానంగా రంగు పులమడానికి ప్రయత్నం జరుగుతున్నది. చంద్రబాబును అవమానకరంగా మాట్లాడిన మాటల గురించి తెలంగాణలోని ప్రతి ఆంధ్రుడు ఆలోచించాలట! ఓటు అనే ఆయుధంతో ఆంధ్రుల పవర్ చూపించాలట ఇలా అని సోషల్ మీడియా ద్వారా తెలంగాణ సమాజంలోని ఆంధ్రోళ్లను వేరుచేయడానికి, సమాజా న్ని చీల్చడానికి వ్యూహాత్మక కుట్ర జరుగుతున్నది. చంద్రబాబు తైనాతీలు ఇవాళ ఇలా ప్రత్యేకంగా పిలుపు ఇవ్వవలసిన అగత్యమేమిటి? కేసీఆర్ తను తిట్టేదేదో బహిరంగంగానే తిట్టారు. ఆంధ్రోళ్లు-తెలంగాణోళ్లు అనే విభజనను పక్కనపెట్టండి. ప్రతి ఒక్కరూ ఆయన ప్రసంగాన్ని, దూషణలను స్పష్టంగా చూశారు. తాను చెప్పిన మాటల గురించి.. తెలంగాణలోని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అందులో ఆంధ్రోళ్లు కూడా ఉంటారు. వారు ఆలోచించుకోగలరు. ఆంధ్రా మూలాలు కలిగి ఉండి, తెలంగాణ సమాజంలో స్థిరపడిన వారు అంతటి ఆలోచనా శూన్యులు, తాము లీడ్ ఇస్తే తప్పా ఏం ఆలోచించాలో, ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియని మూర్ఖులు అని చంద్రబాబు తరఫున వకాలతు పుచ్చుకున్న సోషల్ ప్రచారకర్తలు భావిస్తుంటే నిజానికి తెలంగాణ ఆంధ్రోళ్ల జాతికి అది అవమానకరం. ఇలాంటి ప్రచార పోకడ జుగుప్సాకరం.

బాబును అంటే, జాతి విలపించాలా? కేసీఆర్ విమర్శలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడూ ఖండించాలట. ఎందుకని? ఆ ప్రతి తెలుగువాడిలో సగం తెలంగాణ వాళ్లు కూడా ఉంటారు కదా! ప్రతి ఆంధ్రోళ్లు మాత్రం ఎందుకు ఖండించాలి? చంద్రబాబు తెలుగు (ఆంధ్ర) జాతిరత్నమా? బాబుకు తెలియకుండా ఇలాంటివి జరుగుతాయనుకోలేం. ఎందుకంటే.. బీజేపీతో బంధాన్ని తెంచుకున్న తర్వాత మోదీ నన్నేదో చేసేయబోతున్నాడు, తెలుగుజాతి మొత్తం నాకు అండగా నిలువాలి, నన్ను కాపాడుకోవాలి అని దేబిరించిన వైఖరి ఆయన సొంతం. ఇవాళ కేసీఆర్ నుంచి రాజకీయ విమర్శ వస్తుండగా, దానికి జవాబివ్వలేక ఆయన పనుపున పలువురు ఇలాంటి వక్రమార్గాలను ఆశ్రయిస్తున్నారు. బాబును తిట్టారు గనుక కేసీఆర్‌ను ఓడించాలి అనడం చూస్తే.. ఈ తిట్లను ఆసరాగా చేసుకొని తెలంగాణలోని ఆంధ్ర మూలాలు గల తెలుగు ప్రజల (వారి విచ్ఛిన్నకర బుద్ధుల దృష్టిలో ఆంధ్రోళ్ల) దయను, జాలిని, సానుభూతిని బిచ్చమెత్తడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్నది.

కేసీఆర్ సాగిస్తున్న పాలన లోపభూయిష్టంగా ఉంటే వాటిని తెలియజెప్పి ఓడించాలని పిలుపు ఇవ్వవచ్చు. ఆంధ్రమూలాలున్నా.. ఇక్కడ స్థిరపడినందుకు తమ జీవితాలు అభద్రతలో కొట్టుమిట్టాడుతుంటే గనుక.. ఇక్కడి ఆంధ్రోళ్లే ఖచ్ఛితంగా ఆయనను వ్యతిరేకిస్తారు. కేసీఆర్ కంటే మెరుగైన పాలన ఇవ్వగలరని నమ్మకం కలిగించగలిగితే.. చంద్రబాబు పార్టీకి కూడా తమ ఓట్లు వేస్తారు. అంతే తప్ప, తిట్టించుకున్నాడు గనుక చంద్రబాబుకు ఓటు వేయమని అడుగడం ఏ రకమైన రాజనీతి. అంతెందుకు, ఆంధ్ర మూలాలు గల తెలుగువారు ప్రబలంగా ఉండే హైదరాబాద్ నగర పాలిక ఎన్నికల్లో ఎలాంటి తీర్పు వచ్చిందో చంద్రబాబుకు తెలియదా? ఈ నగరంలో ఉన్న ఆంధ్రో ళ్లు ఎవ్వరూ ఓట్లు వేయకుండానే కేసీఆర్ సారథ్యంలోని టీఆర్‌ఎస్ అంతటి ఘనవిజయాన్ని పొందినదా? ఏపీలోనే 50 శాతం ఓట్లు దక్కించుకున్న చరిత్ర చంద్రబాబుకు లేదు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో ఉండవచ్చు గాక. అంతమాత్రాన, ఆంధ్ర జాతి ఉద్ధారకుడని అనుకుంటే ఎలా? సొంత రాష్ట్రంలోనే సగం మంది ప్రేమను పొందలేని నాయకుడు, పొరుగు రాష్ట్రంలో ఉన్న తమ ప్రాంతం వారందరినీ వేరుచేసి, నూరు శాతం తనకు దన్నుగా నిలువాలని కోరుకోవడంలో ఏమైనా ఔచిత్యం, తర్కం ఉన్నదా?

ఆంధ్రోళ్లకు తెలంగాణలో బాధలుంటే.. వారి బాధను తన బాధగా ఎంచి, వాటిని బాపడానికి సిద్ధపడగలిగితే బాబులోని నాయకత్వం బయల్పడుతుంది. చంద్రబాబు చేతల పట్ల విమర్శలు ఎదురవుతున్న సమయంలో తన బాధ, వారందరికీ కూడా బాధ కావాలని కోరుకుంటే ఆయనలోని బేలతనం వెల్లడవుతుంది. నలభయ్యేళ్ల సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న నాయకుడికి ఇంత ప్రాథమికమైన తర్కం బోధపడకపోతే ఎలా? ఇప్పటికైనా చంద్రబాబు, ఆయన వకాలతువాదులు తాము చెబితే తప్ప పరిణామాలను ఆకళింపు చేసుకొని, నిర్ణయం తీసుకోలేని దుస్థితిలో తెలంగాణలోని ఆంధ్రమూలాలు గల తెలుగువారు లేరని తెలుసుకుంటే బాగుంటుంది.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *