mt_logo

ఇది ప్రభుత్వం సృష్టించిన విలయం: సాగర్ ఎడమ కాలువను పరిశీలించిన బీఆర్ఎస్ బృందం

నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్ద దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించి.. పంట నష్టపోయిన రైతులను మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం పరామర్శించారు.

ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన ప్రజల్ని రైతులని ధైర్యం చెప్పింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రి హరీష్ రావు గారి నేతృత్వంలో బీఆర్ఎస్ శాసనసభ్యులు బృందం రావడం జరిగింది అని తెలిపారు.

ఆపత్కాలంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం మా పార్టీకి లేదు. ప్రజలకు ధైర్యం చెప్పవలసిన ముఖ్యమంత్రి రెండు రోజుల పత్తా లేకుండా పోయి తన తప్పును దాచిపెట్టుకోడానికి కేసీఆర్ గారిపై, మా పార్టీ పై విమర్శలు చేశారు. పెళ్లికి చావుకి తేడా తెలియని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారు.. ఓదార్పు కొచ్చారా సంబరాలకు వచ్చారా అర్థం కాలేదు అని దుయ్యబట్టారు.

ఈ కాల్వకట్ట దెబ్బతినడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వమే.. రైతులు ఆధారాలు కూడా చూపిస్తున్నారు.. ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు ఖమ్మం జిల్లాకు నీళ్లు తీసుకుపోయేందుకు కాలువ కట్టమీద పోలీసులను పెట్టి తూములు మూసివేసి గాట్లకు వెల్డింగ్ చేసి నీళ్లు పోకుండా చేశారు. గేట్లకు వెల్డింగ్ చేయడం వల్ల వరద వచ్చినప్పుడు గేట్లు తెరుచుకోలేక ప్రెషర్‌కు కట్ట కొట్టుకుపోయిందని రైతులు ఆధారాలు చూపిస్తున్నారు అని అన్నారు.

ఇది ప్రకృతి విలయంతో తెగిన కాలువ కాదు.. కేవలం అధికార పార్టీ మంత్రులు చేసిన నిర్వాకం వల్లే తెగింది. ఖమ్మంలో ప్రజలు చనిపోవడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అని విమర్శించారు.

9 గంటలు సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైంది. చీకటి పడ్డాక కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముసలి కన్నీళ్లు కార్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ప్రజలను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి, మంత్రులు జల్సాల్లో మునిగితేలుతున్నారు. ఇది ప్రభుత్వం సృష్టించిన విలయం, ప్రకృతి సృష్టించిన విలయం కాదు అని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.

పంట నష్టపోవడమే కాక మరో రెండు పంటలు వేయలేని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ రైతులు తమ పొలాలను బాగుచేస్తే చాలు.. మాకు ఎలాంటి డబ్బులు అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. పూర్తిగా ఇసుక మేటలు పేరుకుపోయి రాళ్లు రంపలతో పొలాలు నిండిపోయాయి అని అన్నారు.

ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కంటే ముందే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలలో ఉన్నారు. గతంలో ఇలాంటి సమయంలో కేసీఆర్ గారు నిద్రపోకుండా మంత్రులందరిని ప్రజల్లో ఉంచి పని చేయించేవారు అని పేర్కొన్నారు.

చేతగాని కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం వల్లే ఇలా జరిగిందని రైతులు అంటున్నారు. ఇక్కడ జరిగిన నష్టానికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. పంట కొట్టుకుపోయిన పొలాలకు ఎకరాకు రూ. 50 వేల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు.