రేపటి నుంచి జరగనున్న శాసనసభ్యుల ఓరియంటేషన్ సెషన్‌ను బహిష్కరించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
శాసనసభ ప్రారంభానికి ముందే మా హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారు. మొదటి రోజే మమ్మల్ని లోపలికి రాకుండా పోలీసులతో అరెస్టు చేయించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా సమస్యలను ఎత్తిచూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేశారు అని కేటీఆర్ అన్నారు.
మా పార్టీ శాసనసభ్యుల అక్రమ పార్టీ ఫిరాయింపులపైన నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారు. గత శాసనసభ సమావేశాల్లోనూ మా పార్టీ సభ్యుల గొంతు నోక్కేలా వ్యవహరించారు. మాకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారు అని విమర్శించారు.
మా శాసనసభ్యుల్లో అతి తక్కువ మంది మాత్రమే కొత్త శాసనసభ్యులు ఉన్నారు.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్ వ్యవహార శైలికి నిరసనగా రేపటి నుంచి జరగనున్న ఓరియంటేషన్ సెషన్‌ను బహిష్కరిస్తున్నాము. స్పీకర్ ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా.. ఎలాంటి వివక్ష లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము అని కేటీఆర్ పేర్కొన్నారు.