తెలంగాణలో బీజేపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. 119 నియోజకవర్గాల్లో 115 అసెంబ్లీ స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో కమలం పార్టీ కంగుతిన్నది. గులాబీ పార్టీలో టికెట్ దక్కని అసమ్మతులు కనిపిస్తే తమ పార్టీలో కలిపేసుకొందామని చూసిన బీజేపీ ఆశలు దింపుడు కళ్లెం ఆశలే అయిపోయాయి. సీఎం కేసీఆర్ ఒకేసారి 115 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించినా ఓ రెండు చోట్ల చిన్న సంఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి అసంతృప్తి కనిపించలేదు. టికెట్లు దక్కినవారికి దక్కనివారు సంపూర్ణ సహకారం అందిస్తూ ప్రచార ఏర్పాట్లలో మునిగిపోయారు. బీఆర్ఎస్‌లో టికెట్లు దక్కనివారు బయటకు వస్తే తమ పార్టీలో చేర్చుకొని వారికి టికెట్లు ఇద్దామనుకొన్న బీజేపీ ఆశలు గల్లంతయ్యాయి.
బీజేపీకి కీలక నేతల రాంరాం!
తెలంగాణలో బీజేపీ పార్టీకి ఓ 25 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులున్నారు. అందులో ప్రజల్లో కాస్తోకూస్తో ఆదరణ ఉన్నవాళ్లు ఓ ఐదుగురు కూడా ఉండరు. బీఆర్ఎస్ నుంచి అసమ్మతులు వస్తారనుకొంటే ఆ కల నెరవేరలేదు. దెబ్బ మీద దెబ్బ అన్నట్టు బీఆర్ఎస్‌నుంచి అసమ్మతులు రాకపోగా.. బీజేపీనుంచే సొంతపార్టీ నాయకులు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. మొన్న వికారాబాద్‌లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి, కీలక నేత చంద్రశేఖర్ బీజేపీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) కమలం పార్టీకి రాంరాం చెప్పారు. తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి గులాబీ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకొన్నట్టు స్పష్టం చేశారు. తనతోపాటు యువమోర్చా, కిసాన్‌మోర్చా బాధ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించడంతో టీబీజేపీ నాయకులు తలలు పట్టుకొంటున్నారు. ఇతర పార్టీలనుంచి బీజేపీలోకి వలసలు వస్తాయనుకొంటే. సొంత పార్టీ నాయకులే ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతుండడంతో తెలంగాణ బీజేపీ తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది. గులాబీ పార్టీలో టికెట్లు దక్కనివారిపైనే ఆశలు పెట్టుకొన్న బీజేపీ చేరికల కమిటీలు, ఎన్నికల నిర్వహణ కమిటీలు, వాటి చైర్మన్లు నిరాశలో మునిగిపోయారు.