మొన్నటివరకూ తెలంగాణలో తమదే హవా అంటూ బీజేపీ రెచ్చిపోయింది. రాబోయే ఎన్నికల్లో అధికారం తమదేనంటూ ఊదరగొట్టింది. బీఆర్ఎస్ సర్కారును గద్దె దించుతామని బీరాలు పలికింది. టీబీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌కి ఉద్వాసన పలికి కిషన్‌రెడ్డికి పగ్గాలు అప్పజెప్పగానే కాషాయం పార్టీ చల్లబడిపోయింది. బండి ఒంటెత్తుపోకడలతో పార్టీకి నష్టం వాటిల్లుతున్నదని భావించి కిషన్‌రెడ్డికి అధ్యక్షత బాధ్యతలు అప్పగించిన అధిష్ఠానానికి ఇప్పుడే అసలు తలనొప్పి ప్రారంభమైంది. కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకముందే టీబీజేపీ మూడు వర్గాలుగా విడిపోయింది. బండి ఓవైపు, ఈటల మరోవైపు, కిషన్‌రెడ్డి ఓ వైపు ఎవరికి వారే యమునాతీరేలా కూటమి రాజకీయాలకు తెరలేపారు. దీంతో తెలంగాణలో బీజేపీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైపోయింది. ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు అభ్యర్థులే కరువయ్యారు. 119 నియోజకవర్గాలకుగానూ దాదాపు 100కుపైగా నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు అర్హత ఉన్న ఒక్క నాయకుడు కనిపించకపోవడంతో ఆ పార్టీ అంతర్మథనం చెందుతున్నది.
సీనియర్ల అలక.. పార్టీకి బై బై
కొత్త అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరించే సభలో ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కనిపించడంతో పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి అక్కడినుంచి వెళ్లిపోయారు. పార్టీలో మొదటినుంచి ఉన్నవారికే ప్రాధాన్యమని, ఉద్యమకారులకు విలువలేదన్నట్టు కిషన్‌రెడ్డి అదే సభలో ప్రసంగించడంతో అక్కడే ఉన్న రఘునందన్‌రావు నొచ్చుకొన్నారు. కిషన్‌రెడ్డి చెప్పినట్టుగానే తమకు పార్టీలో గుర్తింపు లేదని రఘునందన్ ఢిల్లీ వేదికగా అసంతృప్తి వెళ్లగక్కారు. మరోవైపు చేరికల కమిటీ చైర్మన్, ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కూడా బీజేపీలో తనకు దక్కిన ప్రాధాన్యంపై అసంతృప్తిగానే ఉన్నారు. ఇక బీజేపీకి ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తారనుకున్న వివేక్‌వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎప్పుడు తమ దారి తాము చూసుకుందామా? అని ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తున్నదని పార్టీ నాయకులే అంటున్నారు. తాజాగా, మాజీ మంత్రి, వికారాబాద్ నుంచి ఐదుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన చంద్రశేఖర్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఇలా.. పార్టీ నుంచి వెళ్లేవారికానీ బీజేపీలో చేరేవారు కనిపించకపోవడంతో ఆ పార్టీ ఆందోళన చెందుతున్నది. కిషన్‌రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక.. ఒక్కరంటే ఒక్కరూకూడా చేరకపోవడంతో టీబీజేపీ నాయకులు తలలుపట్టుకొంటున్నారు.
ఇక ఎన్నికల నాటికి టీ బీజేపీ పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.