mt_logo

ఇవి తెలంగాణ ద్రోహులు.. తెలంగాణ ప్రేమికులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు: ఎమ్మెల్సీ కవిత

  • కుటుంబ పాలన గురించి మాట్లాడే అర్హత ప్రియాంక గాంధీకి లేదు
  • నెహ్రూ బిడ్డ ఇందిరా గాంధీ కొడుకు రాజీవ్ గాంధీ బిడ్డ ప్రియాంక గాంధీ కుటుంబ పాలన గురించి మాట్లాడడం విడ్డూరం
  • రాహుల్ గాంధీ ప్రసంగాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు
  • లక్ష కోట్ల వ్యయం కానీ ప్రాజెక్టులో లక్ష కోట్లకు పైగా అవినీతి ఎలా జరుగుతుంది ?
  • కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్

ఆర్మూర్ : ఇవి తెలంగాణ ద్రోహులు.. తెలంగాణ ప్రేమికుల మధ్య జరుగుతున్న ఎన్నికలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సకల జనులు అంతా కలిసి సాధించుకున్న ప్రజా తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని తేల్చి చెప్పారు. కుటుంబ పాలన గురించి ప్రియాంక గాంధీ మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై తిరగబడేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. 

గురువారం రోజున ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కల్వకుంట్ల కవిత మాట్లాడారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లేనిపోని ఆరోపణలు చేశారని, సత్యదూరమైన అంశాలను మాట్లాడారని అన్నారు. వాళ్లు చెప్పేవి చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రాహుల్ గాంధీ చదువుతున్నారని, రాహుల్ గాంధీ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. 

లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించడం హాస్యాస్పందంగా ఉందని, కాళేశ్వరం, మిషన్ భగీరథ వ్యయం కలిపితే రూ. లక్ష కోట్ల లోపే ఉందని, రూ.లక్ష కోట్ల కంటే తక్కువ ఖర్చు చేసిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా చేస్తారన్నది ఆలోచించాలని సూచించారు. ఏది పడితే అది మాట్లాడితే ఓట్లు వస్తాయనుకోవడం అమాయకత్వమవుతుందన్నారు. 

“మోతిలాల్ నెహ్రూ కొడుకు జవహార్ లాల్ నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ కొడుకు రాజీవ్ గాంధీ  బిడ్డ ప్రియాంకా గాంధీ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. గ్లాస్ హౌజులో కూర్చొని ఇతరులపై రాళ్లు విసరరాదు. ఏం మాట్లాడుతున్నారో ఆలోచించుకొని మాట్లాడాలి” అని  వ్యాఖ్యానించారు.  

“మీరు ఆర్మూర్ వస్తారట. సంతోషం. గుత్ప ఎత్తిపోతల పథకాన్ని రూ. 25 కోట్లతో మరమ్మత్తు చేసుకున్నాం. ఫతేపూర్ సుప్రియాల్ లిఫ్ట్, మాక్లూర్ లిఫ్ట్ ఇలా పలు వాటికి రూ. 350 కోట్లు ఖర్చు చేశాము. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అన్ని చెరువులు నింపుకోవడంతో అవి నిండుకుండలా ఉన్నాయి.” అని రాహుల్ గాంధీని ఉద్దేశించి కల్వకుంట్ల కవిత అన్నారు.