mt_logo

అనాలోచిత నిర్ణయాలతో బీఆర్ఎస్ నెత్తిన పాలు పోస్తున్న కాంగ్రెస్?

ప్రజాపాలన అందిస్తాం.. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం అని 420 హామీలిచ్చి తెలంగాణలో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ.. పాలన మాత్రం అస్తవ్యస్తంగా సాగిస్తుంది. కేవలం కేసీఆర్ కుటుంబం మీద ప్రతీకార యావతో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ, అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తూ సీఎంగా రేవంత్ ఫెయిలయ్యాడని ప్రజల్లో స్థూలంగా ఉన్న ఒక అభిప్రాయం.

అయితే.. గత 11 నెలలుగా తెలంగాణ రాజకీయాలను గమనిస్తే రేవంత్ అనుభవారాహిత్యం, మొండితనం బీఆర్ఎస్ పార్టీకి గట్టిగా కలిసొస్తుంది అనే విషయం స్పష్టమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓటమి, లోక్‌సభ ఎన్నికల్లో పరాభవం తర్వాత బీఆర్ఎస్ చతికిలపడింది అనే టాక్ నడుస్తున్న సమయంలో.. కాంగ్రెస్ అసమర్థత, ప్రజల సమస్యల పట్ల బీఆర్ఎస్ చేస్తున్న పోరాటం వల్ల బీఆర్ఎస్ క్రమక్రమంగా పుంజుకోవడం మొదలుపెట్టింది.

అధికార పాత్రలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమవ్వడం, ప్రతిపక్ష పాత్రలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువగా విజయవంతం అవ్వడం బీఆర్ఎస్ పునర్వైభవానికి బాటలు వేసింది. ముఖ్యంగా హైడ్రా ద్వారా ఇళ్ల కూల్చివేతలను బీఆర్ఎస్ అడ్డుకున్న తీరు, గ్రూప్స్ అభ్యర్థుల పట్ల కర్కశంగా వ్యవహరించిన రేవంత్ సర్కార్‌ను నిలదీసిన విధానం, మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులకు అండగా నిలిచిన పద్ధతి, రైతన్నల సమస్యల పట్ల పోరాడిన వైనం గులాబీ పార్టీని జనాలకి మళ్ళీ చేరువ చేసింది.

కాంగ్రెస్ వస్తే ఏదో కొత్త మార్పు వస్తుంది, బీఆర్ఎస్ ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఏదో ఇస్తారని నమ్మి, భంగపడ్డ ప్రజలు తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. కొత్త పథకాలు, కార్యక్రమాల సంగతి పక్కనపెడితే.. కేసీఆర్ తెచ్చిన పథకాలకు కోత పెడుతూ.. పైపెచ్చు తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ను ఇష్టమొచ్చినట్లు తిడుతున్న రేవంత్ తీరు పట్ల ప్రజలు గుర్రుగా ఉన్నారు.

ఒకవైపు ప్రజాపాలన అని గప్పాలు కొడుతూ.. సోషల్ మీడియాలో ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, నిరసనలపై ఆంక్షలు విధించడం, తమ హక్కుల కోసం పోరాడుతున్న వారిపై కాంగ్రెస్ సర్కార్ నిరంకుశంగా వ్యవహరించడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

కాంగ్రెస్ అయోమయ విధానాలను, అసమర్థతను, అవకతవకలను సమయానుసారంగా బయటపెట్టడంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర సీనియర్ల నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమయ్యింది. మరికొద్దిరోజుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగబోతుండడంతో.. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆగ్యమగోచరంగా మారే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజా సమస్యలను, పరిపాలనలో ఘోర వైఫల్యాలను పక్కనపెట్టి, కేవలం కేసీఆర్ కుటుంబం మీద అక్కసుతో.. అటెన్షన్ డైవర్షన్ డ్రామాలతో, హెడ్‌లైన్ మ్యానేజ్‌మెంట్‌తో రేవంత్ రెడ్డి పబ్బం గడుపుతున్నాడని జనాలు గుసగుసలాడుతున్నారు.

ఎన్నికల ముందు మార్పు, మార్పు అని ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక ప్రజలను ఏమార్చిందని మెజారిటీ ప్రజల అభిప్రాయం. ‘కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే.. మళ్ళీ కేసీఆరే వస్తడు’.. ఇదే ఇప్పుడు తెలంగాణ జనం మాట.

మొత్తానికి.. కాంగ్రెస్ ఎంత వేగంగా తప్పులు చేస్తుందో.. బీఆర్ఎస్ అంతే వేగంగా పుంజుకుంటుంది. తమ అనాలోచిత నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నెత్తిన పాలు పోస్తుంది.