mt_logo

బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ గెలుపు ఖాయం

  • పేదలు, రైతులు రెండు కండ్లుగా కేసీఆర్ పాలన 
  • తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.. ప్రపంచ స్థాయి ప్రశంసలు అందుతున్నాయి
  • కాంగ్రెస్,బీజేపీ వల్ల పేదలకు ఒరిగిందేమీ లేదు
  • పచ్చగున్న తెలంగాణ మీద బీజేపీ విషం చిమ్ముతుంది..కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది

హైదరాబాద్: పేదలు,రైతులు రెండు కండ్లుగా కేసీఆర్ పాలన సాగుతోందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ గారి జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ కు చెందిన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు తీగల సంతోష్ అతని అనుచరులు హైదరాబాద్ లో శనివారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో అన్ని విధాల అభివృద్ధి చేసుకున్నామని మంత్రి అన్నారు. సాగునీటి రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు,మౌలిక సదుపాయాల కల్పన,మెరుగైన వైద్య సేవలు, బి.టి రోడ్లు,గ్రామాల్లో సీ . సీ రోడ్లు, సంక్షేమ పథకాలతో బాల్కొండ నియోజకవర్గం సుభిక్షం అయిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఈ సందర్బంగా చెప్పారు.

దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ అభివృద్ధి కావాలని డిమాండ్

కేసీఆర్ గారి పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ప్రపంచ స్థాయి ప్రశంసలు అందుతున్నాయని,అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఎదిగిందన్నారు. రోజు రోజుకు దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ అభివృద్ధి కావాలనే డిమాండ్ పెరుగుతోందన్నారు. “అబ్ కీ బార్ కిసాన్ సర్కార్” అంటూ దేశ మార్పు కోసం బయలుదేరిన కేసీఆర్ గారికి ప్రజల్లోంచి విశేష మద్దతు లభిస్తోందని తెలిపారు. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ వల్ల 10 ఏళ్లుగా పాలిస్తున్న బీజేపీ వల్ల పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో పచ్చగున్న తెలంగాణ మీద బీజేపీ విషం చిమ్ముతుందని, కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఎవరెన్ని సర్కస్ ఫీట్లు వేసిన.. బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ గెలుపు ఖాయమని తేల్చి చెప్పారు. ఏది ఏమైనా కేసీఆర్ నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి శ్రీరామరక్ష అని మంత్రి వేముల పునరుద్ఘాటించారు.