mt_logo

ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డిలపై అనర్హత వేటు వేయండి.. మండలి చైర్మన్‌ను కోరిన బీఆర్ఎస్

పార్టీ మారిన ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డి పైన అనర్హత వేటు వేయాలని కోరుతూ.. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు.

జూబ్లీహిల్స్‌లోని సుఖేందర్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్సీలు ఎమ్‌యస్ ప్రభాకర్ రావు, యాదవ రెడ్డి, శేరి శుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి ఎం. రమేష్ రెడ్డి చైర్మన్‌ను కలిసి పిటీషన్‌తో పాటు పలు ఆధారాలను సమర్పించారు.

ఫిర్యాదు చేసిన అనంతరం ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు శాసన మండలి చైర్మన్‌ను కలిశాం. బీఆర్ఎస్ బీ ఫాం మీద ఎమ్మెల్సీలుగా ఎన్నికై  కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలపై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని చైర్మన్‌కు సాక్ష్యాధారాలతో పిటీషన్ సమర్పించాం అని తెలిపారు.

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించం.. చైర్మన్ మా పిటిషన్‌పై సానుకూలంగా స్పందించి ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేస్తారని భావిస్తున్నాం అని ఆశాభావం వ్యక్తం చేశారు.